రైతులను మోసం చేస్తున్న 12 మంది పత్తి వ్యాపారుల బైండోవర్

రైతులను మోసం చేస్తున్న  12 మంది పత్తి వ్యాపారుల బైండోవర్

తల్లాడ, వెలుగు : లైసెన్స్ లేకుండా రైతులు వద్ద పత్తి కొనుగోలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న తల్లాడ మండలం బాలపేట, అన్నారుగూడెం గ్రామాలకు చెందిన 12 మంది వ్యాపారులను గురువారం తల్లాడ తహసీల్దార్ వనజ ఎదుట పోలీసులు బైండోవర్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయా గ్రామాల్లో ట్రాలీ ఆటోలతో రైతుల వద్ద పత్తి కొనుగోలు చేస్తూ తూకంలో తేడా చేస్తూ మోసం చేస్తున్నారు.

 రెండు రోజుల కింద ఎర్రుపాలెం మండలం, చర్లలో పత్తి కొనుగోలు చేసే క్రమంలో తూకంలో తేడా చేయడంతో వారిని రైతులు పట్టుకొని చితకబాధితన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనికి స్పందించిన తల్లాడ పోలీసులు గురువారం తెల్లవారుజామున పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో వీరి ఆటోలు, మినీ వ్యాన్ లను ఆపి స్టేషన్ కు తరలించారు. వారి వద్ద ఉన్న పత్తి కొనుగోలు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. 12 మంది పత్తి వ్యాపారులను ముందస్తు చర్యల కింద బైండోవర్ చేసినట్లు ఎస్సై బి.కొండలరావు తెలిపారు.