ఆదివాసీల ఆరాధ్య దైవం బిర్సా ముండా

ఆదివాసీల ఆరాధ్య దైవం బిర్సా ముండా
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్

భద్రాచలం, వెలుగు : ఆదివాసీలకు ఆరాధ్య దైవం, వారి హక్కుల కోసం బ్రిటీషు వారిలో పోరాడిన వీరుడు బిర్సా ముండా అని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ అన్నారు. ఐటీడీఏ మీటింగ్​ హాల్​లో శుక్రవారం బిర్సా ముండా 150వ జయంతి, పీఎం ధర్తీ అభజాన్​ జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్​ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణతో కలిసి పాల్గొన్నారు. బిర్సా ముండా ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ అడవి మీద ఆధారపడి జీవించే ఆదివాసీల హక్కుల కోసం పోరాడారని, బ్రిటీషు పాలకులు అధిక పన్నులు వేస్తున్నారనే కారణంతో ఎదురు తిరిగిన ధీరుడు అని కొనియాడారు. ఆదివాసీ ప్రతిఘటన ప్రమాదాన్ని గుర్తించిన బ్రిటీషు పాలకులు ఆయన్ను అరెస్ట్ చేసి విషప్రయోగం చేసి హతమార్చారని తెలిపారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నేటి తరం అభివృద్ధి కోసం కంకణం కట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా గిరిజన విద్యార్థులు ట్రైబల్ స్పోర్ట్స్​లో రాష్ట్రస్థాయిలో ఓవరాల్ ఛాంపియన్స్ గా నిలవడం గర్వకారణం అన్నారు. ఎమ్మెల్యేలు, ట్రైకార్​ జీఎం శంకర్​రావు మాట్లాడుతూ బిర్సా ముండా ఆశయాలను కొనసాగిస్తామని ప్రకటించారు. బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని ప్రధాని పర్చువల్​గా రూ.6,600కోట్లతో పీఎం ధర్తీ అభజాన్​ జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్​ పథకాన్ని ప్రారంభించగా వేడుకల్లో పాల్గొన్న ఆదివాసీలు, ఆదివాసీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివాసీలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆటోలు, కుల ధ్రువీకరణ పత్రాలు, చదువుకు స్కాలర్​షిప్పులను అందించారు. ఆదివాసీ సంఘాల నాయకులు కలెక్టర్, ఎమ్మెల్యేలను సత్కరించారు.

గిరిజన గ్రామాల్లో వసతుల కల్పనకు కృషి

కామేపల్లి :  గిరిజన గ్రామాల్లో ఆరోగ్యం, విద్య  మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గిరిజన గౌరవ దినోత్సవ సమరోహం కార్యక్రమాన్ని మండలంలోని టేకుల తండాలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలోని మహిళలు, విద్యావేత్తలు, యువకులు అందరూ కలిసి సమష్టిగా గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీటీడబ్ల్యూ వో జహీరుద్దీన్, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ విజయలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్  మేకల మల్లిబాబు యాదవ్ తదితరులు  పాల్గొన్నారు.