కొన్నాళ్ళు బతికినా రాజాలా బతకాలని మనలో చాలా మంది అనుకుంటుంటాం కానీ అందరికీ సాధ్యపడదు. ధనవంతులను, సెలబ్రిటీలను చూసి లైఫ్ అంటే అలా ఉండాలి అనుకునేవారు కూడా చాలా మంది ఉంటారు. ఆ కోవకు చెందిన ఒక వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. అతనే ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన ఆస్ట్రియన్ బిలియనీర్ రిచర్డ్ లంగర్. వియన్నా ఓపెరా బాల్ ఈవెంట్ లో ప్రపంచ అందగత్తెలతో డేట్ చేయటం కోసం కోట్లు ఖర్చు చేసి ఫేమస్ అయ్యాడు లంగర్. కిమ్ కార్డిషియన్ తో డేట్ కోసం 5లక్షల డాలర్లు సమర్పించుకున్నాడు.
నెల రోజుల కిందటే ఆరో పెళ్లి చేసుకున్న లంగర్ 91ఏళ్ళ వయసులో మరణించాడు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లంగర్ కి ఇటీవలే హార్ట్ సర్జరీ కూడా అయినట్లు తెలుస్తోంది. నిర్మాణ రంగంలో దిగ్గజమైన లంగర్ సోమవారం ఆస్ట్రియాలో తన వియన్నీస్ విల్లాలో మరణించాడు. లంగర్ నెల రోజుల క్రితమే 42ఏళ్ళ సిమోన్ రెలీయాండర్ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. లంగర్ కు నలుగురు పిల్లలు.