
- యాదాద్రి జిల్లాలో మరోసారి బర్డ్‌ఫ్లూ కలకలం
- పోచంపల్లిలో ఓ కోళ్లపామ్‌లో ఫ్లూ సోకినట్లు నిర్ధారణ
- 29,796 కోళ్లను చంపేసి పాతిపెట్టిన వెటర్నరీ సిబ్బంది
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో మరోసారి బర్డ్‌ఫ్లూ కలకలం చెలరేగింది. దీంతో వెటర్నరీ టీమ్ రంగంలోకి దిగి వేలాది కోళ్లు, కోడిగుడ్లను పాతిపెట్టారు. వివరాల్లోకి వెళ్తే...
భూదాన్‌పోచంపల్లి మండలం ధోతిగూడెంలోని ఓ కోళ్లఫామ్‌లో ఇటీవల వందల కోళ్లు చనిపోయాయి. విషయం తెలుసుకున్న వెటర్నరీ ఆఫీసర్లు శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపడంతో బర్డ్‌ఫ్లూగా కన్ఫర్మ్ అయింది. దీంతో జిల్లా పశు సంవర్థక శాఖ ఆఫీసర్ జానయ్య, 30 మంది డాక్టర్లతో కూడిన టీమ్ వెంటనే కోళ్లఫామ్ వద్దకు చేరుకున్నారు.
డాక్టర్లు, సిబ్బంది పీపీఈ కిట్లు, మాస్క్‌లు ధరించి ఫామ్‌లోకి వెళ్లి మొత్తం 29,796 కోళ్లను చంపేసి సంచుల్లో ప్యాక్ చేశారు. అనంతరం గొయ్యి తీసి పాతి పెట్టారు. అదే విధంగా ఫారంలోని 19,686 కోడి గుడ్లను, కోళ్లకు సంబంధించిన వ్యర్థాలను కూడా పూడ్చిపెట్టారు. కోళ్ల ఫారాల్లో ఉన్న దాణాను సీజ్ చేశారు. ఫామ్‌ను 15 రోజులకు ఒకసారి శానిటైజ్ చేయించాలని, మూడు నెలల పాటు కోళ్లను పెంచవద్దని ఆదేశించారు.