ఈ బిల్‌ కలెక్టర్‌ కలెక్షన్ కింగ్.. మస్తు పైసలు తీస్కుంటూ ఏసీబీకి దొరికిండు..!

ఈ బిల్‌ కలెక్టర్‌ కలెక్షన్ కింగ్.. మస్తు పైసలు తీస్కుంటూ ఏసీబీకి దొరికిండు..!

ఏసీబీ ఎన్ని దాడులు చేసి అవినీతి తిమింగళాలలను పట్టుకుంటున్నా కొందరు అధికారుల తీరు మారడం లేదు. లంచానికి మరిగిన అధికారులు చిన్న పని చేయాలన్నా చేయి తడపాల్సిందే అంటూ.. చివరికి ఏసీబీ చేతిలో చిక్కుతున్నారు. తాజాగా అవినీతికి పాల్పడుతున్న బిల్‌ కలెక్టర్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

వివరాల్లోకి వెళ్తే..  రంగారెడ్డి జిల్లా  మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ వార్డు కార్యాలయంలో బిల్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సి.మధు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఓ  పరిశ్రమకు ట్యాక్స్‌ మినహాయింపుపై లక్ష రూపాయల లంచం డిమాండ్‌ చేశాడు. బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో నిఘాపెట్టి  సోమవారం (ఫిబ్రవరి 24) బిల్‌ కలెక్టర్‌ సి.మధుతో పాటు వి.రమేష్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

ఏసీబీ అధికారులు ప్లాన్ ప్రకారం నిఘా ఉంచి 45 వేల రూపాయల లంచం తీసుకుంటున్నప్పుడు పట్టుకున్నారు. చేతి వేళ్లను రసాయన ద్రవంలో ముంచగా ఈ పరీక్షలో పాజిటివ్‌ రావడంతో డబ్బులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ.. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే ఏసీబీ అధికారులకు సమాచారం అందించాలన్నారు. ట్రోల్‌ ఫ్రీ నెంబర్‌ 1064 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. వాట్సప్‌ ద్వారా 9440446106, ఫేస్‌బుక్‌లో తెలంగాణ ఏసీబీ, ఎక్స్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.