![బార్డర్ జిల్లాల్లోబర్డ్ ఫ్లూ టెన్షన్!..సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు, ప్రత్యేక తనిఖీలు](https://static.v6velugu.com/uploads/2025/02/bird-flu-tension-in-border-districts-setting-up-check-posts-at-borders-special-inspections_faLcTDkmtU.jpg)
- కోళ్లు, కోడిగుడ్లు, దాణా రాకుండా చర్యలు
- వెహికల్స్‌ను తిప్పిపంపిస్తున్న అధికారులు
ఖమ్మం/ సూర్యాపేట, వెలుగు : ఏపీలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో సరిహద్దు జిల్లాల్లో టెన్షన్ నెలకొంది. ప్రభుత్వ ఆదేశాలతో ఏపీని ఆనుకొని ఉన్న ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అక్కడ పశు సంవర్థక శాఖ సిబ్బందిని నియమించారు. వాహనాలను తనిఖీ చేసిన అనంతరం రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ప్రత్యేకించి కోళ్లు, కోడి గుడ్లు, కోళ్ల దాణా ఏపీ నుంచి మన రాష్ట్రంలోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. కోళ్లు, గుడ్లు, దాణాతో ఏవైనా వాహనాలు వస్తే వాటిని తిప్పి పంపిస్తున్నారు.
ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం వేల్పూరు, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. అక్కడి కోళ్ల నుంచి తీసుకున్న శాంపిల్స్‌లో ఏవీఎన్ ఇన్ ఫ్లుయెంజా(హెచ్5ఎన్1-బర్డ్ ఫ్లూ) ఉందని నిర్ధారించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దులు ఆనుకొని ఉండడంతో ఇక్కడి అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. సూర్యాపేట జిల్లాలో కోదాడ రామాపురం దగ్గర, నల్గొండ జిల్లాలో తిరుమలగిరి సాగర్, వాడపల్లి వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.
రెండు ఉమ్మడి జిల్లాలకు ఏపీ నుంచే సప్లై..
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వేల సంఖ్యలో చికెన్ షాపులున్నాయి. వాటికి అవసరమైన కోళ్లు, కోడి గుడ్లు, దాణాను వ్యాపారులు ఏపీ నుంచే తీసుకువస్తారు. రెండు వారాల కిందటి వరకు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో 3 వేల కోళ్లు, కల్లూరు మండలంలో 5 వేల కోళ్లు చనిపోయాయి. అప్రమత్తమైన అధికారులు శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించారు. అయితే నెల రోజుల్లోపు వయసు ఉన్న కోడి పిల్లలు వాతావరణ మార్పుల వల్ల వైరస్ సోకి చనిపోయాయని ప్రకటించారు. కోళ్లు చనిపోయిన ఫామ్‌లను శుభ్రం చేసి, రెండు నెలల పాటు ఖాళీగా ఉంచాలని, ఆ తర్వాతనే కొత్త కోడి పిల్లలను పెంచుకోవాలని కోళ్ల ఫారం యజమానులకు సూచించారు.
వరుసగా కోళ్లు చనిపోతుండడంతో ఎలాంటి వైరస్ సోకని కోళ్ల ఫామ్ యజమానులు కూడా ఆందోళనకు గురయ్యారు. ఉన్న కోళ్లను అమ్ముకొని ప్రస్తుతానికి ఫామ్‌లను ఖాళీ చేశారు. ఈ దశలోనే ఏపీలో బర్డ్ ఫ్లూ కేసులు బయటపడ్డాయి. బర్ద్ ఫ్లూ నేపథ్యంలో కోళ్ల ఫామ్ లలో మళ్లీ వెటర్నరీ డాక్టర్లు శాంపిల్స్ సేకరిస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఎలాంటి బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని, భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.
చికెన్ తినొద్దంటూ తప్పుడు ప్రచారం
హైదరాబాద్ : బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు ఓ సర్క్యూలర్ జారీ చేయగా, దానిపై నెట్టింట తప్పుడు ప్రచారం జరుగుతోంది. సర్క్యూలర్ లో ఏముందో చదవకుండానే పలువురు ‘చికెన్ తినొద్దు’ అంటూ పైన హెడ్లైన్ పెట్టి, ఈ సర్క్యులర్ ను సోషల్‌మీడియాలో తిప్పుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో హైలీ పాతొజెనిక్ ఏవియన్ ఫ్లూయెంజా(హెచ్పీఏఐ) వ్యాప్తి చెందుతున్నందు వల్ల కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర పశుసంవర్థకశాఖ, డెయిరీ డెవలప్ మెంట్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్కలిసి ఈ సర్క్యులర్ ఇచ్చాయి.
ఇందులో చికెన్ తినవద్దని ఎక్కడా లేదు. జబ్బుతో కోళ్లు చనిపోతే వెటర్నరీ, పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని, చనిపోయిన కోళ్లను తరలించేటప్పుడు, డిస్పోజ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని పౌల్ట్రీ వ్యాపారులకు సూచనలు మాత్రమే ఉన్నాయి. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు బర్డ్‌ఫ్లూ గుర్తించలేదని, ఒకవేళ బర్డ్‌ఫ్లూ ఉన్నప్పటికీ చికెన్ నుఉడికించి తినడం వల్ల వ్యాప్తి చెందదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
బర్డ్ ఫ్లూ రాకుండా చర్యలు తీసుకుంటున్నాం
ఏపీలో బర్డ్ ఫ్లూ కేసుల వ్యాప్తిపై అప్రమత్తంగా ఉన్నాం. కోళ్లు, ఎగ్స్, దాణా రాష్ట్రంలోకి రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నాం. బార్డర్ మండలాల్లో ఉన్న కోళ్ల ఫామ్ లను ఇప్పటికే విజిట్ చేసి, తగు సూచనలు ఇచ్చాం. ఏపీ బార్డర్‌కు 10 కిలోమీటర్ల పరధిలోని ఫామ్‌లను ఖాళీ చేయిస్తాం. ఫామ్‌లోకి వెళ్లే సమయంలో తప్పకుండా మాస్క్ ధరించాలని ఓనర్లకు సూచించాం.
– కె.వెంకటనారాయణ, పశుసంవర్థక శాఖ జేడీ, ఖమ్మం