తెలంగాణలో చాపకిందనీరులా బర్డ్ఫ్లూ..బాటసింగారంలో కోళ్లకు వైరస్

తెలంగాణలో చాపకిందనీరులా బర్డ్ఫ్లూ..బాటసింగారంలో కోళ్లకు వైరస్
  • హైదరాబాద్లో బర్డ్ ఫ్లూ కలకలం..బాటసింగారంలో కోళ్లకు వైరస్
  • రంగారెడ్డి జిల్లాకు పాకిన బర్డ్ ఫ్లూ
  • వైరస్ విస్తరించకుండా అధికారుల చర్యలు
  • పౌల్ట్రీ ఫామ్ సీజ్.. కిలోమీటర్ పరిధిలో సేల్స్ నిషేధం ​ 
  • బర్డ్ ఫ్లూ సోకిన పది వేల కోళ్లను చంపి, పూడ్చివేత 
  • ఒక్కో కోడికి రూ.130 చొప్పున పరిహారం

హైదరాబాద్, వెలుగు:హైదరాబాద్‌‌ శివారులోని అబ్దుల్లాపూర్‌‌మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. మొన్నటిదాకా ఆంధ్రాని గడగడలాడించిన బర్డ్ ఫ్లూ వైరస్ తాజాగా తెలంగాణపై పంజా విసురుతోంది. రెండు నెలలుగా యాదాద్రి భువనగిరి, నల్గొండ, తదితర జిల్లాల్లో పెద్ద ఎత్తున కోళ్లు బర్డ్ ఫ్లూతో చనిపోగా.. తాజాగా నాలుగు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్‌‌ మండలం బాట సింగారంలోని ఓ పౌల్ట్రీ ఫామ్​లో  వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి.

 అధికారులు కోళ్ల శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌‌లో పరీక్షలు చేయించగా బర్డ్ ఫ్లూ అని తేలింది. దీంతో అలర్ట్ అయిన ఆఫీసర్లు బర్డ్ ఫ్లూ మరింత విస్తరించకుండా చర్యలు చేపట్టారు. అధికారికంగా ఎన్ని కోళ్లు మృతి చెందాయనేది మాత్రం నిర్ధారణ కాలేదని పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ మల్లీశ్వరి తెలిపారు. ఏపీలోని నరసరావు పేటలో మార్చి16న రెండేళ్ల బాలిక బర్డ్ ఫ్లూతో మృతి చెందింది. 

బాలిక మరణానికి బర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లూ వైరసే కారణమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) అధికారికంగా ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్రంలోకి బర్డ్ ఫ్లూ విస్తరించకుండా ఎక్కడికక్కడ చెక్ పోస్ట్​లు పెట్టడంతో పాటు కోళ్ల ఫారాలకు వస్తున్న ఫీడ్​పైనా దృష్టిపెట్టామని అడిషనల్ డైరెక్టర్ చెప్పారు. 

ఇప్పటికే గత కొన్ని నెలలుగా తెలంగాణలోనూ అడపాదడపా బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా గత నెల 19, 20వ తేదీల్లో యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు తేల్చారు. ఇలా రాష్ట్రంలో గత రెండు నెలల్లో వరుసగా యాదాద్రి, వనపర్తి, సంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో వేల కోళ్లు చనిపోయాయి. ఒక్క ఫిబ్రవరిలోనే 20 వేల కోళ్లు చనిపోయాయని తెలుస్తోంది.   

రంగారెడ్డి జిల్లాకు వ్యాప్తి.. 

రంగారెడ్డి జిల్లా బాట సింగారంలోని పౌల్ట్రీ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బర్డ్ ఫ్లూ సోకడంతో వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. ఆ కోళ్లను పరిశీలించిన అధికారులు శాంపిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని భోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నేషనల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్(ఎన్ఐహెచ్ఎస్ఏడీ)కు పంపించారు. ఆ కోళ్లకు హెచ్5ఎన్1 వైరస్ సోకిందని సైంటిస్టులు ధ్రువీకరించారు. దీంతో సదరు పౌల్ట్రీ ఫామ్​లోని దాదాపు 10 వేల కోళ్లను చంపేసి జేసీబీ సాయంతో పూడ్చిపెట్టారు. ఆ ఫామ్​ను సీజ్ చేయడంతోపాటు అబ్దుల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెట్ ప్రాంతంలో కోళ్లు, గుడ్లు అమ్మకుండా నిషేధం విధించారు. దాదాపు10 కిలోమీటర్ల పరిధిలోని పౌల్ట్రీ ఫారాలను అధికారులు సందర్శించి బర్డ్ ఫ్లూ నివారణ చర్యలు చేపట్టారు.  

