మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ కేసులు వ్యాప్తి చెందుతున్నాయి. గురువారం తొమ్మిది జిల్లాల్లో 382 పక్షులు చనిపోయాయి. దాంతో రాష్ట్రవ్యాప్తంగా చనిపోయిన పక్షుల సంఖ్య 3,378కి చేరింది. రాష్ట్రంలోని లాతూర్, నాందేడ్, నాసిక్ మరియు అహ్మద్ నగర్ జిల్లాల్లో కొత్తగా బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి.
‘జనవరి 14న మొత్తం 382 పక్షులు చనిపోయాయి. ఈ నమూనాలను పూణే మరియు భోపాల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌కు పంపారు. జనవరి 8 నుంచి 14 వరకు వివిధ రకాలకు చెందిన 3,378 పక్షుల మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు తొమ్మిది జిల్లాలు పక్షుల ఫ్లూ బారిన పడ్డాయి’ అని రాష్ట్ర శాఖ తెలిపింది.
ముంబై, ఘోడ్ బందర్, దాపోలి ప్రాంతాల్లో కాకులు, కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకింది. పర్బనీ, లాతూర్, బీడ్, నాందేడ్ జిల్లాలో కోళ్ళకు బర్డ్ ఫ్లూ సోకింది. అకోలా, అమరావతి, అహ్మద్ నగర్, పూణే, షోలాపూర్ నగరాల్లోని కోళ్ల నుంచి సేకరించిన నమూనాలు బర్డ్ ఫ్లూ నెగిటివ్‌గా తేలింది. ముంబై, బీడ్, థానే, రత్నగిరి, నాసిక్, నాందేడ్ ప్రాంతాల్లోని కాకుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని వెల్లడైంది.
దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై రాష్ట్రాలకు కేంద్రం అనేక సూచనలు జారీ చేసింది. ప్రజలలో అవగాహన కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు సమాచార మాథ్యమాలను ఉపయోగిస్తున్నాయి.