బర్డ్ ఫ్లూ ప్రచారం.. చికెన్ సేల్స్​ ఢమాల్! హైదరాబాద్​లో 50 శాతం డౌన్​

బర్డ్ ఫ్లూ ప్రచారం.. చికెన్ సేల్స్​ ఢమాల్! హైదరాబాద్​లో 50 శాతం డౌన్​
  • చికెన్ కొనేందుకు జంకుతున్న జనాలు
  • రూ.200కు తగ్గిన కిలో స్కిన్​లెస్ చికెన్ ధర

హైదరాబాద్ సిటీ, వెలుగు:  కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకుతోందనే ప్రచారంతో చికెన్​అమ్మకాలపై ఎఫెక్ట్​ పడింది. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు రాజధాని నగరంలో బుధవారం చికెన్ అమ్మకాలు అమాంతం పడిపోయాయి. కొనుగోలుదారులు లేక షాపులు వెలవెలబోయాయి. హైదరాబాద్​లో రోజుకు 6 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరుగుతుండగా, బుధవారం ఇందులో సగం కూడా అమ్ముడుపోలేదు. అయితే, మాంసం ప్రియులు చికెన్ నుంచి మటన్, చేపల వైపు మొగ్గు చూపడంతో మటన్, చేపల అమ్మకాలు ఊపందుకున్నాయి.

పక్క రాష్ట్రం ఏపీలో బర్డ్ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడడంతో అక్కడి ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలపై ఆంక్షలు విధించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ నుంచి కోళ్లు, గుడ్లు, దాణా దిగుమతిని నిషేధించింది. ఇందుకోసం ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో చెకింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసింది. సాధారణంగా హైదరాబాద్ లో ప్రతిరోజు ఒక్కో షాపులో కనీసం 300 నుంచి 500 కిలోల చికెన్ అమ్ముతుంటారు. కానీ, రెండు రోజులుగా కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకుతోందనే ప్రచారంతో అమ్మకాలు తగ్గాయి. బుధవారం 50 శాతం కూడా అమ్మకాలు జరగలేదని వ్యాపారులు చెప్పారు. తెలంగాణలో బర్డ్ ఫ్లూ కేసులు లేనప్పటికీ, సోషల్ మీడియాలో చికెన్ తినడం ప్రభుత్వం నిషేధించిందనే తప్పుడు ప్రచారంతో జనాల్లో భయం నెలకొందని, దీంతో అమ్మకాలు తగ్గాయని అంటున్నారు. నేడు, రేపు అమ్మకాలు మరింత పడిపోయే అవకాశం ఉందంటున్నారు. అయితే, అమ్మకాలు పడిపోతున్న వేళ చికెన్​ధరలు కొద్దిగా తగ్గాయి. వారం కింద కిలో చికెన్ (విత్ స్కిన్) రూ. 200, స్కిన్​లెస్​చికెన్​రూ.220 వరకు ఉండగా బుధవారం కొన్ని చోట్ల విత్ స్కిన్ చికెన్ రూ. 180కి, స్కిన్ లెస్ చికెన్ రూ. 200కి కిలో చొప్పున అమ్మడం కనిపించింది. అమ్మకాలు ఇంకా పడిపోతే, ధరలు కూడా తగ్గించే అవకాశం ఉంది.   

బాగా ఉడకబెట్టి తింటే.. నో ప్రాబ్లమ్​ 

చికెన్ ను 70 డిగ్రీల సెల్సియస్ వేడిలో బాగా ఉడికించి తింటే ఎలాంటి సమస్య ఉండదని అధికారులు చెప్తున్నారు. ఉడికీ ఉడకని చికెన్, గుడ్లు తింటేనే బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఉందంటున్నారు. బర్డ్ ఫ్లూ మనుషుల నుంచి మనుషులకు సోకదని, పక్షులు, జంతువుల నుంచి మాత్రమే మనుషులకు సోకుతుందంటున్నారు. బర్డ్ ఫ్లూ వల్ల పక్షులు, కోళ్లు చనిపోయే అవకాశం ఉంది కానీ, మనుషులపై మాత్రం ప్రభావం తక్కువే ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని సూచిస్తున్నారు. హెచ్5ఎన్1 వైరస్ సోకిన కోళ్లకు సన్నిహితంగా ఉండేవాళ్లకే బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉందని.. కోళ్లఫారాలు, చికెన్ షాపుల్లో పనిచేసే వ్యక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని పశు సంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. 

నిన్నటి నుంచి గిరాకీ లేదు
 
రోజూ 300 కేజీల చికెన్ అమ్మేవాడిని. ఇయ్యాల (బుధవారం)150 కిలోల చికెన్ మాత్రమే అమ్మాను. సేల్స్ ఇంకా తగ్గుతాయేమోనని భయమవుతోంది. సోషల్ మీడియా, వాట్సప్​లలో చికెన్ తినొద్దనే తప్పుడు ప్రచారం వల్ల అమ్మకాలపై ఎఫెక్ట్ పడింది. ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చి, తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి.   
-పర్వతాలు, చికెన్ సెంటర్ నిర్వాహకుడు, చింతల్ బస్తీ  

మన దగ్గర బర్డ్ ఫ్లూ లేకున్నా.. నష్టపోతున్నాం  

వాట్సప్ గ్రూపుల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారం వల్ల బిజినెస్ చాలా డల్ అయింది. మన రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కేసులు లేనే లెవ్వు. అయినా రెండు రోజుల నుంచి చికెన్ అమ్మకాలు బాగా తగ్గాయి. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే మేం చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. 
-చెన్నయ్య, చికెన్ సెంటర్ నిర్వాహకుడు, ఖైరతాబాద్