బర్డ్ ఫ్లూ వ్యాపించిన ఫామ్.. 3 నెలలు క్లోజ్ 

బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయిన పౌల్ట్రీ ఫామ్​లను అధికారులు గుర్తించి ఫ్లూ సోకిన కోళ్లను చంపి పూడ్చిపెడతారు. షెడ్​ను శానిటైజ్ చేయడంతో పాటు హైపో క్లోరైడ్ తో క్లోరినేషన్ చేసి, మూసివేసి సీజ్ చేస్తారు. కిలోమీటర్​ రేడియస్​లో ఫ్లూ నివారణ చర్యలు చేపడతారు. మూడు నెలల వరకు సదరు ఫామ్​ను క్లోజ్ చేస్తారు. ఆ తరువాత డాక్టర్లు అధికారులు ఫ్లూ లేదని నిర్ధారించిన తరువాతే తిరిగి పౌల్ట్రీని తెరిచేందుకు అనుమతిస్తారు. చనిపోయిన కోళ్లకు ఒక్కో దానికి రూ.130 చొప్పున పరిహారం కూడా అందిస్తారు. ఈ పరిహారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం చొప్పున భరిస్తాయి.   

బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఇలా..  

బర్డ్ ఫ్లూ ప్రధానంగా కోళ్లు, పక్షుల మధ్య వ్యాపిస్తుంది. వ్యాధి సంక్రమించిన కోళ్లు, పక్షుల మలం, లాలాజలం, మ్యూకస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో పౌల్ట్రీ పరిశ్రమలో పని చేసే వారికి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోడి, బాతు, పావురాల వంటి పక్షులకు దగ్గరగా ఉండే వ్యక్తులకు అధిక ముప్పు ఉంటుంది. అయితే, వేడితోకూడిన పొడి వాతావరణంలో వైరస్ ఎక్కువసేపు బతకలేదని.. చల్లని, తడి వాతావరణంలోనే  దీర్ఘకాలం సజీవంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఇక బర్డ్ ఫ్లూ సోకిన వ్యక్తుల్లో కనిపించే ముఖ్యమైన లక్షణాలు తీవ్రమైన జ్వరం, గొంతు నొప్పి, శ్వాసకోశ సమస్యలు, కళ్లలో ఇన్​ఫెక్షన్, వాంతులు, విరేచనాలు ఉంటాయి. సాధారణ ఫ్లూ లక్షణాలతో పోలిస్తే తీవ్రమైన ప్రభావం ఉంటుంది.  

నివారణ ఇలా..  

బర్డ్ ఫ్లూ బారిన పడి చనిపోయిన కోళ్లను తాకడం, పచ్చి కోడిమాంసం తినడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. చికెన్ ను కనీసం 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో వండుకుంటేనే బర్డ్ ఫ్లూ వైరస్ చనిపోతుందని చెప్పారు. వీలైనంత వరకు బయటి ఆహార పదార్థాలు తినకుండా ఉండడం మేలని సలహా ఇస్తున్నారు. 

అదేవిధంగా పరిశుభ్రత పాటించాలి. చేతులు తరచుగా సబ్బుతో కడగాలి. వ్యాధి సంక్రమించిన, అనారోగ్యంతో ఉన్న కోళ్లు, పక్షులకు దూరంగా ఉండాలి. ఉడికీ ఉడకని చికెన్ తినొద్దు. కచ్చితంగా 70 డిగ్రీలకు పైగా వేడిలో బాగా ఉడికించిన తర్వాత మాత్రమే చికెన్ తినాలి. పౌల్ట్రీ ఫారాలు, కోళ్ల మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు దగ్గరగా ఉండే వారు మాస్కులు ధరిస్తే మంచిదని సూచిస్తున్నారు.