లక్షల మంది డేటా లీక్​

లక్షల మంది డేటా లీక్​
  • వేలి ముద్రలు, ఫేషియల్​ రికగ్నిషన్​, యూజర్​నేమ్ , పాస్​వర్డ్​ల చోరీ
  • జాబితాలో ఇండియా జిమ్​ చైన్​ కూడా.. ఇజ్రాయెల్​ రీసెర్చర్ల సర్వే

వేలి ముద్రలు, ఫేషియల్​ రికగ్నిషన్​, యూజర్​నేమ్​లు, పాస్​వర్డ్​లు.. ఒకటా రెండా బ్రిటన్​లోని 10 లక్షల మంది ఉద్యోగుల బయోమెట్రిక్​ డేటా లీకైపోయింది. అది కూడా ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, రక్షణ రంగ కాంట్రాక్టర్లకు చెందిన కంపెనీల డేటానే ఎక్కువగా ఉంది. బ్రిటన్​లో జరిగిందీ ఘటన. ఆ దేశ పోలీస్​ డిపార్ట్​మెంట్, రక్షణ కాంట్రాక్టర్లు, బ్యాంకులకు సుప్రీమా అనే కంపెనీ బయోమెట్రిక్​ సెక్యూరిటీ సేవలను అందిస్తోంది. అందుకోసం ఇటీవల వెబ్​ఆధారిత బయోస్టార్​2 అనే సాఫ్ట్​వేర్​ను తయారు చేసింది. దానిని ఏఈవోఎస్​ అనే మరో యాక్సెస్​ కంట్రోల్​కు అనుసంధానించింది. ఈ ఏఈవోఎస్​ ద్వారానే గోదాములు, ప్రభుత్వ భవనాలకు సెక్యూరిటీని కల్పిస్తోంది. ఆయా ప్రాంతాల్లోకి ఉద్యోగులు వెళ్లాలంటే ఏఈవోఎస్​లో వేలి ముద్రలు, ఫేషియల్​ రికగ్నిషన్, యూజర్​నేమ్​లు తప్పనిసరి. ఈ ఏఈవోఎస్​ను ఇండియా సహా 83 దేశాల్లోని 5,700 కంపెనీలు వాడుతున్నాయి. ఇప్పుడు ఈ ఏఈవోఎస్​ డేటానే బ్రిటన్​లో లీకైంది.

ఇజ్రాయెల్​ రీసెర్చర్ల సర్వేలో లీకులు వెల్లడి

నోవమ్​ రోటెం, రాన్​ లోకర్​ అనే ఇజ్రాయెల్​ రీసెర్చర్ల పరిశీలనలో ఈ లీకుల సంగతి వెల్లడైంది. వర్చువల్​ ప్రైవేట్​ నెట్​వర్క్​ సర్వీసెస్​ను పరిశీలించే వీపీఎన్​మెంటార్​ అనే సంస్థతో కలిసి వాళ్లు ఈ లీకులను తేల్చారు. గత వారం బయోస్టార్​ 2 డేటాబేస్​ను పరీక్షించిన వాళ్లకు ఈ షాకింగ్​ విషయాలు తెలిశాయి. ఆ లీకైన డేటాకు ఎక్కడా సరైన రక్షణ అన్నదే లేదని వారు చెప్పారు. యూఆర్​ఎల్​ (వెబ్​ లింకు)లను కొంచెం మార్చి సెర్చ్​ చేస్తే డేటా మొత్తం తెలిసిపోయిందని చెప్పారు. అడ్మిన్​ పానెళ్లు, డాష్​బోర్డులు, వేలి ముద్రలు, ఫేషియల్​ రికగ్నిషన్​, యూజర్ల ఫొటోలు, ఎన్​క్రిప్ట్​ కాని యూజర్​నేమ్​, పాస్​వర్డ్​లు, ఉద్యోగుల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన 2.78 కోట్ల రికార్డులను రీసెర్చర్లు తీసుకోగలిగారు. అందులో ఇండియాకు చెందిన ఓ ప్రముఖ జిమ్​ చెయిన్​ డేటా కూడా ఉండడం గమనార్హం. ప్రస్తుతం ప్రపంచంలోని 15 లక్షల ప్రాంతాల్లో బయోస్టార్​2 ద్వారానే చాలా సంస్థలు సెక్యూరిటీ సేవలు పొందుతున్నాయని, ఈ నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో లీకులు బయటపడడం ఆందోళన కలిగించేదేనని రోటెమ్​ చెప్పారు. అయితే, బయోస్టార్​ 2 సేవలు అందిస్తున్న సుప్రీమా సంస్థ అధికారులతో మాట్లాడేందుకు రీసెర్చర్లు ప్రయత్నించినా వాళ్లు అందుబాటులోకి రాలేదు. దీనిపై సుప్రీమా మార్కెటింగ్​ హెడ్​ యాండీ యాన్​ మాట్లాడారు. డేటా బ్రీచ్​పై లోతుగా దర్యాప్తు చేస్తామని, దాని వల్ల ఏదైనా ముప్పు ఉందో తెలుసుకుని, దానికి తగ్గట్టు యూజర్లకు సమాచారం చేరవేస్తామని తెలిపారు. అయితే, ఇది సుప్రీమాకు మాత్రమే ఎదురైన సమస్య కాదని, ప్రతి కంపెనీకి ఈ సమస్య ఎదురవుతోందని రోటెం అంటున్నారు.