ఆ కాకులు చనిపోయి.. సంచలన విషయం బయటపెట్టాయి

ఆ కాకులు చనిపోయి.. సంచలన విషయం బయటపెట్టాయి

మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో 51 కాకులు మృత్యువాత పడ్డ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కాకులన్నీ బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయినట్లు అధికారులు తేల్చారు. భోపాల్ వెటర్నరీ లాబొరేటరీ నుండి వచ్చిన నివేదికలో కాకులు ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా (H5N1) కారణంగా చనిపోయాయని పశుసంవర్ధక శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శ్రీధర్ షిండే తెలిపారు.

ఉద్గీర్ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో జనవరి 13 నుండి శనివారం(జనవరి 18) వరకు 51 కాకులు మృతి చెందినట్లు ఆయన తెలిపారు. విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే.. అప్రమత్తమైనట్లు శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు వెల్లడించారు. బర్డ్ ఫ్లూ అని నిర్ధారణ కావడంతో ముందస్తుగా H5N1 వైరస్ వ్యాప్తి చెందకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 

కాకుల మృతదేహాలు లభ్యమైన 10 కిమీ పరిధిలో హెచ్చరిక జోన్‌లుగా ప్రకటించినట్లు ఓ అధికారి తెలిపారు. ఈ పరిధిలో ఉన్న అన్ని పౌల్ట్రీలను తనిఖీ చేసి నమూనాలను పరీక్షల కోసం పంపుతామని పేర్కొన్నారు. ప్రజలు కూడా చనిపోయిన కోళ్లు, జంతు మాంసం తినకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.