హైదరాబాద్, వెలుగు: బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీలో జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వీడట్లేదు. మొన్నటి వరకు ఆలస్యంగా అయినా సవ్యంగా అందిన సర్టిఫికెట్లు ప్రస్తుతం తప్పులతడకగా వస్తున్నాయి. కొత్త టెక్నాలజీతో మీసేవా కేంద్రాల ద్వారా జారీ చేస్తున్నప్పటికీ తరచూ తలెత్తుతున్న టెక్నికల్ సమస్యలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. డెత్‌సర్టిఫికెట్ కోసం అప్లై చేస్తే బర్త్ సర్టిఫికెట్రావడం, పేర్లు, అడ్రస్‌లు తప్పుగా ప్రింట్అవ్వడం ఇలా అనేక తప్పులు దొర్లుతున్నాయి. అప్లై చేసిన రెండు, మూడు నెలలు తర్వాత జారీ చేస్తున్న సర్టిఫికెట్లలోని తప్పులను సరిదిద్దుకునేందుకు బాధితులు జీహెచ్ఎంసీ ఆఫీసులు, హాస్పిటల్స్, మీసేవాల చుట్టూ తిరుగుతున్నారు. కొంత మందికి ఎక్కడకి వెళ్లినా సరైన సమాధానం రాకపోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే గతంలో జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీసుల్లో బర్త్, డెత్ సర్టిఫికెట్లకి సంబంధించిన పూర్తి సమాచారం ఉండేది. కొత్త విధానం అందుబాటులోకి వచ్చాక అక్కడ కూడా పూర్తి వివరాలు చెప్పడం లేదు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కొత్త విధానాలను అందుబాటులోకి తెస్తున్నప్పటికీ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
పాత పద్ధతిలో ఇవ్వాలని డిమాండ్
గతంలో బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల అప్లికేషన్ల నుంచి జారీ వరకు అంతా జీహెచ్ఎంసీ ఆఫీసర్లే చూసుకునేవారు. హాస్పిటల్స్, ఇండ్లలో పుట్టినా, చనిపోయినా సర్టిఫికెట్ల జారీలో పెద్దగా ఇబ్బందులు ఉండేవి కాదు. కాకపోతే కాస్త ఆలస్యంగా అందేవి. కానీ ప్రస్తుతం మొత్తం బాధ్యత మీ సేవా కేంద్రాలదే. ఆ కేంద్రాల నుంచి వస్తున్న దరఖాస్తులను పరిశీలించి అప్రూవల్ ఇవ్వడం మాత్రమే బల్దియా ఆఫీసర్ల పని. దీంతోనే మీసేవా కేంద్రాల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బర్త్, డెత్సర్టిఫికెట్గురించి ఎలాంటి సమాచారం అడిగినా తమకు తెలియదని చెబుతున్నారు. లబ్ధిదారులు తిరిగి బల్దియా, హాస్పిటల్స్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పాత విధానంతోనే సర్టిఫికెట్లు జారీ చేయాలని
కోరుతున్నారు.
డైలీ ఫిర్యాదులు
జీహెచ్ఎంసీ ఐటీ వాళ్లకు కూడా కొత్త టెక్నాలజీలో తరచూ ఎదురవుతున్న టెక్నిల్ సమస్యలు అర్థం కావట్లేదు. ఒక సమస్యకు పరిష్కారం చూపగానే మరో సమస్య వస్తోంది. సాఫ్ట్ వేర్మార్చాలనే అంశంపై ఆఫీసర్లు చర్చించుకున్నట్లు తెలిసింది. అలాగే డైలీ ప్రజల నుంచి ఫిర్యాదులు పెరుగుతుండడంతో ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తున్నారు. తప్పులు ఇలాగే కొనసాగితే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ విధానాన్నే మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టెక్నికల్ సమస్యతో తప్పుడు సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయని డైలీ బల్దియా ఆఫీసులకు ఐదారు ఫిర్యాదులు వస్తున్నాయి. సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని మంత్రులు, ఆఫీసర్లుకు ట్విట్టర్ లో కంప్లైంట్లు పెరిగిపోతున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి14న సాంబశివుడి అనే వ్యక్తి గ్రేటర్ పరిధిలో చనిపోగా కుటుంబ సభ్యులు గోషామహల్ సర్కిల్ ఆఫీసులో డెత్ సర్టిఫికెట్ కోసం అప్లయ్ చేశారు. ఈ నెల 17న గోషామహల్ మెడికల్ ఆఫీసర్డెత్ సర్టిఫికెట్ జారీ చేశారు. కాగా సర్టిఫికెట్లో చనిపోయిన స్థలం ఏపీలోని అనంతపురం జిల్లా గార్లెదిన్నె మండలం కనంపల్లి గ్రామం ఉంది. దాన్ని చూసిన మృతుడి కుటుంబ సభ్యులు ఆఫీసర్లను సంప్రదించగా టెక్నికల్ ప్రాబ్లంతోనే ఇలా వస్తున్నాయని చెబుతున్నారు.
బేగంపేట సర్కిల్ పరిధిలో ఇటీవల జన్మించిన ఓ చిన్నారి బర్త్ సర్టిఫికెట్ కోసం కుటుంబ సభ్యులు మీసేవా కేంద్రంలో అప్లయ్ చేయగా బర్త్‌కు బదులుగా డెత్ సర్టిఫికెట్ జారీ అయింది. దాన్ని చూసిన కుటుంబ సభ్యులు జీహెచ్ఎంసీ ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నికల్ ప్రాబ్లంతోనే ఇలా జారీ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఏడాది జనవరి14న చనిపోయిన తన మామయ్య డెత్ సర్టిఫికెట్లో పర్మినెంట్ అడ్రస్‌లో కొన్ని మార్పులు చేయాలని దీపా అనే సిటిజన్నెలరోజులుగా సిటీలోని మీసేవా, జీహెచ్ఎంసీ ఆఫీసుల చుట్టూ తిరుగుతోంది. ఎలాంటి స్పందన లేకపోవడంతో సమస్యను వివరిస్తూ దీపా ఆరు రోజుల కింద మంత్రి కేటీఆర్ ను ట్యాగ్చేస్తూ ట్వీట్ చేశారు.