ట్రీట్‌మెంట్ కోసం తన దగ్గరికొచ్చిన రోగులకు పరీక్షలు చేసి రోగానికి తగ్గ మందులిచ్చి పంపిస్తారు డాక్టర్లు. కొంతమంది డాక్టర్లయితే.. మాటల తోనే.. ధైర్యం చెప్పి సగం రోగం తగ్గించేస్తారు. అయితే.. ఈ డాక్టర్ మాత్రం కాస్త డిఫరెంట్. ఆమె ప్రజల దగ్గరికే వెళ్లి ట్రీట్‌మెట్ ఇస్తుంది. ‘రోగుల కోసం వైద్యం కానీ కోసం రోగులు కాదు’ అంటుంది.
ఆమెకు పల్లె వాతావరణం అన్నా.. పల్లెటూరి మనుషులన్నా చాలా ఇష్టం. వృత్తిరీత్యా డాక్టరైనా.. నిత్యం పల్లె ప్రజలతో గడపడానికే ఇష్టపడతారామె. అందుకే.. ప్రతీ వారం ఓ వెహికిల్ తీసుకొని ఏదో ఒక మారుమూల పల్లెటూరికి ప్రయాణమవుతారు. ఆమె వెళ్లేది.. పల్లెటూరి అందాలను చూడడానికో, ప్రకృతిని ఆస్వాదించడానికో అనుకుంటే పొరపాటే. అక్కడి ప్రజలకు, రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు వైద్యం చేయడానికి. ఇంతకీ ఆ డాక్టర్ పేరు చెప్పలేదు కదూ.. ఆమె పేరు డాక్టర్ బిందూ మీనన్. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పుట్టి పెరిగినా.. డాక్టర్‌గా మాత్రం.. తెలుగు మీద, తెలుగు ప్రజల మీద ఉన్న అభిమానంతో ఆంధ్రాలో స్థిరపడ్డారు.
చాలామంది లేడీ డాక్టర్లలో ఎక్కువగా గైనకాలజిస్టులు, పిల్లల స్పెషలిస్ట్‌లు ఉంటారు. డాక్టర్ బిందు మాత్రం మెదడు, నరాల సమస్యలను పరిష్కరించే న్యూరాలజీ విభాగాన్ని ఎంచుకున్నారు. ‘ఒక మనిషి మనుగడకు, శరీర కదలికలకు మెదడు, నరాలే కీలకం. అందుకే.. నేను న్యూరాలజిస్టు కావడమే లక్ష్యంగా పెట్టుకొని చదివాను’ అంటారు బిందు. 2008లో తిరుపతిలో మంచి న్యూరాలజిస్టుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారామె.
అందరితో ఆప్యాయంగా నవ్వుతూ పలకరించే డాక్టర్ బిందు సేవల వల్ల ఎంతోమంది ప్రాణాలు నిలిచాయి. ‘ఇక మామూలు మనిషి కాలేరు’ అనుకున్న వాళ్లను సైతం.. మామూలు స్థితికి తెచ్చారు. మెదడు, నరాలకు సంబంధించిన ఏదైనా వ్యాధి వస్తే.. దానికి తగిన చికిత్స చేయించుకోవడం కోసం ఖర్చు కాస్త ఎక్కువే అవుతుంది.
డబ్బున్న వాళ్లైతే ఎంతైనా ఖర్చు పెట్టి చికిత్స చేయించుకోగలరు. కానీ.. పేద, మధ్య తరగతికి చెందిన వారి పరిస్థితి ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికైతే.. మెదడు, నరాలకు సంబంధించిన సమస్యలు తీవ్రమయ్యే వరకు తెలియదు. దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచించారు డాక్టర్ బిందు. కేవలం ఆలోచించి ఊరుకోలేదు. ‘బిందు ఫౌండేషన్’ పేరుతో ఓ స్వచ్ఛంధ సంస్థ ఏర్పాటు చేశారు. కేవలం నరాలు, మెదడు సంబంధిత ఆరోగ్య సమస్యల చికిత్స కోసం ప్రత్యేకంగా ఓ వాహనం ఏర్పాటు చేసి, వారంలో ఒకరోజు క్రమం తప్పకుండా మారుమూల ప్రాంతాలకు వెళ్లడం మొదలుపెట్టారు.
