తొగుట మండలం కాన్గల్ కోళ్ల ఫామ్​లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ

 తొగుట మండలం కాన్గల్ కోళ్ల ఫామ్​లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ

తొగుట, వెలుగు:  తొగుట మండలం కాన్గల్ గ్రామంలో ఉన్న లేయర్ ఫామ్ లోని కోళ్లకు బర్డ్​ఫ్లూ నిర్ధారణ కావడంతో మంగళవారం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. సిద్దిపేట కలెక్టర్ ఆఫీసులో సంబంధిత శాఖల అధికారులతో అడిషనల్​ కలెక్టర్ గరిమ అగర్వాల్ సమావేశం నిర్వహించారు. వ్యాధి వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి సారి వ్యాధి నిర్ధారణ జరిగిందని, ఈ వ్యాధి ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా, మనుషులకు సోకకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

వ్యాధి సోకిన కోళ్లను భూమిలో పూడ్చివేయాలన్నారు. ఫారంలో పని చేసే వారికి వైద్య పరీక్షలు చేయాలని, కిలోమీటర్ లోపు కోళ్లను, గుడ్లను విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కోళ్ల ఫామ్ పరిసరాలలో  వాహనాల రాకపోకలు సాగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  ప్రజలకు అనుమానాలు ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 8500404016  నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. సమావేశంలో పశుసంవర్ధక జాయింట్ డైరెక్టర్ అశోక్ కుమార్, డీఎంహెచ్​వో పల్వాన్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.