బిందేశ్వరి ప్రసాద్ మండల్ (బీపీ మండల్) ఆగస్టు 25, 1918న బిహార్ రాష్ట్రంలో జన్మించారు. మదేపురలోని జమీందార్ రాస్ బిహారీ లాల్ మండల్ కుమారుడు. కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుడైన ఆయన స్వాతంత్ర్య ఉద్యమాన్ని బలపరుస్తూ బ్రిటిష్ వారిపై పోరాడారు. బీపీ మండల్ దర్భంగా హైస్కూల్ లో చదివే రోజుల్లో హాస్టల్లో కింది కులాల విద్యార్థులపై జరిగే వివక్ష మీద తిరుగుబాటు చేశారు. ఎక్కువ కులాలు, తక్కువ కులాలు అనే తేడా లేకుండా ఆ హాస్టల్లో విద్యార్థులందరూ కలిసి భోజనం చేయడం వారి పోరాట ఫలితమే. డిగ్రీని పూర్తి చేసి 1946 నుంచి 1951 వరకు బిహార్లో హానరరీ మెజిస్ట్రేట్ గా (ఒక్క రూపాయి జీతం తీసుకుంటూ) పనిచేశారు. మొదటి సార్వత్రిక ఎన్నికలలో బిహార్ రాష్ట్ర విధానసభకు ఎన్నికయ్యారు. బిహార్ రాష్ట్రంలో ఒక గ్రామంలోని దళితులపై అగ్రకుల భూస్వాముల దాడిని నిరసిస్తూ అసెంబ్లీలో ప్రసంగిస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పుడు వారు ట్రెజరీ బెంచెస్ను వదిలి ప్రతిపక్షం నుంచి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
మండల్ పోరాట స్ఫూర్తిని గమనించిన డాక్టర్ రామ్ మనోహర్ లోహియా వారిని సోషలిస్ట్ పార్టీలోకి ఆహ్వానించి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. తరువాత పార్టీని అధిక సంఖ్యలో శాసనసభ్యులను మండల్ గెలిపించారు. అనంతరం కొన్ని కారణాలవల్ల విభేదించిన మండల్ శోషిత్ దళ్ అనే పార్టీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ సహకారంతో 1968లో బిహార్ ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ నాయకుల కరప్షన్ పై అయ్యంగార్ కమిటీ రిపోర్టును శాసనసభలో మండల్ ప్రవేశపెట్టడం నచ్చని ఇందిరా గాంధీ వారికి మద్దతును ఉపసంహరించారు. దాంతో మండల్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి తిరిగి లోక్ సభ ఉప ఎన్నికలలో గెలిచి పార్లమెంటుకు వెళ్లారు. జయప్రకాశ్ నారాయణ సంపూర్ణ విప్లవం పిలుపుకు స్పందించి తన సభ్యత్వానికి రాజీనామా చేసి ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా జైలుకు వెళ్లడం జరిగింది.
మండల్ కమిషన్ ముందు రెండు ప్రతిపాదనలు
1977లో జనతా పార్టీలో భాగంగా తిరిగి ఎంపీగా గెలుపొందారు. ప్రధాని మొరార్జీ దేశాయ్ వీరిని రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్ అధ్యక్షునిగా నియమించారు. 1979 నుంచి 1980 వరకు రెండు సంవత్సరాలు వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ గా అధ్యయనం చేసి రిపోర్టును భారత ప్రభుత్వానికి సమర్పించారు. దానిని పాపులర్ గా మండల్ కమిషన్ రిపోర్ట్ అని పిలవబడుతున్నది. బీపీ మండల్ ప్రతిభ, నైపుణ్యతలు మండల్ కమిషన్ ద్వారా బయటి ప్రపంచానికి వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా మండల్ కమిషన్ ముందు రెండు ప్రతిపాదనలను పెట్టడమైంది. ఒకటి.. భారతదేశ సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనంపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఓబీసీలను గుర్తించడం. రెండోది..
ఓబీసీల అభ్యున్నతికై సిఫారసులను ప్రభుత్వానికి సమర్పించడం.
రాజ్యాంగ శక్తిగా ఓబీసీలు
భారతదేశ హిందూ వ్యవస్థ వందల వేల కులాలుగా విభజించబడి ఉన్నది. ఇన్ని వేల కులాలను రాజ్యాంగపరంగా ఓబీసీలుగా నిర్వచించడంతో కుల విభజన కతీతంగా ఏకీకృతమై ఓబీసీలుగా వ్యవహరించడం, గుర్తింపు పొందడం ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప పరిణామంగా చూడవచ్చు. ఓబీసీలు అంటే మండల్ వాదులుగా గుర్తింపు పొందారు. మండల్, ఓబీసీలు అంటే అధికారంగా, ఒక చైతన్యంగా, ఒక మొబిలైజేషన్ గా, ఒక ఆత్మగౌరవంగా, డిగ్నిటీకి సంబంధించినది. సమానత్వంతో కూడిన రాజ్యాంగ సమ సమాజం వైపు భారతజాతి పురోగమించడానికి పెద్దఎత్తున ఉపకరిస్తుంది. ఇది భారతజాతి గర్వించదగిన నిజమైన నిర్మాణాత్మక అడుగు.