ఐదేళ్ల క్రితం మొదలుపెట్టిన ‘న్యూరాలజీ ఆన్ వీల్స్’ పేరుతో మొదలుపెట్టిన వైద్య సేవలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మారుమూల ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజలను సమీకరించి వారికి నరాలు, మెదడుకు సంబంధించిన జబ్బుల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ఉచితంగా పరీక్షలు చేసి ట్రీట్ చేస్తున్నారు. ఎక్కడో దూరంగా ఉన్న పెద్దాసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే స్తోమత లేని ఎంతోమంది పేదలు స్వయంగా తమ దగ్గరికే వచ్చి సేవలందిస్తున్న బిందును కొనియాడుతున్నారు.
ప్రతీ వారం ఒక ఊరిలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఆ చుట్టు పక్కల ప్రజలకు నరాలు, ఫిట్స్, పక్షవాతం, మెదడు సంబంధిత సమస్యలకు పరీక్షలు చేసి అక్కడే వైద్యం కూడా అందిస్తున్నారు. ‘ఏ రోజు ఏ ఊరికి వెళ్లాలి? ఎక్కడ క్యాంప్ పెట్టాలి? చుట్టు పక్కల ప్రజలు కూడా వచ్చేలా ఏ ఊరైతే బాగుంటుంది? ఏ ప్రాంతంలో ఎక్కువగా నరాలు, మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు’ అనే వివరాలు తెలుసుకుని.. వీలైనంత ఎక్కువ మందికి సేవలు అందేలా పక్కాగా ప్లాన్ చేసి మెడికల్ క్యాంప్‌కి రెడీ అవుతారు. రోగానికి వైద్యం చేయడంతో పాటు.. ఆయా ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన కల్పిస్తూ.. ముందు ముందు అలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఏం చేయాలో కూడా వారికి అర్థమయ్యేలా చెప్పాడు. ‘రోగం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తే.. వారికి డాక్టర్‌తో పనుండదు కదా. ఆ అవగాహన కల్పిస్తే చాలు. వారి ఆరోగ్యాన్ని వారు కాపాడుకోగలరు’ అంటారు డాక్టర్ బిందు. ఒక్కొక్కరికీ ఉన్న ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకొని ఇంతకు ముందు అలాంటి ఆరోగ్య సమస్య వారి కుటుంబంలో ఎవరికైనా ఉందేమో తెలుసుకుంటారు. భవిష్యత్ తరాల వారికి ఆ సమస్య రాకుండా ఏం చేయాలో అవగాహన కల్పిస్తారు.
ఒక మనిషి ఆరోగ్యాన్ని వారి మాటలు, చూపులే చెప్తాయి. నవ్వాలన్నా, ఏడవాలన్నా, ఆలోచించాలన్నా, చురుగ్గా ఉండాలన్నా మెదడు సక్రమంగా పనిచేయాలి. దాని పనితీరు మందగించినప్పుడు శరీరం మీద కంట్రోల్ కోల్పోతుంది. ఫలితంగా మరిన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ విషయాలన్నీ మెడికల్ క్యాంప్‌కి హాజరయ్యే ప్రజలకు అర్థమయ్యేలా వీడియోల రూపంలో చెప్తారు డాక్టర్ బిందు. క్యాంపుకి వచ్చే స్టూడెంట్స్ అవగాహన కల్పిస్తూ.. ఇతరులకు కూడా తెలియజెప్పాల్సిన అవసరం గురించి కౌన్సెలింగ్ ఇస్తారు. క్యాంపులో ట్రీట్‌మెంట్ చేయలేని ఆరోగ్య సమస్య చికిత్స కోసం సమీపంలో అన్ని వసతులున్న హాస్పిటల్‌కి తక్కువ ఖర్చుతో ట్రీట్‌మెంట్ అందించాలని సిఫార్సు చేస్తారు.
గ్రామీణ ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్న డాక్టర్ బిందుకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ‘వరల్డ్ స్టాక్ ఆర్గనైజేషన్’ ఇచ్చే ఇండివిడ్యువల్ అఛీవ్మెంట్ అవార్డు కూడా ఇచ్చారు.