- 26 బైక్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
- జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు
బీర్కూర్, వెలుగు : జల్సాలకు అలవాటు పడి బైక్‌లను దొంగలించి అమ్ముకుంటున్న ఇద్దరు దొంగల ముఠాను బీర్కూరు పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. బీర్కూర్ ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్ మండల కేంద్రంలోని ప్రధాని రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తుండగా.. అటుగా బైక్‌పై వచ్చిన ఇద్దరు నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. బోధన్ కు చెందిన మహమ్మద్ అబ్దుల్ ఐయాజ్ ఖాన్ (36), మహమ్మద్ సమీరోద్దీన్ (18) గా గుర్తించామన్నారు.
వీరు కొన్ని నెలలుగా కామారెడ్డి జిల్లాలోని పిట్లం, బాన్సువాడ, బీర్కూర్, సదాశివనగర్, గాంధారి, భిక్కనూర్, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, నిజామాబాద్, కమ్మర్‌పల్లి, ఇందల్‌వాయి, సంగారెడ్డి జిల్లాలోని పెద్ద శంకరం పేట, కల్హేర్, తదితర ప్రాంతాల్లో బైక్‌లు దొంగలించారు. ఆయా ప్రాంతాల్లో ఇండ్ల ముందు పార్క్ చేసిన బండ్లను దొంగతనం చేసి వాటిని అమ్ముకుని జల్సా చేసేవారని చెప్పారు. ఇద్దరు నిందితుల నుంచి 26 బైక్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్ పేర్కొన్నారు.