బర్డ్​ఫ్లూ ఎఫెక్ట్.. హైదరాబాద్లో లైవ్ ​కోడి 60 రూపాయలే..!

బర్డ్​ఫ్లూ ఎఫెక్ట్.. హైదరాబాద్లో లైవ్ ​కోడి 60 రూపాయలే..!

బర్డ్​ఫ్లూ ఎఫెక్ట్తో చికెన్​ అమ్మకాలు అమాంతం పడిపోయాయి. కస్టమర్లు లేక గ్రేటర్​ పరిధిలోని చికెన్​ షాపులు వెలవెలబోతున్నాయి. మొన్నటి దాకా కిలో చికెన్​ ధర రూ.230 ఉండగా, ప్రస్తుతం రూ.160కు పడిపోయింది. ఇప్పటికే తెచ్చిపెట్టుకున్న కోళ్లను సేల్​ చేసేందుకు వ్యాపారులు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. యాకుత్​పురా బడా బజార్​లోని ఓ షాపులో లైవ్​ కోడిని రూ.60కే ఇస్తున్నట్లు ఇలా బోర్డులు ఏర్పాటు చేశారు.

కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకుతోందనే ప్రచారంతో చికెన్​ అమ్మకాలపై ఎఫెక్ట్​ పడింది. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు రాజధాని నగరంలో చికెన్ అమ్మకాలు అమాంతం పడిపోయాయి. కొనుగోలుదారులు లేక షాపులు వెలవెలబోయాయి. హైదరాబాద్​లో రోజుకు 6 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరుగుతుండగా, ఇందులో సగం కూడా అమ్ముడుపోవడం లేదు. అయితే, మాంసం ప్రియులు చికెన్ నుంచి మటన్, చేపల వైపు మొగ్గు చూపడంతో మటన్, చేపల అమ్మకాలు ఊపందుకున్నాయి.

పక్క రాష్ట్రం ఏపీలో బర్డ్ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడడంతో అక్కడి ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలపై ఆంక్షలు విధించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ నుంచి కోళ్లు, గుడ్లు, దాణా దిగుమతిని నిషేధించింది. ఇందుకోసం ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో చెకింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసింది. సాధారణంగా హైదరాబాద్ లో ప్రతిరోజు ఒక్కో షాపులో కనీసం 300 నుంచి 500 కిలోల చికెన్ అమ్ముతుంటారు. కానీ, రెండు రోజులుగా కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకుతోందనే ప్రచారంతో అమ్మకాలు తగ్గాయి.

తెలంగాణలో బర్డ్ ఫ్లూ కేసులు లేనప్పటికీ, సోషల్ మీడియాలో చికెన్ తినడం ప్రభుత్వం నిషేధించిందనే తప్పుడు ప్రచారంతో జనాల్లో భయం నెలకొందని, దీంతో అమ్మకాలు తగ్గాయని అంటున్నారు. అమ్మకాలు మరింత పడిపోయే అవకాశం ఉందంటున్నారు. అయితే, అమ్మకాలు పడిపోతున్న వేళ చికెన్​ధరలు కొద్దిగా తగ్గాయి.

చికెన్ను 70 డిగ్రీల సెల్సియస్ వేడిలో బాగా ఉడికించి తింటే ఎలాంటి సమస్య ఉండదని అధికారులు చెప్తున్నారు. ఉడికీ ఉడకని చికెన్, గుడ్లు తింటేనే బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఉందంటున్నారు. బర్డ్ ఫ్లూ మనుషుల నుంచి మనుషులకు సోకదని, పక్షులు, జంతువుల నుంచి మాత్రమే మనుషులకు సోకుతుందంటున్నారు.

బర్డ్ ఫ్లూ వల్ల పక్షులు, కోళ్లు చనిపోయే అవకాశం ఉంది కానీ, మనుషులపై మాత్రం ప్రభావం తక్కువే ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని సూచిస్తున్నారు.