కాంట్రాక్టుల కోసం అదానీ లంచాలు..న్యూయార్క్​ కోర్టులో క్రిమినల్​ కేసు

కాంట్రాక్టుల కోసం అదానీ లంచాలు..న్యూయార్క్​ కోర్టులో క్రిమినల్​ కేసు
  • ఐదు రాష్ట్రాల్లో  రూ.2,200 కోట్ల ముడుపులు
  • ఏపీలోనే రూ. 1,750 కోట్లు..  2021 నుంచి 2023 మధ్య నడిచిన బాగోతం
  • న్యూయార్క్​ కోర్టులో క్రిమినల్​ కేసు
  • గౌతమ్​ అదానీ, ఆయన మేనల్లుడు, మరో ఆరుగురిపై అరెస్ట్​ వారెంట్
  • అమెరికన్ పెట్టుబడిదారులను మోసం చేశారని ఆరోపణలు
  • దేశంలో రాజకీయ దుమారం.. నిరాధార ఆరోపణలన్న అదానీ గ్రూప్

న్యూయార్క్/న్యూఢిల్లీ : పారిశ్రామిక దిగ్గజం, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్​ కోర్టులో క్రిమినల్ కేసు ఫైల్​ అయింది.  గౌతమ్​అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీతోపాటు మరో ఆరుగురికి  కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. సోలార్ పవర్ కాంట్రాక్టులు పొందడం కోసం ఆంధ్రప్రదేశ్​, ఒడిశా, చత్తీస్ గఢ్, తమిళనాడు, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన గుర్తుతెలియని అధికారులు, వ్యక్తులకు రూ. 2 వేల 200 కోట్ల లంచాలు ఇచ్చారని కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. 

అమెరికన్ పెట్టుబడిదారులను మోసం చేసి సేకరించిన ఫండ్స్ తోనే ఈ ముడుపులు చెల్లించారని ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా కెనడా కంపెనీతో కలిసి విచారణను అడ్డుకునేందుకు కుట్ర చేశారని మరో కేసు కూడా ఫైల్ అయింది. ఈ లంచాల్లో ఏకంగా రూ. 1,750 కోట్లు 2021 నుంచి 2023 మధ్యలో ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వంలోని ఆఫీసర్లు, వ్యక్తులకు ఇచ్చినట్లు బయటకు వచ్చింది. ఆ టైమ్​లో ఏపీలో జగన్​ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 

అదానీపై వచ్చిన తాజా ఆరోపణలు, కేసుతో దేశవ్యాప్తంగా కలకలం చెలరేగింది. స్టాక్​ మార్కెట్లు కుప్పకూలాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్​ రాజకీయాల్లో ఈ ఘటన సంచలనంగా మారింది. కాగా.. న్యూయార్క్ కోర్టులో నమోదైన అభియోగాలు నిరాధారమని, వాటిపై న్యాయపరంగా పోరాటం చేస్తామని అదానీ గ్రూప్ ప్రకటించింది. తాము చట్టబద్ధంగా నడుచుకుంటూనే వ్యాపారాలు నిర్వహిస్తున్నామని పేర్కొంది. 

రాజకీయ దుమారం 

అదానీపై వచ్చిన తాజా ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో పొలిటికల్​ హీట్​ రాజుకుంది.  సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఈ వ్యవహారంపై పార్లమెంట్ అట్టుడికే అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో పెట్టుబడుల సేకరణ కోసం అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ జారీ చేసిన 600 మిలియన్ డాలర్ల(రూ. 5 వేల కోట్లు) బాండ్లను న్యూయార్క్ కోర్టు రద్దు చేసింది. 

కాగా, అదానీ గ్రూప్ పై 2023 జనవరిలోనూ అమెరికన్ రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ విడుదల చేసిన రిపోర్ట్ తోనూ పెను దుమారం రేగింది. అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతోందంటూ ఆరోపణలు రావడంతో కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా రూ. 2.19 లక్షల కోట్ల మేరకు పతనమైపోయింది. తాజాగా న్యూయార్క్ కోర్టులో కేసులు నమోదు కావడం మరింత సంచలనంగా మారింది. 

లంచాల కోసం స్పెషల్ స్కీం! 

