కల్వకుంట్ల ఫ్యామిలీ దోపిడీ వల్లే రాష్ట్రం దివాలా: బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట/రాజపేట, వెలుగు : కల్వకుంట్ల కుటుంబం దోపిడీ వల్లే రాష్ట్రం దివాలా తీసిందని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆలేరు కాంగ్రెస్ క్యాండిడేట్ బీర్ల అయిలయ్య ఆరోపించారు. యాదాద్రి జిల్లా ఆలేరు మండలం గొలనుకొండ, గుండాల మండలం వస్తాకొండూర్, రామారం, అంబాల, సీతారాంపురం, గంగాపురం గ్రామాల నుంచి 500 మంది, ఆలేరు పరిధిలో 1000 మంది బీఆర్ఎస్ నాయకులు గురువారం బీర్ల అయిలయ్య సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీటింగ్ లో, రాజాపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహిళ ఆశీర్వాద యాత్రలో బీర్ల అయిలయ్య మాట్లాడారు.

మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ నాయకులు ఇష్టానుసారంగా దోచుకుని అప్పులపాలు చేశారని విమర్శించారు. సీఎం కేసీఆర్ పాలనపై విరక్తి చెందిన ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలిపారు. ఆరు గ్యారంటీలతో ప్రజల నుంచి కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ చూసి కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు. ఆలేరులో ఎమ్మెల్యే సునీత ప్రజాసేవను మరిచి వేలకోట్ల ఆస్తుల సంపాదనకే పరిమితమైందన్నారు. ఎలక్షన్​ కోడుకు ముందు ఆదరబాదరాగా ఆయా పనులకు శంకుస్థాపనలు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వామేనని ఆయన స్పష్టం చేశారు.