ఒడిశాలో బర్డ్ ఫ్లూ : పక్షులు, కోళ్లను ఎక్కడ పడితే అక్కడ చంపేస్తున్నారు..!

ఒడిశా రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వణికిస్తుంది. రాజధాని భువనేశ్వర్ సిటీకి 30 కిలోమీటర్ల దూరంలోనే.. పిపిలి అనే ప్రాంతంలో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు గుర్తించారు అధికారులు. పూరీ జిల్లాలోని కొన్ని కోళ్ల ఫారాల్లో వందల సంఖ్యలో కోళ్లు చనిపోవటం.. అదే విధంగా 18 వందల పక్షులు చనిపోయి ఉండటాన్ని గుర్తించిన అధికారులు.. వాటికి పరీక్షలు నిర్వహించారు. బర్డ్ ఫ్లూ లక్షణాలు స్పష్టంగా వాటిలో ఉన్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయా ప్రభుత్వ శాఖలు అప్రమత్తం అయ్యాయి.

పూరీ జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ బయటపడిన ప్రాంతాల్లోని కోళ్ల ఫారాల్లోని కోళ్లను చంపేస్తున్నారు అధికారులు. ఇప్పటికే 10 వేల కోళ్లను చంపేశారు. అదే విధంగా 20 వేల పక్షులను సైతం చంపేందుకు రెడీ అయ్యారు అధికారులు. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇలాంటి కఠిన చర్యలు తప్పవని ఒడిశా పశు సంవర్థక శాఖ అధికారులు వెల్లడించారు. 

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయిన కోళ్ల ఫారాలకు కిలో మీటర్ పరిధిలోని అన్ని పక్షులను నిర్మూలిస్తామని వెల్లడించారు ఒడిశా సర్కార్ వెటర్నరీ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్ మనోజ్ పట్నాయక్. రాబోయే ఆరు నెలల వరకు ఆయా ప్రాంతాల్లో కోళ్లు, బాతుల పంపకంపై నిషేధం విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. 

బర్డ్ ఫ్లూ పక్షులు, కోళ్ల నుంచి మనుషులకు వ్యాపించకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలను తీసుకుంటున్నామని వెల్లడించారు ఒడిశా ఉన్నతాధికారులు.