
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బాట సింగారంలోని పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ సోకడంతో వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. ఆ కోళ్లను పరిశీలించిన అధికారులు శాంపిల్స్‌ని భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్(ఎన్ఐహెచ్ఎస్ఏడీ)కు పంపించారు. ఆ కోళ్లకు హెచ్5ఎన్1 వైరస్ సోకిందని సైంటిస్టులు ధ్రువీకరించారు.
దీంతో సదరు పౌల్ట్రీ ఫామ్‌లోని దాదాపు 10 వేల కోళ్లను చంపేసి జేసీబీ సాయంతో పూడ్చిపెట్టారు. ఆ ఫామ్‌ను సీజ్ చేయడంతోపాటు అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో కోళ్లు, గుడ్లు అమ్మకుండా నిషేధం విధించారు. దాదాపు10 కిలోమీటర్ల పరిధిలోని పౌల్ట్రీ ఫారాలను అధికారులు సందర్శించి బర్డ్ ఫ్లూ నివారణ చర్యలు చేపట్టారు.
బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయిన పౌల్ట్రీ ఫామ్లను అధికారులు గుర్తించి ఫ్లూ సోకిన కోళ్లను చంపి పూడ్చిపెడతారు. షెడ్ను శానిటైజ్ చేయడంతో పాటు హైపో క్లోరైడ్ తో క్లోరినేషన్ చేసి, మూసివేసి సీజ్ చేస్తారు. కిలోమీటర్ రేడియస్‌లో ఫ్లూ నివారణ చర్యలు చేపడతారు. మూడు నెలల వరకు సదరు ఫామ్‌ను క్లోజ్ చేస్తారు.
ఆ తరువాత డాక్టర్లు అధికారులు ఫ్లూ లేదని నిర్ధారించిన తరువాతే తిరిగి పౌల్ట్రీని తెరిచేందుకు అనుమతిస్తారు. చనిపోయిన కోళ్లకు ఒక్కో దానికి రూ.130 చొప్పున పరిహారం కూడా అందిస్తారు. ఈ పరిహారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం చొప్పున భరిస్తాయి.