బాధలను దిగమింగి బార్బర్ గా మారింది

అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. నాన్నేమో బ్రెయిన్ ట్యూమర్ తో మంచాన పడ్డాడు. అక్కలిద్దరికీ పెళ్లిల్లై అత్తగారింట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో చిన్న కూతురే ఆ కుటుంబానికి పెద్ద దిక్కయింది. కుటుంబాన్ని ఆర్ధిక సమస్యల నుంచి గట్టెక్కించడానికి ఆమె తన కుల వృత్తినే నమ్ముకుంది. కలం పట్టిన చేత్తోనే కత్తెర పట్టింది.  క్షవరం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తోంది భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన బిందు ప్రియ. 

 

ఇక వివరాల్లోకి వెళ్తే... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామానికి చెందిన మేడిపల్లి రాజయ్య, స్వరూప దంపతులకు ముగ్గురు అమ్మాయిలు. పెద్దమ్మాయిలిద్దరికి పెళ్లిల్లు కాగా... చిన్నమ్మాయి బిందు ప్రియ హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చదువుతోంది. ఇక స్వరూప కూలీ పని , రాజయ్య బార్బర్ వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అయితే రాజయ్యకు కొన్ని నెలల కిందట బ్రెయిన్ ట్యూమర్ రావడంతో మంచానపడ్డాడు. ఈ క్రమంలోనే కుటుంబ భారమంతా తల్లిపైనే పడింది. అయితే బిందు ప్రియ తన తల్లి ఒక్కతే కుటుంబం కోసం కష్టపడుతుంటే చూడలేకపోయింది. అందుకే తల్లికి చేదోడుగా ఉండడానికి నిర్ణయించుకొంది. వెంటనే తండ్రి నడిపే బార్బర్ షాప్ కు వెళ్లి కుల వృత్తిని చేయడం మొదలు పెట్టింది. కటింగ్, షేవింగ్ చేస్తూ కుటుంబ పోషణలో తల్లితో పాటు భాగమైంది. అయితే కొంత కాలానికే దెబ్బ మీద దెబ్బ అన్నట్లు తల్లి స్వరూప  అనారోగ్యంతో చనిపోయింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది.

కానీ బిందు ప్రియ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతోంది. కుటుంబ పరిస్థితిని అర్ధం చేసుకున్న బిందు ప్రియ... కుటుంబ భారాన్ని తన భుజానెత్తుకుంది. తండ్రి నడిపే బార్బర్ షాప్ కు వెళ్లి పూర్తిస్థాయిలో కుల వృత్తిని చేయడం మొదలుపెట్టింది. కటింగ్, షేవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. వచ్చే ఆదాయంతోనే అటు తండ్రికి వైద్యం చేయిస్తూ... ఇటు తాను చదువుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. 

సహకారం అందిస్తే కలెక్టర్నవుతా

అమ్మ చనిపోవడం, నాన్న మంచాన పడటంతో కుటుంబాన్ని నేనే పోషిస్తున్నా. క్షవరం చేస్తే వచ్చే డబ్బుతోనే నాన్నకు మందులు కొంటున్నా. పూర్తి సమయాన్ని కటింగ్ చేయడానికే కేటాయిస్తుండటంతో చదువలేకపోతున్నా. కలెక్టర్ కావాలనేది నా కోరిక. ఎవరైన సాయం చేస్తే నాన్నకు మంచి వైద్యం చేయించి... మంచిగా చదివి కలెక్టర్నవుతా. 

... బిందు ప్రియ