
- జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అమెరికన్ స్టేట్ జార్జియా
జార్జియా: హిందూ ఫోబియాకు వ్యతిరేకంగా బిల్లును ప్రవేశపెట్టిన మొదటి అమెరికన్ స్టేట్‌గా జార్జియా నిలిచింది. హిందువులపై విద్వేషపూరిత దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జార్జియా సెనేట్ బిల్లు 375ను ఈ నెల 4న జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. హిందూ ఫోబియాను అధికారికంగా గుర్తించింది. ఈ బిల్లుకు ఆమోదం లభించి, చట్టంగా మారితే, జార్జియా పీనల్ కోడ్‌ను సవరిస్తారు. ఫలితంగా దర్యాప్తు సంస్థలు హిందూఫోబియా, హిందువుల పట్ల వివక్ష, విద్వేషపూరిత నేరాలపై చర్యలు చేపట్టడానికి వీలవుతుంది.
రిపబ్లికన్ సెనేటర్లు షాన్ స్టిల్, క్లింట్ డిక్సన్, డెమోక్రాట్ సెనేటర్లు జాసన్ ఎస్టీవ్స్, ఇమాన్యుయెల్ జోన్స్ ఈ బిల్లుకు స్పాన్సర్లుగా ఉన్నారు. అమెరికాలోని జార్జియా స్టేట్‌లో సుమారు 40,000 మంది హిందువులు ఉన్నారు. అట్లాంటా మెట్రోపాలిటన్ పరిసరాల్లో ఎక్కువగా నివాసం ఉంటున్నారు.
హిందూ ఫోబియాకు వ్యతిరేకంగా బిల్లు తీసుకురావడంపై కోలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా హర్షం వ్యక్తం చేసింది. మద్దతుగా నిలిచిన సభ్యులు, సంస్థలకు ధన్యవాదాలు తెలిపింది. జనరల్ అసెంబ్లీలో ఈ బిల్లుపై సభ్యులు చర్చిస్తున్నారు. జార్జియాలోని అతిపెద్ద ఇండో- అమెరికన్ కమ్యూనిటీ ‘ఫోర్సిత్ కౌంటీ’కి ప్రాతినిథ్యం వహిస్తున్న రిపబ్లికన్ ప్రతినిధులు లారెన్ మెక్‌డొనాల్డ్, టాడ్ జోన్స్ ఈ తీర్మానం ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించారు.