అడవులను నరకటం.. పక్షులకు ప్రాణ సంకటం
నేడు ప్రపంచవ్యాప్తంగా అడవుల విస్తీర్ణం ఊహకు కూడా అందనివిధంగా రోజురోజుకి తగ్గిపోతున్నది. దీనికిగల ప్రధాన కారణం జనాభా విస్ఫోటనం. గ్రామీణ ప్రాంతాల్లోనూ సాంకేతికత వెల్లువ కారణంగా వృక్షాల శాతం గణనీయంగా దిగజారిపోతున్నది.
మరోవైపు అడవులను నరికి నివాస స్థలాలను ఏర్పరుచుకుంటున్నారు. ఆహార కొరతను అధిగమించుటకు అడవులను నరికి సాగుభూమిని వృద్ధి చేసుకుంటున్నారు. దీని కారణంగా పక్షులు వాటి నివాస స్థలాలైన వృక్షాలపై ఆవాసాలను కోల్పోతున్నాయి. కమ్యూనికేషన్ రంగంలో సాంకేతిక విప్లవం స్వాగతించాల్సిందే. స్మార్ట్ఫోన్ల (మొబైల్) సమాచార ప్రసారం కోసం రేడియో తరంగాలను విడుదల చేస్తాయి.
ఈ రేడియో తరంగాలు సెల్ టవర్స్ ద్వారా వ్యాప్తి చెందుతాయి. రేడియో తరంగాలు చిన్నజీవులైన పక్షులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. కిరణాల కారణంగా పక్షులు వాటి దారులను గుర్తించడంలో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వీటి కారణంగా పక్షుల ఆవాస స్థలాలు మారిపోతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలు, ఆహార లభ్యతలో తగ్గుదల వలన పక్షులు తమ సంతతిని పెంచటంలో ఇబ్బందులు పడుతున్నాయి. ఈ మధ్య కాలంలో జరిగిన అన్ని శాస్త్రీయ పరిశోధనలు మొబైల్ టవర్స్ చుట్టూ పక్షుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని తెలుపుతున్నాయి.
ప్రతి పౌరుని బాధ్యత
భారతదేశంలో పక్షులను రక్షించడానికి, వాటి నివాస స్థలాలను కాపాడటానికి వివిధ చట్టాలు అమలులో ఉన్నాయి. వన్యప్రాణి పరిరక్షణ చట్టం-1972 ప్రకారం ఏ వ్యక్తి అయినా పక్షులను చంపడం, పక్షుల గూడులను ధ్వంసం చేయడం, పక్షులు పెట్టిన గుడ్లను తీయడం నేరం. పర్యావరణ పరిరక్షణ చట్టం -1986 ప్రకారం పక్షులకు ఆహారం, నివాసం అందించే చెట్లను నరకడం లేదా వాటి నివాస స్థలాలను ధ్వంసం చేయడం నేరంగా పరిగణిస్తారు.
పక్షుల సంరక్షణ అనేది పర్యావరణ సంరక్షణకు కీలకం. పక్షులను రక్షించడం ప్రతి పౌరుని బాధ్యత. పక్షులకు ఆహార భద్రత కల్పించడం, పచ్చదనం పెంచడం, పక్షుల సంరక్షణ గురించి ప్రజలలో అవగాహన పెంచడం, విద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా పక్షుల సంఖ్యను వృద్ధి చేయవచ్చు. పక్షులను రక్షించడం కేవలం ప్రకృతికి మేలు చేయడం మాత్రమే కాదు. మన భవిష్యత్తు తరాలకు ప్రకృతి సంపదను అందించడమే. పక్షుల సంరక్షణే మన భవిష్యత్తుకు భరోసా.
- తుమ్మ కమలహాసన్, జీవశాస్త్ర నిపుణుడు-