
- పూర్తిగా నిండిపోయిన రాంపూర్ డంప్ యార్డు
- ప్రపోజల్స్‌కే పరిమితమైన మరో మూడు యార్డులు
- పొగ, వాసనతో ఇబ్బంది పడుతున్నామంటున్న ప్రజలు
హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్‌ను చెత్త సమస్య వేధిస్తోంది. ఇప్పటికే లక్షల టన్నుల్లో పేరుకుపోయిన చెత్తను క్లీన్ చేసేందుకు చేపట్టిన బయో మైనింగ్ పనులు స్లోగా సాగుతున్నాయి. దీనికి తోడు నగరంలో ప్రతీరోజూ టన్నుల కొద్దీ చెత్త వెలువడుతుండడంతో యార్డులో గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది.
ముందుకు సాగని బయోమైనింగ్
గ్రేటర్వరంగల్లోని 66 డివిజన్ల పరిధిలో సుమారు 2.5 లక్షల ఇండ్లు ఉన్నాయి. తడి, పొడి చెత్త కలిపి నిత్యం 400 టన్నుల వరకు వెలువడుతోంది. ఈ చెత్తను స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా మడికొండ, రాంపూర్ శివారులోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. సుమారు 32 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ యార్డులో ప్రస్తుతం 5 లక్షల టన్నుల మేర చెత్త పేరుకుపోయింది. దీంతో బయోమైనింగ్ చేపట్టేందుకు కోయంబత్తూరుకు చెందిన లీప్ ఎకో టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ హైదరాబాద్‌కు చెందిన హర్షిత ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సబ్ కాంట్రాక్ట్‌కు ఇచ్చింది. 2021 డిసెంబర్‌లో పనులు ప్రారంభం అయ్యాయి. 2022 డిసెంబర్ వరకు 3 లక్షల టన్నుల చెత్తను క్లీన్ చేయాలని టార్గెట్ పెట్టారు. కానీ కాంట్రాక్ట్ సంస్థకు నిధులు విడుదల కాకపోవడం, రూ. 26 లక్షల విలువైన సామగ్రి చోరీకి గురికావడంతో బయో మైనింగ్ పనులు స్లోగా సాగుతున్నాయి.
ప్రపోజల్స్‌తోనే ఆగిన కొత్త డంప్ యార్డులు
నగరంలో చెత్త సమస్య తీవ్రం కావడం, ప్రస్తుతం డంపింగ్ యార్డు సరిపోకపోవడంతో చాలా మంది ఎస్సారెస్పీ కాల్వ గట్లు, ఓపెన్ ప్లేస్‌లు, నగర శివార్లలోని చెరువుల వద్ద చెత్తను డంప్ చేస్తున్నారు. దీంతో చెత్త సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో నగరానికి నాలుగు వైపులా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసేందుకు ఆఫీసర్లు ప్రపోజల్స్ రెడీ చేశారు. ఇందులో భాగంగా ధర్మసాగర్ మండలం ముప్పారం, ఐనవోలు మండలం కక్కిరాలపల్లి, వేలే రు మండలం కన్నారంలో స్థలాలను పరిశీలించారు. కానీ ఆ ప్లేస్‌లు ఇండ్లకు దగ్గరగా ఉండడంతో స్థానికులు వ్యతిరేకించారు. దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. రాంపూర్ డంప్‌యార్డు నిండిపోవడంతో దుర్వాసన వస్తోంది. దీంతో మడికొండ, రాంపూర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పరిష్కరించాలని ఆ రెండు గ్రామాల ప్రజలు ఆందోళనలు చేపట్టడంతో డంప్ యార్డును తరలిస్తామని లీడర్లు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదు.
వ్యాధుల బారిన పడుతున్నామంటున్న ప్రజలు
రాంపూర్ డంప్ యార్డు పూర్తిగా నిండిపోవడంతో పోతన ఆడిటోరియం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని కొద్ది రోజుల క్రితం వరకు డీఆర్సీ సెంటర్‌గా, వేస్టేజీ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌గా వినియోగించారు. కానీ పొగ, ఘాటైన వాసనతో పోతన నగర్, రామన్నపేటకు చెందిన ప్రజలు ఈ నెల 1న ఆందోళన నిర్వహించారు. డంప్ యార్డు దోమలు, ఈగలు, పందులతో ఇబ్బందులు పడుతున్నామని, శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్తను డంప్ చేయొద్దని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ఆఫీసర్లు ఉర్సు గుట్ట ఏరియాతో పాటు బాలసముద్రంలోని జీడబ్ల్యూఎంసీ వెహికల్ రిపేర్ సెంటర్లను చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌గా వినియోగిస్తున్నారు. బాలసముద్రంలోని సెంటర్‌కు ఆనుకునే హాస్పిటల్స్, ఆ పక్కనే గ్రేటర్ కమిషనర్ క్యాంప్ ఆఫీస్, పబ్లిక్ హెల్త్ ఆఫీస్ ఉండడంతో చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను ఇక్కడి నుంచి కూడా తరలించాలనే డిమాండ్ వ్యక్తం అవుతోంది.