యాదాద్రి జిల్లాలో బర్డ్‌‌ ఫ్లూ కలకలం

యాదాద్రి జిల్లాలో బర్డ్‌‌ ఫ్లూ కలకలం
  • చౌటుప్పల్‌‌ మండలం నేలపట్ల గ్రామంలో ఫ్లూ నిర్ధారణ
  • గ్రామానికి కిలోమీటర్‌‌ దూరంలో కోళ్ల పెంపకాన్ని నిషేధించిన ఆఫీసర్లు
  • చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న కోళ్లకు టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు

యాదాద్రి/చౌటుప్పల్, వెలుగు : యాదాద్రి జిల్లాలో బర్డ్‌‌ ఫ్లూ నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. జిల్లాలోని చౌటుప్పల్‌‌ మండలం నేలపట్లలో ఇటీవల చనిపోయిన కోళ్లకు బర్డ్‌‌ఫ్లూ సోకినట్లు కన్ఫర్మ్‌‌ కావడంతో ఆఫీసర్లు రంగంలోకి దిగారు. కోళ్ల ఫారాన్ని పూర్తిగా శానిటైజ్‌‌ చేయడంతో పాటు ఆ ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. ఫారం చుట్టూ కిలోమీటర్‌‌ పరిధిలో ఉన్న కోళ్లను చంపేసేందుకు నిర్ణయించారు.  

నిషేధిత ప్రాంతంగా నేలపట్ల

యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌ మండలం నేలపట్ల గ్రామంలోని శివ అనే వ్యక్తికి చెందిన ఫారంలో తరచూ కోళ్లు చనిపోతున్నాయి. ఈ నెల 16న ఒకేసారి 600 కోళ్లు చనిపోవడంతో గొయ్యి తీసి పాతిపెట్టారు. విషయం తెలుసుకున్న పశుసంవర్థక శాఖ ఆఫీసర్లు ఫారం వద్దకు వచ్చి కోళ్లకు సంబంధించిన శాంపిల్స్‌‌ను సేకరించి ల్యాబ్‌‌కు పంపించారు. అక్కడ టెస్ట్‌‌లు చేసి చనిపోయిన కోళ్లకు బర్డ్‌‌ ఫ్లూ సోకిందని జిల్లా ఆఫీసర్లకు ప్రాథమికంగా సమాచారం అందించారు. దీంతో జిల్లా పశు సంవర్థక శాఖ ఆఫీసర్‌‌ జానయ్య తన సిబ్బందితో కలిసి హుటాహుటిన నేలపట్లలోని కోళ్లఫారం వద్దకు చేరుకున్నారు. పశుసంవర్ధక శాఖ సిబ్బంది పీపీఈ కిట్స్‌‌, ముఖాలకు మాస్క్‌‌లు ధరించి కోళ్ల ఫారంలోకి వ్యర్థాలను పూర్తిగా తొలగించారు. 

అనంతరం జేసీబీతో గొయ్యి తవ్వించి సున్నం చల్లి వ్యర్థాలను పూడ్చివేశారు. అనంతరం ఫారంతో పాటు పరిసర ప్రాంతాల్లో శానిటైజేషన్‌‌ చేయించారు. ఈ కోళ్ల ఫారానికి సమీపంలో ఉన్న మరో నాలుగు ఫారాలను మూసివేయాలని ఆదేశించి, ఆ ఏరియా మొత్తాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. ఫారాల్లో ఉన్న దాణాను సీజ్‌‌ చేశారు. ఫారాల పరిసర ప్రాంతాల్లో 15 రోజులకు ఒకసారి శానిటైజేషన్‌‌ చేయాలని, మూడు నెలల పాటు కోళ్లను పెంచవద్దని ఆదేశించారు. 

పదికిలోమీటర్ల పరిధిలో శాంపిళ్ల సేకరణ

నేలపట్ల గ్రామం నుంచి చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న కోళ్ల ఫారాలను పశు సంవర్ధక శాఖ ఆఫీసర్లు పరిశీలించనున్నారు. ఆయా ఫారాల్లో ఉన్న కోళ్ల నుంచి శాంపిల్స్‌‌ సేకరించి ల్యాబ్‌‌కు పంపనున్నారు. హైదరాబాద్‌‌కు సమీపంలో ఉన్న యాదాద్రి జిల్లాలో కోళ్ల పెంపకం పెద్ద ఎత్తున జరుగుతోంది. జిల్లాలో సుమారు 40 లక్షలకుపైగా కోళ్లు ఉన్నట్లు పశు సంవర్ధక శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడు జిల్లాలో బర్డ్‌‌ ఫ్లూ నిర్ధారణ కావడంతో అటు పెంపకందారులు, ఇటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కోళ్లు కనిపిస్తే చంపేయడమే...

నేలపట్ల గ్రామంలో ఫ్లూ సోకిన కోళ్ల ఫారం నుంచి చుట్టూ కిలోమీటర్‌‌ పరిధిలో ఆఫీసర్లు ఆంక్షలు విధించారు. ఈ ఏరియాలో ఫారం కోళ్లతో పాటు నాటు కోళ్లు కనిపించినా వాటిని చంపి పూడ్చి వేస్తామని పశు సంవర్ధక శాఖ ఆఫీసర్లు ప్రకటించారు. నేలపట్ల గ్రామ పరిసరాల్లోని కోళ్ల ఫారాలన్నీ ఖాళీగానే ఉన్నాయని, అయితే కొన్ని చోట్ల నాటు కోళ్లు ఉన్నట్లు తెలిసిందని ఆఫీసర్లు చెప్పారు. కిలోమీటర్‌‌ పరిధిలో చికెన్‌‌ షాపులను క్లోజ్‌‌ చేయాలని ఆదేశించారు. పోలీస్‌‌ పికెటింగ్‌‌తో పాటు కంట్రోర్‌‌ రూంను కూడా ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.

భయం వద్దు 

యాదాద్రి జిల్లాలోని నేలపట్ల గ్రామంలో బర్డ్‌‌ ఫ్లూ నిర్ధారణ అయింది. మిగతా ప్రాంతాల్లో ఫ్లూ సోకలేదు. చికెన్‌‌, గుడ్లను ఉడికించి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదు. సరిగా ఉడకకపోతేనే హెల్త్‌‌ ప్రాబ్లమ్స్‌‌ వస్తాయి. 

జానయ్య, పశు సంవర్థక శాఖ ఆఫీసర్​ , యాదాద్రి