సిద్దిపేట జిల్లాలో బర్డ్‌‌‌‌‌‌‌‌ఫ్లూ .. గ్రామంలో ఇంటింటికి సర్వే

సిద్దిపేట జిల్లాలో బర్డ్‌‌‌‌‌‌‌‌ఫ్లూ .. గ్రామంలో ఇంటింటికి సర్వే
  • తొగుట మండలం కాన్గల్‌‌‌‌లోని కోళ్ల ఫామ్‌‌‌‌లో నిర్ధారణ
  • 1.45 లక్షల కోళ్లను చంపేస్తున్న వెటర్నరీ ఆఫీసర్లు

సిద్దిపేట/తొగుట, వెలుగు : సిద్దిపేట జిల్లాలో బర్డ్‌‌‌‌ ఫ్లూ కలకలం చెలరేగింది. తొగుట మండలం కాన్గల్‌‌‌‌లోని లేయర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో కోళ్లకు బర్డ్‌‌‌‌ఫ్లూ సోకినట్లు నిర్ధారణ కావడంతో వెటర్నరీ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ రంగంలోకి దిగింది. ఫామ్‌‌‌‌లో ఐదు షెడ్లలో ఉన్న మొత్తం 1.45 లక్షల కోళ్లను చంపి పూడ్చివేసే పనిని ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేకంగా పది టీమ్స్‌‌‌‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో టీమ్‌‌‌‌లో ఒక వెటర్నరీ డాక్టర్‌‌‌‌, ఇద్దరు కాంపౌండర్లు, ఇద్దరు అటెండర్లను నియమించారు.

 పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది ఫామ్‌‌‌‌లోకి వెళ్లి కోళ్లను చంపే పనిని స్టార్ట్‌‌‌‌ చేశారు. బుధవారం 24 వేల కోళ్లను చంపేశారు. తర్వాత ఫామ్‌‌‌‌కు దూరంగా ఐదు అడుగులు లోతు గోతులు తవ్వి కోళ్లను అందులో వేసి సున్నం, మట్టితో కప్పేస్తున్నారు. ఫామ్స్‌‌‌‌ వైపు ఎవరినీ వెళ్లనివ్వడం లేదు. జిల్లా మొదటి కేసు కావడంతో వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై వెటర్నరీ ఆఫీసర్లు ఆరా తీస్తున్నారు.

ఆందోళనలో ఫౌల్ట్రీ రైతులు

కాన్గల్‌‌‌‌లోని ఫామ్‌‌‌‌లో బర్డ్‌‌‌‌ఫ్లూ నిర్ధారణ కావడంతో జిల్లాలోని పౌల్ట్రీ రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం జిల్లాలో 44  లేయర్, బ్రాయిలర్‌‌‌‌ ఫామ్స్‌‌‌‌లో కలిపి సుమారు 60 లక్షల కోళ్లను పెంచుతున్నారు. బర్డ్‌‌‌‌ ఫ్లూ నిర్ధారణ అయిన కాన్గల్‌‌‌‌ గ్రామ పరిసరాల్లోనే మరో ఐదు పౌల్ట్రీ ఫామ్స్‌‌‌‌లో సుమారు లక్ష కోళ్లను పెంచుతున్నారు. బర్డ్‌‌‌‌ఫ్లూ నిర్ధారణ అయిన ఫామ్‌‌‌‌కు కిలోమీటర్‌‌‌‌ పరిధిలోని ఫామ్స్‌‌‌‌లో ఉన్న కోళ్లను చంపేస్తామని ఆఫీసర్లు చెబుతుండడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. 

కాన్గల్‌‌‌‌లో ఇంటింటి సర్వే

కాన్గల్‌‌‌‌ గ్రామ సమీపంలోని లేయర్‌‌‌‌ ఫామ్ లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో అలర్ట్ అయిన వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే ప్రారంభించారు. గ్రామంలో మొత్తం 512 కుటుంబాలు 2,400 జనాభా ఉండగా.. ఆశా వర్కర్లు బుధవారం 150 ఫ్యామిలీలను సర్వే చేశారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి, జలుబు, దగ్గు, జ్వరాల బారిన పడిన వారి వివరాలు సేకరిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఇంటింటి సర్వే పూర్తికానుంది.