పనులు చేయకుండానే..పంచాయతీ నిధులకు ఎసరు

పనులు చేయకుండానే..పంచాయతీ నిధులకు ఎసరు
  •     జీపీలో బీఆర్​ఎస్​ సర్పంచుల చేతివాటం
  •     ఏఈలతో  కుమ్మక్కు
  •     చెయ్యని పనులకు బిల్లులు  
  •     ఎస్ఎఫ్ సీ ,15 ఫైనాన్స్ ఫండ్స్ ను కాజేసేయత్నం

గద్వాల, వెలుగు : సర్పంచుల పదవీకాలం చివరి దశకు చేరడంతో కొందరు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేయని పనులకు బిల్లులు పెట్టి పంచాయతీ ఖాతాల్లో  నుంచి డబ్బులు డ్రా చేసుకునేందుకు  ప్రయత్నిస్తున్నారు.  జోగులాంబ గద్వాల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉండగా..   రూ. 4.20 కోట్ల ఎస్ ఎఫ్ సీ ఫండ్స్, 15 ఫైనాన్స్ ఫండ్స్ కింద రూ. 5. 30 కోట్ల  ఫండ్స్  పంచాయతీ ఖాతాల్లో ఉన్నాయి.  ఈ నిధులను తీసుకునేందుకు సర్పంచులు, ఏఈలు కుమ్మక్కై ఎంబీలు రికార్డు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.   

ఇలా కాజేసే యత్నం.. 

మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి మంచినీరు ఇస్తున్నప్పటికీ బోరు మోటార్లు చెడిపోయాయని, పైప్ లైన్లు రిపేరు చేశామని, మురికి కాలువలు క్లీనింగ్ చేశామని ఎంబీలు రికార్డు చేసి బిల్లులు పెడుతున్నారు.   జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలలో వెయ్యి మందికి పైగా పారిశుధ్య  కార్మికులు ఉన్నారు.  వారు పనులు చేస్తున్నప్పటికీ మళ్లీ పంచాయతీల్లో  అదనంగా  కార్మికులను పెట్టుకొని పనులు చేశామని పలువురు సర్పంచులు బిల్లులు పెడుతున్నారు.  పనులు చేయకపోయినా..  పైప్ లైన్లు రిపేరు చేశామని, బోర్ మోటార్లు తీసుకొచ్చామని ఇలా రకరకాలుగా    లక్షల్లో బిల్లులు  పెట్టి, డ్రా చేసేందుకు యత్నిస్తున్నారు.

ప్రతినెలా లక్షల్లో బిల్లులు

గ్రామపంచాయతీలో పారిశుధ్య  కార్మికులు ఉన్నప్పటికీ   అదనంగా లేబర్ ని పెట్టుకొని పనులు చేశామని చెప్పి నెలకు రూ. లక్షల  బిల్లులు తీసుకున్న ఘటనలు  వెలుగులోకి వస్తున్నాయి. రాజోలి గ్రామపంచాయతీలో 21 మంది వరకు పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వారు ప్రతిరోజు గ్రామంలో పారిశుద్ధ పనులు చేస్తూనే ఉన్నారు.  అయినప్పటికీ వారిని కాదని  నెలకు లక్షన్నర పారిశుధ్య  కార్మికుల పేరిట బిల్లులు చేసుకుంటున్నారని వినిపిస్తోంది.   అలాగే గట్టు గ్రామపంచాయతీలో వీధిలైట్లు వేయకున్నా.. వేసినట్లు రికార్డులు సృష్టించి డబ్బులు దండుకునే ప్రయత్నం చేశారనే ఆరోపణలున్నాయి.  

గ్రామ పంచాయతీలో పారిశుధ్య కార్మికుల పేరిట కూడా బిల్లులు పెట్టారనే విమర్శలు ఉన్నాయి. అయిజ మండలం మేడికొండ గ్రామంలో పారిశుధ్య  పనులు, మోటార్ల రిపేర్ల పేరిట లక్షల బిల్లులు పెట్టారని పలువురు అంటున్నారు.  ఇటిక్యాల, ధరూరు గ్రామపంచాయతీలలో కూడా ఇదేవిధంగా బిల్లులు పెట్టి ఆ ఫండ్స్ ను కాజేసేందుకు యత్నిస్తున్నారే విమర్శలు వస్తున్నాయి. నెల నెలా  గ్రామపంచాయతీలకు వచ్చే ఫండ్స్ ద్వారా పారిశుధ్య  కార్మికులకు జీతాలు, ట్రాక్టర్ ఈఎంఐలు,  డీజిల్ కు ఖర్చు చేస్తున్నారు. అయినా  మళ్లీ  పారిశుధ్య పనులు చేశామని చెప్పి బిల్లులు దండుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.   

తొలిసారి చెక్కుల ద్వారా ఫండ్స్ డ్రాకు పరిమిషన్

గత ప్రభుత్వం సర్పంచులు ఫండ్స్ డ్రా చేసుకునేందుకు అనుమతి అనుమతి  ఇచ్చింది. ఇప్పుడు వాళ్లు తీర్మానం పెట్టేసుకొని బిల్లులు  డ్రా చేసుకునేందుకు యత్నిస్తున్నారు.  వీటికి  ఆఫీసర్లు కొందరు సెక్రటరీలు అడ్డు చెబుతుండడంతో   జిల్లాస్థాయి లీడర్లు ప్రజాప్రతినిధులతో ఒత్తిడి చేయించి డబ్బులు డ్రా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తున్నది.  సర్పంచులు ఎక్కువగా బీఆర్ఎస్   వాళ్ళే ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంతో ఆ తర్వాత బిల్లులు రావనే ఉద్దేశంతో ఇప్పుడే ఆఫీసర్లపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చి ఆ డబ్బులు గుజేందుకు  ప్రయత్నిస్తున్నారని విమర్శలు ఉన్నాయి.

మా దృష్టికి వస్తున్నాయి

చెయ్యని పనులకు బిల్లులు తీసుకుంటున్న  విషయాలు మా దృష్టికి వస్తున్నాయి. చాలాచోట్ల బిల్లులు ఇవ్వకుండా చూస్తున్నాం. ప్రస్తుతం చేసిన పనులకు మాత్రమే బిల్లులు ఇస్తాం. ఎట్టి పరిస్థితుల్లో చేయని పనులకు బిల్లులు ఇవ్వం.

 శ్యాంసుందర్ , డీపీఓ గద్వాల