
సింగరేణిలో అద్దె వెహికల్స్ బాగోతం
నిర్వాసితుల పేర దళారుల టెండర్లు
మందమర్రి, వెలుగు: సింగరేణిలో అద్దె వాహనాల్లో బినామీల హవా కొనసాగుతోంది. భూనిర్వాసితులకు ఎంతోకొంత ముట్టజెప్పి వారి పేరిట దళారులు వెహికల్స్ పెట్టి జేబులు నింపుకుంటున్నారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో ఈ దందాను సింగరేణి మేనేజిమెంట్ కట్టడిచేయలేకపోతోంది. తాజాగా మందమర్రి ఏరియాలో 14 కొత్త వెహికల్స్ కోసం సింగరేణి టెండర్లు పిలిచింది. మంగళవారం వరకు టెండర్లు దాఖలు చేయడానికి గడువుంది. దీంతో బినామీలు నిర్వాసితులతో బేరసారాలు మొదలుపెట్టారు. రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల వరకు గుడ్విల్ఆశ చూపి వారి పేర టెండర్లు వేస్తున్నారు.
బినామీల చేతుల్లోనే వెహికల్స్ …
సింగరేణిలో అవసరమైన వెహికల్స్‌ను యాజమాన్యం అద్దెకు తీసుకుంటుంది. ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన వారి నుంచి వెహికల్స్ హైర్ చేసుకోవడానికి సింగరేణి ప్రయారిటీ ఇస్తుంది. వారు టెండర్లు వేయకపోతే రిటైర్డు కార్మికుల కుటుంబాల్లోని అన్‌ఎంప్లాయిడ్ యూత్‌కు ఇస్తుంది. రోజుకు 12 నుంచి 24 గంటల పాటు నడిపించేలా.. 3 నుంచి ఐదేండ్ల కాలానికి వెహికల్స్ హైర్ చేసుకుంటుంది. రోజుకు నడిచే టైమ్‌ను బట్టి ఒక్కో వెహికల్‌కు నెలకు రూ.24 వేల నుంచి రూ.60వేల అద్దె చెల్లిస్తారు. 24 గంటలు హైర్ చేసుకుంటే రూ.80వేల వరకు ఇస్తారు. సింగరేణి వ్యాప్తంగా వందల్లో హైర్ బండ్లు నడుస్తున్నాయి. ఇందులో సగానికి సగం బినామీలవేనన్న ఆరోపణలున్నాయి.
గుడ్‌విల్ పేరుతో దందా…
భూనిర్వాసితులకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుండడంతో బినామీలు వారి పేర్లను వాడుకుంటున్నారు. ఒక్కొక్కరు పది, పదిహేను బండ్లు పెట్టి లక్షల్లో దండుకుంటున్నారు. చాలాకాలంగా ఈ దందా చేస్తున్న వారు సింగరేణి ఆఫీసర్లతో జత కట్టి ఇతరులెవరూ ఇందులోకి అడుగు పెట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. గుడ్‌విల్ ఆశచూపో, బెదిరించో కొత్తవాళ్లు టెండర్లు వేయకుండా చూసుకుంటున్నారు. మందమర్రి ఏరియాలో కళ్యాణిఖని ఓసీపీ వల్ల ఎర్రగుంటపల్లి, ఊరుమందమర్రి, కాసిపేట మండలంలోని కొందరు భూములు కోల్పోయారు. కొంత మంది బినామీలు వీరిని కలిసి గుడ్‌విల్ ఆశ చూపి.. వారి పేర్ల మీద టెండర్లు దాఖలు చేసినట్టు తెలుస్తోంది. శ్రీరాంపూర్, బెల్లంపల్లి, గోదావరిఖని ప్రాంతాలకు చెందిన నిర్వాసితులతో కూడా టెండర్లు వేయించినట్టు చెప్తున్నారు. మందమర్రికి చెందిన పలువురు వెహికల్ ఓనర్లు టెండర్లు వేయించడంలో కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. గతంలో బినామీలు చేసుకున్న అగ్రిమెంట్‌ను కాదని నిర్వాసితులకు కేవలం రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు మాత్రమే ఇచ్చారని, వారు వినకపోతే ఆఫీసర్లతో రకరకాలుగా బెదిరింపులకు దిగారన్న ప్రచారం ఉంది. వెహికల్స్ దందాను సింగరేణి విజిలెన్స్‌విభాగం పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. బినామీలు నిర్వాసితుల పేర టెండర్లు దక్కించుకుకోవడంతో రిటైర్డు కార్మికుల పిల్లలకు అన్యాయం జరుగుతోంది.
విజిలెన్స్ చర్యలు తీసుకోవాలె
సింగరేణిలో భూనిర్వాసితుల పేర్లతో ఇతరులు వాహనాలను ఏర్పాటు చేస్తున్న వ్యవహారంపై విజిలెన్స్ ఆఫీసర్లు దృష్టి పెట్టాలని -ఏఐటీయూసీ లీడర్ భీమనాథుని సుదర్శనం డిమాండ్ చేశారు. నిర్వాసితులే వాహనాలను పెట్టుకునేలా ప్రోత్సాహించాలి. రిటైర్డు కార్మికుల పిల్లలకు సమాన అవకాశం కల్పించాలె.
For More News..
రిజిస్ట్రేషన్ కొత్త రూల్స్‌తో గందరగోళం.. పొద్దంతా సర్వర్ తిప్పలు
60 ఏళ్లు దాటిన రైతులకు 3వేల పెన్షన్ ఇచ్చే ఆలోచనలో కేంద్రం
ఫేస్బుక్ లైవ్‌లో ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు