కొత్త విధానం అమల్లోకి తెచ్చిన బల్దియా
గ్రేటర్ లో సిటిజన్ సర్వీసు సెంటర్లలో సేవలు బంద్
అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లకు జారీ అధికారం
హెల్త్ అసిస్టెంట్లలో ఆందోళన
హైదరాబాద్,వెలుగు: బర్త్, డెత్సర్టిఫికెట్ల జారీకి జీహెచ్ఎంసీ కొత్త విధానం తెచ్చింది. ఇకపై ‘మీసేవ’ల్లోనే అప్లై, జారీ చేసేలా నిర్ణయించింది. దీని అమలు కోసమే కొద్ది రోజుల కిందట జీహెచ్ఎంసీ పరిధిలోని30 సీఎస్సీ ( సిటిజన్ సర్వీస్ సెంటర్ల)లో సేవలను నిలిపివేసింది. ఈ కొత్త విధానం పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రస్తుతమున్న దాన్ని అధికారులు నిలిపివేశారు. దీంతో ఈ నెల1 నుంచి 10వేల అప్లికేషన్స్ పెండింగ్‌లో ఉన్నాయి. సర్టిఫికెట్ల జారీ నిలిచిపోవడం, కొత్త విధానం అమలు కాకపోవడంతో సిటిజన్స్ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటిదాకా వార్డు ఆఫీసుల్లో హెల్త్అసిస్టెంట్ల వద్ద అప్లికేషన్లు చేసుకునేది. అయితే ఈనెల 1 నుంచి వారి సేవలను బంద్‌పెట్టారు. ప్రస్తుతం వారు 10 రోజులుగా పాత అప్లికేషన్లను ఆన్లైన్లో ఎక్కించే పనిలో ఉన్నారు. అయితే సర్కిళ్లలోని అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ల(ఏఎంసీ)ను సబ్ రిజిస్ట్రార్లుగా గుర్తించి పరిశీలన, జారీ అధికారం వారికే అప్పగించింది. నెల రోజులు దాటినా, ఏడాదిలోపు వచ్చిన అప్లికేషన్లను రిజిస్ట్రార్లుగా ఉండే ఏఎంహెచ్‌ఓలు పరిశీలించి జారీ చేస్తారు. అంతకు మించితే ఆర్డీవో జారీ చేయాలి. ప్రస్తుతం వార్డు యూనిట్‌గా ఉన్న బర్త్, డెత్సర్టిఫికెట్ల జారీ ఇక నుంచి సర్కిల్ యూనిట్‌గా మార్చారు.
భవిష్యత్ ఏంటోనని..
వార్డు ఆఫీసులో బర్త్, డెత్ సబ్ రిజిస్ర్టార్లుగా కొనసాగిన హెల్త్ అసిస్టెంట్లు అయోమయంలో పడ్డారు. తమ సేవలు నిలిపివేయాలని ఈ నెల1నుంచి ఆదేశాలు రావడంతో తమ భవిష్యత్ ఏంటోననే ఆందోళనలో ఉన్నారు. గ్రేటర్లో 150 డివిజన్లు ఉండగా 30 మంది హెల్త్ ఆఫీసర్లు బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ చేస్తుంటారు. ఇటీవల ఆరుగురిని తొలగించగా, మొన్నటి వరకు 24 మంది ఉండేవారు. ఇప్పుడు వీరి సేవలు నిలిపివేడయంతో తమకు ఎక్కడ డ్యూటీ ఇస్తారన్న విషయం ఇంకా చెప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు. సబ్ రిజిస్ట్రార్లుగా కొనసాగిన హెల్త్ అసిస్టెంట్లను ఎక్కడికి పంపుతారన్న విషయాన్ని బల్దియా ఇంకా తేల్చలేదు.
హెల్త్ టూరిస్ట్‌లకు ఇబ్బందే..
సిటీలో హెల్త్ టూరిజం పెరిగిపోవడంతో ఫారెన్ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. వచ్చిన వారిలో ఎవరైనా మరణిస్తే డెడ్‌బాడీని స్వదేశానికి పంపించాలంటే మస్ట్‌గా జీహెచ్ఎంసీ జారీ చేసిన డెత్ సర్టిఫికెట్ ఉండాలి. ఇక కొత్త విధానంలో భాగంగా మీ సేవల్లో అప్లై చేసుకుంటే అది ఏఎంసీకి చేరాలంటే 3 రోజులు టైం పట్టే అవకాశం ఉంది. దీంతో ఫారెనర్స్ప్రయాణానికి ఇబ్బందులు రావొచ్చు. పాత విధానంలోనైతే గంటల వ్యవధిలోనే డెత్ సర్టిఫికెట్లు జారీ అవుతాయి. దీనిపై బల్దియా అధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోనున్నారో పూర్తిస్థాయిలో తేల్చలేదు.
ఇకపై రూ.30 వసూలు
మొన్నటి వరకు సర్కిల్ ఆఫీసుల్లోని సిటిజన్ సెంటర్లలో అప్లైతో పాటు సర్టిఫికెట్లను పొందే అవకాశం ఉంది. అందుకు బల్దియా రూ.20 వసూలు చేసేది. ప్రస్తుతం తీసుకొచ్చిన కొత్త విధానంలో రూ.30 చెల్లించాల్సి ఉంటుంది. మీసేవ సెంటర్లలో ఇంతకు రెట్టింపు కూడా వసూలు చేసే అవకాశం లేకపోలేదు. ప్రైవేట్ ఏజెన్సీలు కావడంతో ఎక్కువ వసూలు చేసినా అడిగేవారు లేరు.
జనానికి నష్టమే..
ప్రతి ఏటా గ్రేటర్లో బర్త్ సర్టిఫికెట్లు లక్షా 50 వేలు, డెత్ సర్టిఫికెట్లు దాదాపు 60 వేల వరకు జారీ అవుతుంటాయి. వివిధ పను ల కోసం ఒరిజినల్ సమర్పించాల్సి ఉం టుంది. కాబట్టి ఒక్కొక్కరు సుమారు 10 కాపీలను తీసుకుంటారు. ఇలా రెండింటి కీ కలిపి 6 లక్షల సర్టిఫికెట్లను ప్రతి ఏటా సిటిజన్స్ సెంటర్లు ఇస్తుంటాయి. మొత్తంగా 7 లక్షల పత్రాలను మీసేవ సెంటర్లలో పొందేందుకు ఒక్కోదానికి రూ.30 చొప్పున చెల్లిస్తే సుమారు రూ.2.1 కోట్ల ఇన్‌కం వస్తుంది. అదే జీహెచ్ఎంసీలోని సిటిజన్స్ సర్వీస్ సెంటర్లలోనైతే అంత ఖర్చు ఉండదు. మొదటి కాపీకి రూ.20. ఆ తర్వాత కాపీకి ఒక్కోదానికి రూ.10 తీసుకుంటారు.