సిద్ధిపేట జిల్లాలో బర్డ్‌ ఫ్లూ నిర్ధారణ.. 15 వేల కోళ్లు చచ్చిపోయినయ్..!

సిద్ధిపేట జిల్లాలో బర్డ్‌ ఫ్లూ నిర్ధారణ.. 15 వేల కోళ్లు చచ్చిపోయినయ్..!

సిద్దిపేట జిల్లాలో బర్డ్‌ ఫ్లూ నిర్ధారణ అయింది. జిల్లాలోని తొగుల మండలం కన్గల్‌ గ్రామంలో కోళ్లకు బర్డ్‌ ఫ్లూ సోకినట్లు అధికారులు గుర్తించారు. గ్రామంలోని ఓ కోళ్లఫామ్‌లో కోళ్లకు బర్డ్‌ ఫ్లూ సోకినట్లు అధికారులు తేల్చారు. బర్డ్‌ ఫ్లూతో కోళ్ల ఫామ్‌లో 15 వేల కోళ్లు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మొన్నటిదాకా ఆంధ్రాని గడగడలాడించిన బర్డ్ ఫ్లూ వైరస్ తాజాగా తెలంగాణపై పంజా విసిరింది.

రెండు నెలలుగా యాదాద్రి భువనగిరి, నల్గొండ, తదితర జిల్లాల్లో పెద్ద ఎత్తున కోళ్లు బర్డ్ ఫ్లూతో చనిపోగా.. ఇటీవల రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్‌‌ మండలం బాట సింగారంలోని ఓ పౌల్ట్రీ ఫామ్లో  వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. అధికారులు కోళ్ల శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌‌లో పరీక్షలు చేయించగా బర్డ్ ఫ్లూ అని తేలింది.

రంగారెడ్డి జిల్లా బాట సింగారంలోని పౌల్ట్రీ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బర్డ్ ఫ్లూ సోకడంతో వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. ఆ కోళ్లను పరిశీలించిన అధికారులు శాంపిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని భోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నేషనల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్(ఎన్ఐహెచ్ఎస్ఏడీ)కు పంపించారు. 

ఆ కోళ్లకు హెచ్5ఎన్1 వైరస్ సోకిందని సైంటిస్టులు ధ్రువీకరించారు. దీంతో సదరు పౌల్ట్రీ ఫామ్లోని దాదాపు 10 వేల కోళ్లను చంపేసి జేసీబీ సాయంతో పూడ్చిపెట్టారు. ఆ ఫామ్ను సీజ్ చేయడంతో పాటు అబ్దుల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెట్ ప్రాంతంలో కోళ్లు, గుడ్లు అమ్మకుండా నిషేధం విధించారు.

బర్డ్ ఫ్లూ ప్రధానంగా కోళ్లు, పక్షుల మధ్య వ్యాపిస్తుంది. వ్యాధి సంక్రమించిన కోళ్లు, పక్షుల మలం, లాలాజలం, మ్యూకస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో పౌల్ట్రీ పరిశ్రమలో పని చేసే వారికి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోడి, బాతు, పావురాల వంటి పక్షులకు దగ్గరగా ఉండే వ్యక్తులకు అధిక ముప్పు ఉంటుంది. 

అయితే, వేడితోకూడిన పొడి వాతావరణంలో వైరస్ ఎక్కువసేపు బతకలేదని.. చల్లని, తడి వాతావరణంలోనే  దీర్ఘకాలం సజీవంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఇక బర్డ్ ఫ్లూ సోకిన వ్యక్తుల్లో కనిపించే ముఖ్యమైన లక్షణాలు తీవ్రమైన జ్వరం, గొంతు నొప్పి, శ్వాసకోశ సమస్యలు, కళ్లలో ఇన్​ఫెక్షన్, వాంతులు, విరేచనాలు ఉంటాయి. సాధారణ ఫ్లూ లక్షణాలతో పోలిస్తే తీవ్రమైన ప్రభావం ఉంటుంది.  

బర్డ్ ఫ్లూ బారిన పడి చనిపోయిన కోళ్లను తాకడం, పచ్చి కోడిమాంసం తినడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. చికెన్ను కనీసం 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో వండుకుంటేనే బర్డ్ ఫ్లూ వైరస్ చనిపోతుందని చెప్పారు. వీలైనంత వరకు బయటి ఆహార పదార్థాలు తినకుండా ఉండడం మేలని సలహా ఇస్తున్నారు.