పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్లలో చదివిస్తేనే మంచి భవిష్యత్ ఉంటుందనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు. అయితే, చదివే సత్తా ఉండాలే కానీ.. అట్లేం ఉండదు అని నిరూపించాడు బినేష్. 21ఏళ్ల వయసులోనే ప్రపంచ టాప్ ఆన్లైన్ సంస్థ అమెజాన్లో పెద్ద ఉద్యోగం సాధించాడు. ఏడాదికి 28 లక్షల ప్యాకేజీతో నవంబర్ 4న జాబ్లో చేరుతున్నాడు.
వేములపల్లి, వెలుగు : అమెజాన్లో ఉద్యోగం చేయాలని చాలామందికి ఉంటుంది. కానీ.. అది అంత సులువేం కాదు. ఎంతో కష్టపడితే కానీ.. దొరకదు. అలాంటిది ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి, గవర్నమెంట్ స్కూల్లో చదివి అమెజాన్లో జాబ్ సంపాదించాడు బినేష్. నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని రావులపెంట బినేష్ ఊరు. అమ్మానాన్నలు తరికొప్పుల జానకమ్మ, సైదులు. పేద కుటుంబంలో పుట్టిన బినేష్కు చిన్నప్పటినుంచి చదువంటే చాలా ఇష్టం. ఊళ్లోనే టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాడు. అతడు చదువుతున్న స్కూల్లో 2008లో ఇంగ్లీష్ మీడియం మొదలుపెట్టారు. దాంతో ఇంగ్లీష్ మీద మంచి పట్టు సాధించాడు. 2012–13లో పదో తరగతి పరీక్షల్లో 9.5 జీపీఏ వచ్చింది. మండల టాపర్గా నిలిచాడు. తర్వాత కడప జిల్లా ఇడుపులపాయలో ఉన్న ఐఐఐటీలో బీటెక్లో ఫ్రీ సీటు వచ్చింది. ఈ సంవత్సరమే బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తైంది. మంచి మార్కులతో పాసయ్యాడు. అంతేకాదు మూడు నెలల క్రితం క్యాంపస్ ప్లేస్మెంట్లో హైదరాబాద్ అమెజాన్ కంపెనీలో ఏడాదికి రూ.28 లక్షల ప్యాకేజీతో జాబ్ కొట్టాడు.
టీచర్స్ సపోర్ట్
స్కూల్లో చదువుతున్నప్పుడు బినేష్ ఆసక్తిని గమనించిన టీచర్లు అతన్ని ఎంతగానో ప్రోత్సహించారు. బినేష్ కూడా కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఐఐఐటీలో సీటు తెచ్చుకునేందుకు టీచర్లు ఎంతో సపోర్ట్ చేశారు. టీచర్లకు తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దని బినేష్ కూడా చాలా కష్టపడి చదివాడు. బినేష్ అప్పుడప్పుడు వెళ్లి తను చదువుకున్న స్కూల్లో పిల్లలకు సలహాలు, సూచనలు ఇస్తున్నాడు.
వ్యవసాయ కుటుంబంబినేష్ తల్లిదండ్రులు సైదులు, జానకమ్మ వ్యవసాయం చేస్తున్నారు. సైదులు పదో తరగతి వరకు చదువుకున్నాడు. పై చదువులు చదువుకోవాలని ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల టెన్త్తోనే ఆపేశాడు. కానీ.. తన పిల్లలు తనలా కష్టపడకూడదు అనుకున్నాడు. అందుకే చాలా కష్టపడి చదివించాడు. అందుకోసం వ్యవసాయంతో పాటు ఊళ్లో బస్తాల పట్టాలు కిరాయికి ఇస్తూ, కూలీ పనులు కూడా చేశాడు. పెద్ద కొడుకు రవి రెడ్డీస్ ల్యాబ్లో ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కొడుకు బినేష్. మూడో సంతానం రూప డిగ్రీ చదువుతోంది. ‘ఐఎఎస్ లక్ష్యంగా చదువుతున్నా.
అమెజాన్లో ఉద్యోగం చేస్తూ సివిల్స్కు ప్రిపేర్ అవుతాను. లక్ష్యం నెరవేరే వరకు ఎంత కష్టమైనా చదువుతా. కలెక్టర్ అయ్యి ప్రజలకు సేవ చేస్తా’ అంటున్నాడు బినేష్ .