తెలంగాణ ఉద్యమ ఊపిరి లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

ఆదిలాబాద్​ నెట్​వర్క్, వెలుగు: తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నిర్మల్ లోని ఆయన కాంస్య విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తో కలిసి మంత్రి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తె లంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహనీయుడు కొండా బాపూజీ అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పతాక స్థాయికి చేరుకుందన్నా రు. 

స్థానిక కలెక్టరేట్ లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ వరుణ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ తదితరులు పూలదండలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర పోరాట యోధుడు, మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. పట్టణంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ చౌక్​లో నిర్వహించిన జయంతి వేడుకల్లో కలెక్టర్ ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి పాల్గొన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి రాజలింగు, రాష్ట్ర డైరీ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఆసిఫాబాద్​ కలెక్టరేట్ ​సమావేశ మందిరంలో  కలెక్టర్ హేమంత్ సహదేవ్ రావు, జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి బాపూజీ ఫొటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం రాకముందు లక్ష్మణ్ బాపూజీ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తొలి దశ, మలిదశ ఉద్యమాలలో తెలంగాణ సాధనకు కృషి చేశారని అన్నారు. జిల్లాలో కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నార్ రమేశ్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జన్నారంలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో, కుంటాలతో పాటు మండలంలోని కల్లూర్, ఓల తదితర గ్రామాల్లో జయంతిని ఘనంగాజరుపుకున్నారు.