![హైదరాబాద్లో కిలో చికెన్ 100 రూపాయలే.. బిర్యానీ రేట్లు తగ్గిస్తారా లేదా..?](https://static.v6velugu.com/uploads/2025/02/bird-flu-outbreak-in-hyderabad-chicken-prices-drop-to-rs-100-per-kg_dWyxk9jvIt.jpg)
- బర్డ్ ఫ్లూ భయం.. పడిపోయిన చికెన్ ధర.. కిలో చికెన్ 100
- ఇతర రాష్ట్రాల నుంచి కోళ్ల వెహికిల్స్ రాకుండా తనిఖీలకు 24 చెక్ పోస్టులు
- కోళ్ల ఫారాల్లో తనిఖీ చేయాలంటూ సర్కారు సర్క్యులర్
- తినొద్దని ప్రభుత్వమే చెప్పిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం
- వెలవెలబోతున్న చికెన్ సెంటర్లు.. హోటళ్లలో బిర్యానీ సేల్స్ డౌన్
- ఉడికించిన చికెన్ తింటే ప్రాబ్లం లేదంటున్న వైద్యులు
హైదరాబాద్: బర్డ్ ఫ్లూ భయానికి చికెన్ ధరలు గణనీయంగా పడిపోయాయి. మొన్నటి వరకు కిలో 280 నుంచి 300 పలికిన చికెన్ ధర అమాంతం కిలో రూ. 100కి చేరింది. బర్డ్ ఫ్లూ భయంతో జనం చికెన్ తినేందుకు జంకుతున్నారు. హైదరాబాద్‌లో 50 శాతానికి పడిపోయాయి చికెన్ అమ్మకాలు. కిలో చికెన్ ధర రూ.100కి పడిపోయింది. సాధారణంగా రోజుకు 6 లక్షల కేజీల చికెన్ అమ్మకాలు జరిగేవి ఇప్పుడు ఇందులో సగం కూడా ఉండటం లేదు. చికెన్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. ఏపీలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి తీవ్రంగా ఉంది. సుమారు 10 లక్షల కోళ్లు మృత్యవాడ పడ్డాయి.
ALSO READ | హైదరాబాద్ లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్: కిలో రూ. 150.. అయినా కొనేటోళ్లే లేరు ..
దీంతో ఏపీ నుంచి కోళ్లు, గుడ్లు రాష్ట్రంలోకి రాకుండా తెలంగాణ ప్రభుత్వం 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తోంది. మరో వైపు రాష్ట్రంలోని పౌల్ట్రీ ఫారాల్లోనూ పశుసంవర్ధకశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇన్ ఫ్లూయేంజా లక్షణాలు కనిపిస్తే వాటిని వేరు చేయడంతోపాటు సూచనలు చేస్తున్నారు. మన రాష్ట్రంలోని కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఖమ్మం జిల్లాల్లోనూ కోళ్లు చనిపోతున్నాయని, ఆ పౌల్ట్రీ ఫారాలను తనిఖీ చేశామని పశుసంవర్ధకశాఖ అధికారులు తెలిపారు. బర్డ్ ఫ్లూ మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్ లో తీవ్రంగా ఉందన్నారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం
రాష్ట్ర ప్రభుత్వం బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో ఓ సర్క్యులర్ జారీ చేసింది. ఆ సర్క్యులర్ లో కోళ్ల ఫారాలను తనిఖీ చేయాలని, ఎక్కడైనా కోళ్లు చనిపోయి ఉంటే వాటిని అక్కడి నుంచి షిప్ట్ చేసి సర్వైలెన్స్ జోన్ గా ప్రకటించాలని పేర్కొంది. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దుల్లో 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని, ఏపీ నుంచి కోళ్లు, గుడ్లు రాకుండా నిరోధించాలని సూచించింది. దీనికి చికెన్ తినొద్దని ప్రభుత్వమే చెప్పిందంటూ ప్రచారం చేస్తున్నారు. ఇంకా కొందరు వినియోగం తగ్గించాలని చెప్పిందని పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటంతో ధరలు అమాంతం పడిపోయాయి.
ఉడికించి తింటే నో ప్రాబ్లం
చికెన్, కోడిగుడ్లు తినేందుకు చాలా మంది భయపడుతున్నారు. చికెన్, గుడ్డు తిసుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదని, అధిక ఉష్ణోగ్రతలో ఈ వైరస్ బతకదని పశువైద్యులు చెబుతున్నారు. కోడిమాంసం, గుడ్లను మనం 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికిస్తామని, అందులో ఎలాంటి వైరస్ ప్రభావం ఉండదని అంటున్నారు. ఈ వైరస్ వ్యాప్తిపై భయపడాల్సిన అవసరం లేదని, మనుషులపై ఎలాంటి ప్రభావం చూపదని చెబుతున్నారు.