గంగాధర, వెలుగు: గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లిలో బీరప్ప కామరాతి జాతర కల్యాణ మహోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. బియ్యం సుంకు, డోలు చప్పుళ్లు, ఒగ్గు కళాకారుల విన్యాసాల మధ్య లింగాలకు గంగస్నానం చేయించి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయ ఆవరణలో పెద్దపట్నం వేసి బీరప్ప- కామరాతి కల్యాణాన్ని వేడుకగా జరిపించారు. అంతకుముందు మహిళలు బోనాలతో శివసత్తుల పూనకాలు, ఒగ్గు కళాకారుల విన్యాసాలు చేశారు. వేడుకలకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చీఫ్ గెస్ట్‌గా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు.
చొప్పదండి, వెలుగు: చొప్పదండి పట్టణంలోని బీరప్ప ఆలయంలో బుధవారం నాగవెల్లిపట్నం వేడుకలు ఘనంగా జరిగాయి. 16న పోచమ్మ బోనాలతో ప్రారంభమైన బీరప్ప ఉత్సవాల్లో క్షీరాభిషేకం, గంగా బోనం, వీర గంధం, సుంకుపట్టుట, పెద్ద బోనం, లగ్గంపట్నం, జోగు తిరుగుట, బోనాలు, నాగెల్లిపట్నం ఉత్సవాలు ఇప్పటి వరకు అత్యంత వైభవంగా కురుమ, యాదవ కులస్తులు ఘనంగా జరుపుకున్నారు. దేశాయిపేట, చాకుంటలో ఎల్లమ్మ పట్నాల వేడుకలు జరిగాయి. వేడుకలకు ఎమ్మెల్యే సత్యం హాజరయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ గుర్రం నీరజ, కాంగ్రెస్ లీడర్లు, నిర్వాహక కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.