ఖమ్మం, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పేరున్న ఖమ్మం మిర్చి మార్కెట్లో వ్యాపారుల మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మేలు రకం మిర్చిని తాలుగా చూపిస్తూ ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొడుతున్నారు. రెగ్యులర్ గా మార్కెట్ కు వస్తున్న మిర్చి పంటతో పాటు, కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన నెంబర్ వన్ క్వాలిటీ మిర్చిని కూడా రికార్డుల్లో ఆర్డీ(తాలు)గా నమోదు చేస్తున్నారు. దీనికి రైతులకు ధర చెల్లిస్తున్నా, ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్సుల్లో తక్కువ చూపించేందుకు ఈ జిమ్మిక్కులకు పాల్పడుతున్నారు. క్వింటా రూ.22 వేలకు రైతుల నుంచి కొన్న మిర్చిని రూ.6 వేలకు కొన్నట్టుగా బిల్లు ఇస్తున్నారు. ఇదే రేటుపై ఇతర రాష్ట్రాలకు లారీల్లో సరుకును తరలిస్తూ పన్నులు ఎగ్గొడుతున్నారు.
ఇతర దేశాలకు ఎగుమతి చేసే మిర్చికి మాత్రం ఎక్స్ పోర్ట్ రూల్స్ ప్రకారం కొందరు ట్రేడర్లు ట్యాక్స్ లు కడుతున్నా, ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకు పంపించే వ్యాపారులు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. బుధవారం ఇలా ఆర్డీ (తాలు) పేరుతో మిర్చిని తరలిస్తున్న రెండు లారీలను కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పట్టుకున్నారు. గురువారం ఒక కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసిన మేలు రకం మిర్చిని తాలుగా చూపిస్తూ, వ్యాన్ లో ఎక్కిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బస్తాల్లో ఉన్న మిర్చి ఎర్రగా మంచి క్వాలిటీతో కనిపిస్తుండగా, రైతుకు ఇచ్చిన కంప్యూటర్ బిల్లులో మాత్రం రూ.6వేలకు కొన్నట్టుగా ఉండడం గమనార్హం.
అక్రమాలు బయటపెట్టిన తోటి వ్యాపారి
మిర్చి కొనుగోలు ధరలో వ్యాపారులు 5 శాతం జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. రూ.20 వేలకు పైన రేటుకు కొంటున్నా.. లారీ సరుకుకి లక్షల్లో ట్యాక్స్ కట్టాల్సి వస్తుండడంతోనే తాలుగా చూపిస్తున్నారు. ఇది మార్కెట్లో కామన్ గా జరిగే వ్యవహారమేనని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇటీవల చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఓ వ్యాపారి మార్కెట్లో జరుగుతున్న దందాలను రెండు రోజులుగా బయటపెడుతున్నాడు. బుధవారం లారీలను కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పట్టుకోవడం వెనుక అతడే ఉన్నాడంటూ గురువారం మార్కెట్లో ఆ వ్యాపారిని మిగిలినవారు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా రెండు వర్గాలకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో దాదాపు గంటన్నర పాటు మిర్చి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఆ తర్వాత ఆ వ్యాపారి మీడియా ముందు మార్కెట్లో జరిగే మోసాలను వివరించగా, దానికి చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కౌంటర్ ఇచ్చారు. మధ్యాహ్నానికి ఈ రెండు వర్గాలు మార్కెట్ కమిటీ ఆఫీసులో సీక్రెట్ గా సమావేశమై రాజీ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. ఈ వివాదాలు మీడియా ముందుకెళ్తే, గొడవ పెద్దగా మారి తమ ఉద్యోగాలపై ప్రభావం పడుతుందంటూ మార్కెట్ అధికారి ఒకరు ఈ సమన్వయ సమావేశంలో కీలక పాత్ర పోషించినట్టు సమాచారం.
మా దృష్టికి రాలేదు
చాంబర్ ఆఫ్ కామర్స్ కు సంబంధించిన వ్యాపారుల మధ్య గొడవ జరిగిన మాట వాస్తవమే. మిర్చిని తాలుగా చూపిస్తున్న అంశం మా దృష్టికి రాలేదు. ఏ రకం మిర్చి అయినా మార్కెట్ కు ఒక్క శాతం సెస్ కట్టాల్సి ఉంటుంది. ఇతర పన్నులకు సంబంధించిన విషయం మా శాఖ పరిధిలో లేదు.
– రుద్రాక్షల మల్లేశం, ఖమ్మం మార్కెట్ సెక్రటరీ