
- బండి సంజయ్ కు.. పీసీసీ చీఫ్ మహేశ్ సవాల్
- బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధతకు అసెంబ్లీలో బిల్లు పెడ్తం
- ఓబీసీ మీటింగ్ లో బండి సంజయ్‌కి పీసీసీ చీఫ్ మహేశ్ సవాల్
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి బిల్లును ఆమోదిస్తామని, ప్రధాని మోదీని ఒప్పించి దీన్ని 9 వ షెడ్యూల్ లో చేర్పిస్తవా? అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సవాల్ విసిరారు. బండి సంజయ్‌కి ఈ సవాల్ స్వీకరించే దమ్ముందా? అని ప్రశ్నించారు. సోమవారం గాంధీ భవన్ లో జరిగిన ఓబీసీ రాష్ట్రస్థాయి సమావేశంలో మహేశ్ గౌడ్ పాల్గొని, మాట్లాడారు.
దేశవ్యాప్తంగా జన గణనతోపాటు కుల గణన నిర్వహించాలని మోదీని అడిగే సత్తా బండి సంజయ్ కి ఉందా? అని నిలదీశారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లకు చట్టబద్ధత కోసం అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించి, పార్టీలకతీతంగా నాయకులను ఢిల్లీ తీసుకువెళ్లి మోదీని కలుస్తామని చెప్పారు. కుల గణనతో తెలంగాణలో బీసీలకు కొత్త అధ్యాయం మొదలైందని, బీసీలంతా ఏకతాటిపైకి రావాల్సినఅవసరం ఉందని పిలుపునిచ్చారు. బీసీల్లో ఐక్యత లోపించిందని, రాబోయే రోజుల్లోనైనా ఐక్యంగా నిలిచి రాజకీయంగా తమ హక్కులను సాధించుకునే దిశగా ముందుకు సాగాలని సూచించారు.
భవిష్యత్తు బీసీలదే
దేశంలోనైనా, రాష్ట్రంలో నైనా భవిష్యత్తు బీసీలదేనని మహేశ్‌గౌడ్ పేర్కొన్నారు. బీసీ నాయకుడిని సీఎం చేసే సత్తా కేవలం కాంగ్రెస్ కు మాత్రమే ఉందని చెప్పారు. తమ నేత రాహుల్ గాంధీ ఆశయం మేరకు కుల గణన సర్వే నిర్వహించామని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బీసీ నాయకుడిని సీఎం చేయగలవా? అని ప్రశ్నించారు.
కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ తన ఆధ్వర్యంలో ప్రవేశపెట్టామని, బండి సంజయ్ ని బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తే పార్టీలకతీతంగా స్పందించామని గుర్తు చేశారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని, కమీషన్ల కోసం ప్రాజెక్టులు కట్టిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిది అని మండిపడ్డారు.
సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టాలని, బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను కోరారు. ఈ ప్రోగ్రామ్ లో కాంగ్రెస్ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు అజయ్ సింగ్ యాదవ్, ఓబీసీ రాష్ట్ర నేతలు పలువురు పాల్గొన్నారు.