బీజేపీ పాలనలో రిజర్వేషన్లు నిర్వీర్యం
మండల కమిషన్ రిపోర్టులో 40 సిఫార్సులను చేయడమైనది. ప్రభుత్వం విద్య, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పటికీ అవి పాక్షికంగానే మిగిలిపోతున్నాయి. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణలో భాగంగా పబ్లిక్ సెక్టార్ కార్పొరేట్ల పరమవడంతో రిజర్వేషన్లు నిర్వీర్యం అవుతున్న స్థితి. గత పది ఏండ్లుగా బీజేపీ పాలనలో జరుగుతున్న వాస్తవం ఇది. మిగిలిన 38 సిఫార్సులను కాంగ్రెస్, బీజేపీ పెద్దగా పట్టించుకో లేదు. ప్రధానంగా ప్రమోషన్లలో రిజర్వేషన్లు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు సిఫార్సు చేసినప్పటికీ అమలుకు నోచుకోలేకపోతున్నాయి.
పట్టని ప్రాధాన్యతా అంశాలు
27% విద్య, ఉద్యోగాలలో మాత్రమే రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మండల్ కమిషన్ సిఫార్సులలో భాగమైన వయోజన విద్య, రెసిడెన్షియల్ విద్య, సామాజిక, సాంస్కృతిక మార్పుకు సిఫార్సు చేసినప్పటికీ అవి ప్రాధాన్యతా అంశాలుగా ప్రభుత్వం చూడటం లేదు. మండల్ కమిషన్ నివేదికను ఆమోదించి 34 సంవత్సరాలు గడిచినా పూర్తి రిపోర్టును కేంద్ర ప్రభుత్వం ఈనాటికి అమలు చేయడానికి నిరాకరిస్తున్నది. మండల కమిషన్ కులగణనను కూడా జరపాలని వ్యక్తం చేసింది. కులగణన లేకుండా రిజర్వేషన్లను పెంచడం సాధ్యంకాదు. 52% ఓబీసీల ఉన్నతిని అడ్డుకోవడం. భారతదేశ వెనుకబాటుతనాన్ని కొనసాగించడమే. రాజ్యాంగ అధికారం కోసం ఓబీసీలు మరో రాజ్యాంగ పోరాటానికి ముందుకురావాలి.
వెనుకబడిన తరగతులుగా.. 3,743 కులాల గుర్తింపు
మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ ఓబీసీలను గుర్తిస్తూ పలు సిఫార్సులను చేసినప్పటికీ భారత ప్రభుత్వం ఆమోదించలేదు. ఆనాటి ప్రభుత్వం రిపోర్టును తిరస్కరించింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో ఓబీసీలను గుర్తిస్తూ వారి ఉన్నతికి తోడ్పాటు అందించవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దాంతో పలు రాష్ట్రాలు దాదాపు 10 నుంచి 15 కమిషన్ల/కమిటీల రిపోర్టులను సమర్పించినప్పటికీ కోర్టులు పలు స్థాయిలలో తిరస్కరించాయి. వాస్తవాధారిత సమాచారంతో శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేయాలని ముఖ్యంగా కోర్టులు సూచించాయి. రెండో వెనుకబడిన తరగతుల కమిషన్/మండల్ కమిషన్ 1979 నుంచి 80 వరకు సామాజిక, ఆర్థిక, విద్య, భౌగోళిక పరమైన పలు అంశాలను అన్ని రాష్ట్రాలలో తిరిగి అధ్యయనం చేసి రిపోర్టును తయారు చేయడమైనది. పలు రాష్ట్రాలలోని జిల్లా స్థాయిలలో ప్రశ్నావళితో సామాజిక వెనుకబాటుతనంపై అన్ని కులాలను అధ్యయనం చేశారు. అత్యున్నత స్థాయి రీసెర్చ్ సంస్థలు పాల్గొనడంతో సమాచార ఆధారిత శాస్త్రీయ అధ్యయనంతో అత్యంత ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ విశ్లేషించడంతో 3,743 కులాలను వెనుకబడిన తరగతులుగా గుర్తించారు.
ALSO READ : పేషెంట్లు పెరుగుతున్రు.. డాక్టర్లు తగ్గుతున్రు!
మండల్ కమిషన్ సిఫార్సులకు సుప్రీంకోర్టు ఆమోదం
ఓబీసీలను నిర్వచించడం అత్యంత క్లిష్టమైన అధ్యయనం అయినప్పటికీ మండల్ సుసాధ్యం చేశాడు. ఇది దేశ చరిత్రలో ఒక గొప్ప పరిణామం. దీని ద్వారా దేశంలోని 52% జనాభా వెనుకబడిన తరగతులకు చెందినట్లుగా పేర్కొనబడింది. ఇందులో 43.4% హిందూ కులాలకు చెందినవారు, 8.3% మైనారిటీ కులాలకు చెందినవారు. మండల్ కమిషన్ రిపోర్ట్ ను ఆనాటి జనతా నాయకత్వంలోని ప్రధానమంత్రి వీపీ సింగ్ ఆధ్వర్యంలో ఆగస్టు 7, 1990లో పార్లమెంటు ఆమోదించడమైనది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యతిరేకించడం, తదనంతరం ఓబీసీ రిజర్వేషన్ల కోసం ఉత్తర భారతదేశంలో విద్యార్థి ఉద్యమం చేపట్టడం, రామ జన్మభూమి రథయాత్రను జరపడం వెనువెంటనే జరిగిపోయాయి. చివరకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో వాదనల అనంతరం 9మంది జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం మండల్ కమిషన్ సిఫార్సులు శాస్త్రీయమైనవిగా గుర్తించి, మండల్ కమిషన్ అనుకూల తీర్పును నవంబర్ 16, 1992లో వెలువరించింది.
- ప్రొఫెసర్ సింహాద్రి సోమనబోయిన, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, సమాజ్వాది పార్టీ