పోరాటాల దిక్సూచి వీరన్న

పోరాటాల దిక్సూచి వీరన్న

పూలే, అంబేద్కర్, సాహుమహారాజ్, పెరియార్ ల నిజమైన వారసుడిగా నిలబడి కలబడిన కామ్రేడ్ మారోజు వీరన్న. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసి పీడిత ప్రజలకు అండగా నిలిచాడు. ఎప్పుడూ సిద్ధాంత భజన కాదు.. ముందు ఆచరణ. ఆచరణే గీటురాయి, ఆచరణే సిద్ధాంతాన్ని పదును పెడుతుందని బోధించి ఉద్యమకారులను ముందుకు నడిపిన నాయకుడు వీరన్న. ఆనాడు వీరన్న చెప్పిన మాటలను, తన ఆచరణాత్మక ఉద్యమాన్ని గుర్తు చేసుకోవడమంటే నేటి దోపిడీ పాలనలో ఉద్యమకారులుగా, సంఘాలుగా, ప్రగతిశీల శక్తులుగా, మేధావులుగా, విద్యావంతులుగా, బుద్ధిజీవులుగా, బాధ్యత గల ప్రజలుగా ఎలాంటి ఉద్యమాలు చేయాలో నిర్ధేశించుకోవాలి. మనుధర్మ సిద్ధాంతంతో వేల సంవత్సరాలుగా అణచివేయబడిన దేశ మెజార్టీ ప్రజలు గత 40 ఏండ్లుగా ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ, పట్టణీకరణ, అవినీతి పాలనతో దోపిడీకి గురవుతున్నారు. కుల, వర్గ అణచివేతలతో ఓపక్క ప్రపంచ కుబేరులు పెరుగుతుంటే మరో పక్క నానాటికి పేదలు మరింత పేదలుగా మారి బతకలేక బలిదానాలు చేసుకుంటున్నారు. దేశంలోని పాలక పార్టీలు అణగారిన ప్రజలను చాకిరీ చేసే కులాలుగా, ప్రలోభ కులాలుగా, ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మారోజు వీరన్న లాంటి సిద్ధాంతం, ఉద్యమాలు మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం చేపట్టడానికి ఎంతో మేలు చేస్తుంది. 

విద్యార్థి నేతగా..

మారోజు వీరన్న ఒక విద్యార్థి నాయకుడు, గాయకుడిగా ప్రగతిశీల ఉద్యమాలు నిర్మించాడు. క్యాపిటేషన్ ఫీజుకు వ్యతిరేకంగా పోరాడాడు. మండల్ అనుకూల ఉద్యమంలో అందరికంటే వీరన్న ముందు నిలిచారు. ప్రజా యుద్ధ నౌక గద్దరన్నపై కాల్పుల సందర్భంలో కూడా అందరికన్నా ముందే రోడ్డు మీదకు వచ్చి ఉద్యమించాడు. ఉద్యమంలో భాగంగా నిజాం కాలేజీ మైదానంలో ఎన్నో సభలు జరిగాయి. రైతాంగ సమస్యలపై, జలసాధన పోరాటం లాంటి సామ్రాజ్యవాద వ్యతిరేక సభలంటే వీరన్న లేకుండా  ఊహించలేం.1997లో సూర్యాపేటలో బహిరంగ సభ నిర్వహించి తెలంగాణ మహాసభను స్థాపించాడు. శ్రామిక వర్గ దృక్పథం లేని కుల పోరాటాలు, కుల నిర్మూలన లక్ష్యం లేని వర్గ పోరాటాలు విముక్తి సాధించలేవని వీరన్న సూత్రీకరించాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోట వచ్చిన ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన 1997 లోనే  మారోజు వీరన్న చేశాడు. తెలంగాణలో వలసాధిపత్య అగ్రకుల దోపిడీ పాలన పోవాలని, తెలంగాణలో అగ్రకుల భూస్వామ్య పాలన పోయి బహుజన రాజ్యం స్థాపించాలని 1996 లో తెలంగాణ మహాసభ స్థాపించి, అందులో మేధావులను పాల్గొనేటట్లు చేయడంలో వీరన్న కృషి చాలా గొప్పది. 

తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో

వీరన్న బాటలో నడిచి సూర్యాపేటలో తెలంగాణ మహాసభకు అధ్యక్షత వహించి, తెలంగాణ కోసం పీడీ యాక్ట్ కు గురైన డా. చెరుకు సుధాకర్ ను, టీఆర్ఎస్ కు చిల్లి గవ్వ లేనప్పుడు అన్ని విధాల సహకరించిన గాదె ఇన్నయ్యను, తెలంగాణ భవన్ కు ఆశ్రయమిచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్లను ఎందరినో రాజకీయ సమాధి చేసిన కేసీఆర్ నేడు సీమాంధ్ర కార్పొరేట్ శక్తులతో చేతులు కలిపి అభివృద్ధి పేరుతో  దోపీడీ చేస్తున్నారు. ఈ దోపిడీ వ్యతిరేక పోరాటానికి వీరన్న ఆదర్శం కావాలి. 1999 మే 16 న సీమాంధ్ర పాలకులు వీరన్నను బూటకపు ఎన్​కౌంటర్ లో కాల్చి సంబరపడ్డారు. కానీ వీరన్న త్యాగ ఫలంతో తెలంగాణ పోరాటం మరింత విస్తృతమై 2014లో రాష్ట్రం సాకారమైంది. సుదీర్ఘ కాలం పాటు పోరాటాలు చేసిన ప్రజలు.. ఉద్యమ పార్టీ అని టీఆర్ఎస్ ను గెలిపిస్తే ‘నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లు’ ప్రస్తుత తెలంగాణ పాలకులు ప్రజా ఆకాంక్షలకు దూరంగా పాలన సాగిస్తున్నారు. అధికారాలన్ని అధినాయకుడి చేతుల్లో కేంద్రీకరించుకుని మంత్రులను చెంచాలుగా మార్చుకుని ఆత్మగౌరవంతో నిలబడ్డ ఉద్యమకారుల్ని తీవ్రంగా అణచివేస్తూ తెలంగాణ ఉద్యమ శిఖరాలను పక్కకు నెట్టి నాటి ఉద్యమ వ్యతిరేక శక్తులను ముందువరుసలో ఉంచి రాజకీయాలు చేస్తున్నారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై, దోపిడీపై పోరాటం చేయడమే  మారోజు వీరన్నకు మనం అర్పించే నిజమైన నివాళి. 


–సాయిని నరేందర్,సోషల్ ​ఎనలిస్ట్