మానవాళి పరిరక్షణలో పక్షుల పాత్ర కీలకం: పీసీసీఎఫ్​ సువర్ణ

మానవాళి పరిరక్షణలో పక్షుల పాత్ర కీలకం: పీసీసీఎఫ్​ సువర్ణ

మంచిర్యాల, వెలుగు: పక్షులు జీవ వైవిధ్యంతో పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మానవాళికి మేలు చేస్తున్నాయని ప్రిన్సిపల్  చీఫ్  కన్జర్వేటర్ ఆఫ్  ఫారెస్ట్ డాక్టర్ సువర్ణ తెలిపారు. శనివారం కలెక్టరేట్  మీటింగ్​ హాల్​లో అటవీ శాఖ, వరల్డ్  వైల్డ్  లైఫ్  ఫండ్, నేచర్  కన్జర్వేషన్  ఫౌండేషన్​ ఆధ్వర్యంలో నిర్వహించిన కవ్వాల్ బర్డ్ ఫెస్టివల్ ప్రోగ్రామ్‎లో కవ్వాల్ టైగర్  రిజర్వ్  ఫీల్డ్  డైరెక్టర్  శాంతారాం, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, సీసీఎఫ్ శరవణన్, ఇన్​స్టిట్యూట్ ఆఫ్ బర్డ్స్  స్టడీస్(రిషి వాలీ) శాంతారాం, వెట్ ల్యాండ్స్ ఎక్స్​పర్ట్ గుజ్జా భిక్షం, బర్డ్స్  మైగ్రేషన్  స్టడీస్  ప్రముఖులు సాతియా సెల్వం, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ ఎన్జీవో సీతారాంరెడ్డి, బర్డ్  బయో జియోగ్రఫీ ప్రముఖులు రాబిన్ విజయన్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీఎఫ్​​మాట్లాడుతూ పర్యావరణంలో పక్షుల పాత్రను ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు.

 పక్షుల సంరక్షణను అలవాటుగా మార్చుకోవాలని, ఇందుకోసం కార్పొరేట్  సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు.   మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విద్యార్థి దశలోనే పక్షులపై ప్రేమ చూపించేవారని, ప్రధాని అయ్యాక పక్షుల పరిరక్షణ, అధ్యయనం కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టను దసరా రోజు బంధించి చూడడం నేరమన్నారు. పతంగుల మాంజాతో ఎన్నో పక్షులు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 
ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లాలోని మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్​లో గోదావరి, ప్రాణహిత నదీ తీరాన ఉన్న అటవీ ప్రాంతంలో పక్షి సంపద అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేయాలన్నారు. అనంతరం కవ్వాల్  టైగర్  రిజర్వ్​లో సంచరించే వివిధ రకాల పక్షులతో కూడిన బ్రౌచర్ ను ఆవిష్కరించారు.