
పల్నాడు జిల్లా: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. చిన్నారి బర్డ్‌ఫ్లూతో మృతి చెందినట్టు ఐసీఎంఆర్ నిర్ధారించింది. పచ్చి కోడి మాంసం ముక్క తినడంతో పాటు, ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం వల్ల ఆ చిన్నారి బర్డ్‌ఫ్లూతో సోకి చనిపోయిందని ఐసీఎంఆర్ వెల్లడించింది. మార్చి 4న మంగళగిరి ఎయిమ్స్‌లో చిన్నారిని చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్చి 16న చిన్నారి మృతి చెందింది.
చిన్నారి మరణంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. చనిపోయిన చిన్నారి ఇంటి సమీపంలో ఆరోగ్య శాఖ సర్వే చేసింది. అనుమానిత లక్షణాలున్న వారెవరూ లేరని నిర్ధారించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పల్నాడు జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని వైద్య శాఖ అధికారులు చెప్పారు.
బర్డ్ ఫ్లూ.. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ (H5N1) వల్ల పక్షుల్లో వ్యాపిస్తుంది. ఇది ముందుగా బాతుల్లాంటి నీటి పక్షుల్లో పుట్టినట్టు నిపుణులు చెప్తున్నారు. అది మనుషులతో సహా ఏ జంతువుకైనా వ్యాపిస్తుంది. పక్షుల రెక్కలు, రెట్టలు, శరీర ద్రవాల ద్వారా ఇతర పక్షులకు వ్యాపిస్తుంది. పెంపుడు జంతువుల విషయానికి వస్తే.. ఈ వ్యాధి సోకితే.. బతకడం చాలా కష్టం.
బర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలంటే చికెన్ని ఇంట్లోనే శుభ్రంగా క్లీన్చేసుకుని, బాగా ఉడికించి తినాలి. చికెన్ని ఎక్కువ టెంపరేచర్స్లో ఉడికించడం వల్ల వైరస్ సోకే ప్రమాదం తగ్గుతుంది. బయట రెస్టారెంట్లలో వండింది తినకపోవడం చాలా బెటర్. ఎందుకంటే.. వాళ్లు ఎలా వండుతున్నారో మనకు తెలియదు. పర్సనల్ హైజీన్ కూడా ముఖ్యమే. చేతితో ముక్కు, నోరు తాకేముందు కచ్చితంగా క్లీన్ చేసుకోవాలి.
ఇదే కాదు.. ఏ వైరస్ వచ్చినా చిన్నపిల్లలు, పెద్దవాళ్లు కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. వైరస్ ఎక్స్పోజర్ తక్కువగా ఉండడం వల్ల కొందరు పిల్లలు దీన్ని తట్టుకోలేకపోవచ్చు. ఇక పెద్దవాళ్లలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం, రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడం వల్ల ఎక్కువ లక్షణాలు కనిపిస్తాయి. కానీ.. మిడిల్ ఏజ్వాళ్లు హెల్దీగా ఉండడం, అప్పటికే చాలా రకాల వైరస్‌లకు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కాస్త ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. దాంతో తొందరగా కోలుకుంటారు.