ఆయా రాష్ట్రాల అధికారులకు లంచాలు ఇచ్చి, సోలార్ పవర్ కాంట్రాక్టులను పొందడం కోసం అదానీ గ్రూప్ ఒక స్పెషల్ స్కీంనే రూపొందించిందని అమెరికన్ ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. లంచాల స్కీంను అమలు చేయడంలో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, అదానీ గ్రీన్ ఎనర్జీ సీఈవో వినీత్ జైన్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. వీరికి యూఎస్ ఇష్యూయర్ కంపెనీకి అనుబంధంగా ఉన్న ఓ కంపెనీ సీఈవో రంజిత్ గుప్తా, యూఎస్ ఇష్యూయర్ మాజీ కన్సల్టెంట్ రూపేశ్ అగర్వాల్, కెనడియన్ కంపెనీకి చెందిన సిరిల్ కాబనీస్, సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా సహకరించారని తెలిపారు. 

‘‘సోలార్ కాంట్రాక్ట్ కోసం లంచాలకు సంబంధించిన ఈ స్కీం వివరాలతో నిందితులు పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ ను తయారు చేశారు. ఈ లంచాల వ్యవహారానికి సంబంధించిన వివరాలను సాగర్ అదానీ తన సెల్ ఫోన్ ద్వారానే ట్రాక్ చేశారు. ఎవరెవరికి ఎంత లంచం ఇవ్వాలన్న వివరాలతో కూడిన డాక్యుమెంట్ ను వినీత్ జైన్ తన సెల్​ఫోన్ తో ఫొటో తీసుకున్నారు. రూపేశ్ అగర్వాల్ ఈ లంచాల స్కీంను వివరించేందుకు పవర్ పాయింట్, ఎక్సెల్ సమ్మరీలను సిద్ధం చేశారు. వీటిని ఇతర నిందితులకు షేర్ చేశారు. ఇక సిరిల్ కాబేన్స్, సౌరభ్, దీపక్ మల్హోత్రాలు ఎఫ్ సీపీఏ (ఫారిన్ కరప్ట్ ప్రాక్టీస్ యాక్ట్) చట్టాలను ఉల్లంఘించడంతోపాటు న్యాయ విచారణకు ఆటంకం కలిగించారు” అని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.

ఇక్కడ అవినీతి..అక్కడ కేసు ఎలా? 

అదానీ గ్రూప్ ఇండియాలోనే అధికారులకు లంచాలు ఇచ్చి అక్రమంగా కాంట్రాక్టులు పొందినప్పటికీ, లంచాలు ఇచ్చేందుకు వినియోగించిన డబ్బును అమెరికన్ పెట్టుబడిదారులు, బ్యాంకర్లు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి సేకరించినందున అక్కడి చట్టాలను ఉల్లంఘించినట్టేనని ప్రాసిక్యూటర్లు స్పష్టం చేశారు. అమెరికన్ ఇన్వెస్టర్లకు తప్పుడు సమచారం ఇచ్చి, వారిని తప్పుదోవ పట్టించారన్నారు. అందుకే అవినీతి ఇండియాలో జరిగినా.. అమెరికన్ పెట్టుబడిదారులు, కంపెనీలను మోసం చేసినందున యూఎస్ చట్టాల ప్రకారం విచారణ ఎదుర్కోవాల్సిందేనని పేర్కొన్నారు. 

అప్పటి ఏపీ సీఎంను అదానీ కలిశారు.. 

సోలార్ కాంట్రాక్టులు పొందేందుకు అదానీ గ్రూప్ ఏం చేసిందనేది ప్రాసిక్యూటర్లు కోర్టుకు వివరించారు. సోలార్ పవర్ కాంట్రాక్టుల కోసం 2021 నుంచి 2023 మధ్యలో అదానీ నేరుగా ఏపీ, ఇతర రాష్ట్రాల అధికారులను కలిసి చర్చలు జరిపారని తెలిపారు. అదానీ ఏపీ సర్కారులో అత్యంత కీలకమైన వ్యక్తిని కలిశారని, ఆ వ్యక్తిని ‘ఫారిన్ అఫీషియల్ #1’గా కేసులో పేర్కొన్నారు. “ఆయా రాష్ట్రాలకు 8 వేల మెగావాట్ల (8 గిగావాట్లు) సోలార్ పవర్ ను సరఫరా చేయడం కోసం అదానీ గ్రూప్ 2021లో బిడ్ ను గెలుచుకుంది. కానీ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కోరిన ధరకు సోలార్ కరెంట్ సరఫరాకు అంగీకరించలేదు. 

