- నల్గొండ జిల్లాలోని 14 గ్రామాల్లో సర్పంచ్ పోస్టులు ఖాళీ
- ఎన్నికల ఖర్చు చెప్పని 586 మంది వార్డు సభ్యులపై అనర్హత
- డెత్‌లు, పదవులకు రాజీనామా చేసిన వార్డు సభ్యులు 51
- ఖాళీ స్థానాల వివరాలు కోరిన ఎన్నికల కమిషన్
- నకిరేకల్ మండలంలోని ఏడు పంచాయతీలతో కలిపి త్వరలో నోటిఫికేషన్
నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లాలో ఖాళీగా ఉన్న పంచాయతీలకు త్వరలో బైపోల్ నోటిఫికేషన్ రానుంది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఇప్పటికే వివరాలు సేకరించింది. జిల్లాలో చనిపోయిన, వివిధ రకాల కారణాలతో రాజీనామా చేసిన సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎలక్షన్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాలో డెత్, రిజైన్ చేసిన సర్పంచ్, వార్డు సభ్యుల వివరాలను జిల్లా పంచాయతీశాఖ ఎలక్షన్ కమిషన్‌కు పంపించింది. చనిపోయిన, రిజైన్చేసిన సర్పంచ్ స్థానాలు 7 ఉండగా, వార్డులు 51 ఉన్నాయి. వీటితో పాటు ఎన్నికల ఖర్చు చెప్పని 586 మంది వార్డు సభ్యులపైన అనర్హత వేటు పడింది. ఎన్నికలు పూర్తైన 45 రోజుల్లోపు ఖర్చు వివరాలు కమిషన్‌కు పంపించాలి. రూల్స్ పాటించని వార్డు సభ్యులను పదవుల నుంచి తొలగించారు. దీంతో పాటు నకిరేకల్ మండలంలోని ఏడు గ్రామాల పదవీకాలం ఇటీవలే పూర్తైంది. మొత్తంగా జిల్లాలో 14 సర్పంచ్ స్థానాలు, 637 వార్డులు ఖాళీగా ఉన్నాయి. వీటికి ఏ క్షణంలో అయినా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే చాన్స్ ఉందని జిల్లా పంచాయతీ ఆఫీసర్లు చెప్పారు.
స్పెషల్ ఆఫీసర్లతో పాలన
సర్పంచ్‌లు, వార్డు స్థానాలు ఖాళీగా ఉండడంతో పంచాయతీల పాలన అస్తవ్యస్తంగా మారింది. సర్పంచ్‌లు లేని చోట, కోరం పూర్తిగా లేని పంచాయతీల్లో ఇటీవల స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. అనర్హత వేటుపడ్డ వార్డు సభ్యుల్లో కొందరు ఉపసర్పంచ్‌లు సైతం ఉన్నారు. దీంతో కోరం ఉన్న గ్రామాల్లో మరొకరిని ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు. కానీ కోరం లేని దగ్గర స్పెషల్ ఆఫీసర్లను పెట్టారు. ఇటీవల పదవీకాలం పూర్తైన నకిరేకల్ మండలంలోని ఏడు గ్రామాల్లో పాలన మొత్తం స్పెషల్ ఆఫీసర్లతోనే నడుస్తోంది. ఇప్పటికే పంచాయతీలకు వచ్చే నిధుల వాడకంలో గందరగోళం ఏర్పడింది. సర్పంచ్‌లు, పంచాయతీ ఉద్యోగులకు మధ్య అక్కడక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఎలక్షన్లు నిర్వహించాలని సర్పంచ్‌ల సంఘం డిమాండ్చేస్తోంది.
ఖాళీ స్థానాలివే…
నల్గొండ జిల్లాలో 844 పంచాయతీలు, 7,340 వార్డులు ఉన్నాయి. ఇందులో 7,270 వార్డులకు మాత్రమే గతంలో ఎన్నికలు జరిగాయి. నకిరేకల్ మండలంలోని ఏడు గ్రామాలకు పదవీ కాలం ముగియకపోవడంతో 70 వార్డులకు ఎన్నికలు పెట్టలేదు. ఇప్పుడు వాటితో కలిపి నోటిఫికేషన్ ఇస్తారని ఆఫీసర్లు చెప్పారు. చండూరు మండలం జోగిగూడెం పాలకవర్గం మొత్తం 2019లోనే రాజీనామా చేసింది. నకిరేకల్ మండలంలోని కడపర్తి, నోముల, తాటికల్, చందుపట్ల, నెల్లిబండ, చం దంపల్లి, గొల్లగూడెంలో పాలకవర్గ పదవీకాలం పూర్తైంది. తిరుమలగిరి (సాగర్) మండలం గోడుమరక, త్రిపురారం మండలం చెన్నాయపాలెం, నిడమనూరు మండలం గుంటుకగూడెం గ్రామాల సర్పంచ్‌లు చనిపోయారు. చింతపల్లి మండలం గొల్లపల్లి, డిండి మండలం రహ్మత్‌పూర్, మర్రిగూడ మండలం కుదాక్షపల్లి గ్రామాల సర్పంచ్‌లు పదవులకు రాజీనామా చేశారు. దీంతో పాటు రిజైన్ చేయడంతో 51 వార్డు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగాలు వచ్చి కొందరు, ఇతర ఎన్నికల్లో గెలుపొందడంతో మరికొందరు వార్డు సభ్యులు, సర్పంచ్ పదవులకు రిజైన్ చేశారు.
సర్పంచ్‌లే మిగిలిన గ్రామాలు
జిల్లాలోని 10 గ్రామాల్లో వార్డు సభ్యులందరిపైన అనర్హత వేటు పడింది. దీంతో ఇప్పుడు ఆయా గ్రామాల్లో సర్పంచ్‌లు మాత్రమే మిగిలారు. చండూరు మండలంలో పడమటితాళ్ల, డిండి మండలంలో దాసర్ నెమలిపూర్, నిజాంనగర్, పెద్దతండా, గుర్రంపోడు మండలం బొల్లారం, చామలోనిబావి, గాసీరాంతండా, కొత్తలాపురం, పోచంపల్లి, తేనేపల్లి తండాల్లో సర్పంచ్‌లు మాత్రమే ఉన్నారు. పాలకవర్గం లేకపోవడంతో ఆ గ్రామాలను స్పెషల్ ఆఫీసర్లతో నడిపిస్తున్నారు.