పచ్చదనం కోల్పోయిన బయోడైవర్సిటీ పార్కు

  • డంపింగ్ యార్డుగా మారుతోన్న స్థలం
  • మందుబాబులకు అడ్డగా వెనుకభాగం
  • రాలేకపోతున్న విజిటర్లు

గచ్చిబౌలి, వెలుగు: పచ్చని చెట్లు, మొక్కలతో కళకళలాడాల్సిన గచ్చిబౌలి బయోడైవర్సిటీ పార్కు ఎండిపోతోంది. బయో డైవర్సిటీకి కేరాఫ్​గా ఉండాల్సిన  పార్కులో  ఎండిపోతున్న మొక్కలు, చెట్లు,  గడ్డి కనిపిస్తున్నాయి. లైట్లు పాడైపోయాయి.  చెత్తాచెదారం ఎక్కువైంది.   నిర్వహణ లేకపోవడంతో పార్కుకు  విజిటర్లు కూడా వస్తలేరు.  పార్కు స్థలం డంపింగ్ యార్డుగా మారిందని.. పార్కు వెనుక భాగం రాత్రి వేళల్లో మందుబాబులకు అడ్డా తయారైందని స్థానికులు చెప్తున్నారు. చుట్టుపక్కల ఉండే జనం పార్కు వెనుక భాగంలో చెత్త వేస్తున్నారు.  ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. 

జీవ వైవిధ్య సదస్సుకు సూచిక 
గ్రేటర్ సిటీలో 2012లో  జరిగిన 11వ ఇంటర్నేషనల్ బయో డైవర్సిటీ కాన్ఫరెన్స్ సందర్భంగా అక్టోబర్​ 16న అప్పటి ప్రధాని మన్మోహన్​సింగ్​ గచ్చిబౌలిలో ఈ పార్కును ప్రారంభించారు. మొత్తం రూ. 2 కోట్లతో 15 ఎకరాల్లో కట్టారు.  ఈ పార్కులో ఐక్యరాజ్యసమితి  సభ్యత్వ దేశాల  107  మంది ప్రతినిధులు ఒక్కో మొక్కను నాటారు.  మొక్కల పేర్లు,  నాటిన ప్రతినిధుల దేశం పేరుతో చెట్ల దగ్గర బోర్డులను పెట్టారు. తర్వాత పార్కులో సుమారు 600 రకాల మొక్కలను పెంచారు.   పార్కు మధ్యలో  జీవజాతుల పరిణామాన్ని తెలిపే 32 అడుగుల ఎత్తయిన స్మారక స్తూపాన్ని కట్టారు. ఇంతటి ప్రతిష్టాత్మక పార్కు నిర్వాహణను అధికారులు ఇప్పుడు గాలికి వదిలేశారు.   మొదట్లో అటవీశాఖ అధికారులు చూసుకున్నారు. ప్రస్తుతం టీఎస్​ఐఐసీ( తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) అధికారులు  చూస్తున్నారు.

అధికారులు పట్టించుకోవట్లే..
ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఎన్నో అరుదైన మొక్కలు ఈ పార్కులో ఉండేవి.  కేవలం అధికారులు పట్టించుకోకపోవడం వల్లే అవ్వన్నీ ఇప్పుడు కనిపించడం లేదు.  కరోనా ఫస్ట్ వేవ్​ నుంచి పార్కులో చెట్లకు నీళ్లు పోయడమే  మానేశారు.  పార్కులో 5 బోర్లు ఉన్నా ఒక్కటీ పనిచేయడం లేదు. బోర్లు పనిచేయకపోవడంతో నీటి కోసం పెద్ద ట్యాంక్​ను కట్టినప్పటికీ దాన్ని కూడా వాడటం  లేదు. సమ్మర్ వస్తుండడంతో పార్కులోని వివిధ జాతుల చెట్లు అంతరించిపోయే ప్రమాదం ఉంది.  దీంతో పాటు వివిధ దేశాల ప్రతినిధులు మొక్కలు నాటిన తర్వాత, వాటి పేరు, దేశం కనిపించే విధంగా బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం ఈ బోర్డులు మొత్తం గుర్తుపట్టని విధంగా మారాయి. కొన్ని చెట్ల వద్ద బోర్డులు కనిపించడం లేదు. 

కన్​స్ట్రక్షన్ వేస్టేజ్​ను పడేస్తూ...
టీఎస్ఐఐసీ అధికారులు పట్టించుకోక పోవడం వల్లే పార్కు  అధ్వానంగా మరిందని స్థానికులు అంటున్నారు.   పార్కు లోపల ఉన్న ఖాళీ ప్రదేశాన్ని కొందరు వ్యక్తులు డంపింగ్​ కోసం వాడుతున్నారు. కన్​స్ర్టక్షన్ వర్క్ కోసం వాడే ఇటుకలు, వేస్టేజ్​​ను తీసుకువచ్చి పార్కులో డంపింగ్​ చేసుకొని, ఇక్కడి నుండి పని​ జరిగే ప్రదేశానికి తీసుకెళ్తున్నారు. అలాగే చెత్త చెదారాన్ని కూడా పెద్ద ఎత్తున పార్కు వెనుక భాగంలో డంప్ చేస్తున్నారు. పార్కును చూసుకునేందుకు ముగ్గురు సెక్యూరిటీ గార్డులున్నా పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎంట్రెన్స్​లో ఖాళీ స్థలాన్ని బయటి వ్యక్తులు తమ వెహికల్స్ పార్కింగ్ కోసం  వాడుకుంటున్నా సెక్యూరిటీ గార్డులు పట్టించుకోవడం లేదు.   

జనాలు వస్తలేరు...
డైలీ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4  నుంచి 7 గంటల వరకు పార్కులోకి విజిటర్లను అనుమతించేవారు.  మొదట్లో గచ్చిబౌలి, టెలికాంనగర్​, అంజయ్యనగర్​, రాయదుర్గం, మధురానగర్ ప్రాంతాల్లోని అపార్ట్​మెంట్​ వాసులు వాకింగ్​ కోసం ఉదయం, సాయంత్రం  వందల సంఖ్యలో వచ్చేవారు. గత నాలుగేండ్లుగా పార్కుకు వాకింగ్ కోసం, సేద తీరేందుకు ఎవరూ రావడం లేదని సిబ్బంది చెప్తున్నారు.

గడ్డి, దుమ్ము కనిపిస్తోంది..
బయోడైవర్సిటీ పార్కుకు  గతంలో  ఫ్రెండ్స్​, ఫ్యామిలీతో వెళ్లేటోణ్ని. ఇప్పుడు పార్కులో ఎటూ చూసినా ఎండిపోయిన చెట్లు, గడ్డి, దుమ్ము కనిపిన్నాయి. ఇలా చూసేసరికి  పార్కుకు రావాలనిపించడం లేదు. 
- చందు, సాఫ్ట్​వేర్​ ఎంప్లాయ్​, గచ్చిబౌలి


పార్కును బాగుచేయాలి... 
అధికారులు పార్కును పట్టించుకోక పోవడం వల్లే ఇలా తయారైంది. ఇప్పటికైనా పార్కును బాగు చేసి, చెట్లను కాపాడాలి.  విజిటర్ల కోసం సౌలతులు కల్పించాలి. 
‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-ఆసిఫ్​, ప్రైవేటు ఎంప్లాయ్,  కొండాపూర్