ఆ తర్వాత అప్పటి ఏపీ ముఖ్యమంత్రిని అదానీ కలిశారు. ఆ మీటింగ్ తర్వాత అదానీ గ్రూప్ నుంచి 7 వేల మెగావాట్ల సోలార్ కరెంట్ ను కొనుగోలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ఈ కాంట్రాక్టు పొందడం కోసం ఏపీ అధికారులకు ఒక మెగావాట్ కు రూ. 25 లక్షల చొప్పున మొత్తం రూ. 1,750 కోట్లను అదానీ గ్రూప్ లంచంగా చెల్లించింది. ఒడిశా కూడా ఇదే పద్ధతిలోనే 500 మెగావాట్ల విద్యుత్ ను కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 125 కోట్ల లంచాలు చెల్లించారు” అని కోర్టు డాక్యుమెంట్ లో పేర్కొన్నారు.  

కోడ్ నేమ్స్​తో వాట్సాప్ చాట్లు 

లంచాల స్కీం అమలు కోసం నిందితులు వాట్సాప్ లో చాటింగ్ చేశారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ‘‘గౌతమ్ అదానీని ‘ఎస్ఏజీ (సూపర్ అగ్రిగేటర్)’, ‘న్యూమెరో యూనో’, ‘ద బిగ్ మ్యాన్’ అని.. వినీత్ జైన్ ను ‘వి’, ‘స్నేక్’, ‘న్యూమెరో యూనో మైనస్ వన్’ అని కోడ్ నేమ్స్ తో పిలుచుకున్నారు” అని వెల్లడించారు. ఎఫ్ బీఐ అధికారులు మార్చి 17, 2023న అమెరికాలో సాగర్ అదానీ నివాసంలో సోదాలు చేసి, అతని సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ డివైస్ లు స్వాధీనం చేసుకున్నారని, వాటి నుంచి రిట్రైవ్ చేసిన డేటాతోనే ఈ మొత్తం లంచాల వ్యవహారం అంతా బయటపడిందన్నారు.

 20 ఏండ్ల పాటు 200 కోట్ల డాలర్ల (రూ. 16 వేల కోట్లు) విలువైన కాంట్రాక్టులు పొందడం కోసం అదానీ, ఆయన మేనల్లుడు సాగర్, ఇతర నిందితులు రూ. 2,200 కోట్ల లంచాలు ఇచ్చేందుకు పథకం రచించారని తెలిపారు. సోలార్ పవర్ కాంట్రాక్టుల కోసం ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధికంగా రూ. 1,750 కోట్ల మేరకు లంచాలను అదానీ గ్రూప్ ఇచ్చినట్టు న్యూయార్క్ కోర్టుకు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. 

ఆరోపణలు అబద్ధం : అదానీ గ్రూపు

సోలార్​కరెంట్​ కాంట్రాక్టుల కోసం నిబంధనలను అనుకూలంగా మార్చుకునేందుకు లంచం చెల్లించినట్లు ఆరోపణలను అదానీ గ్రూప్ గురువారం ఖండించింది. యూఎస్ ప్రాసిక్యూటర్ల ఆరోపణలు నిరాధారమైనవని స్పష్టం చేసింది.  అన్ని చట్టపరమైన మార్గాల్లో పోరాడుతామని ప్రకటించింది.   అదానీ గ్రీన్ డైరెక్టర్లపై యూఎస్​ డిపార్ట్‌‌మెంట్ ఆఫ్ జస్టిస్  యూఎస్​ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని గ్రూప్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. 

తమపై వచ్చినవి ఆరోపణలు మాత్రమేనని,  దోషులుగా రుజువయ్యే వరకు నిందితులు నిర్దోషులేనని అన్నారు. అదానీ గ్రూప్ ఎల్లప్పుడూ నిబంధనలను పాటిస్తుందని, చట్టాలను గౌరవిస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ వాటాదారులకు, భాగస్వాములకు,  ఉద్యోగులకు హామీ ఇస్తున్నామని కంపెనీ ప్రతినిధి వివరించారు.