ఓ సారి అమెరికాలో 75 అడుగుల ఎత్తులోఉన్న ఒక మెషీన్ పనితనాన్ని పరిశీలించాల్సి వచ్చింది. అక్కడున్న వారు ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు ఇండియా తరఫున వచ్చిన ఒక ఇంజినీర్ 75 అడుగుల పైకి నిచ్చెన ద్వారా ఎక్కి ఆ మెషీన్‌ని ఇన్స్పెక్షన్ చేసి దిగాడు. అప్పటికాయన వయసు 85 ఏళ్లు. ఈ సంఘటన ఆయనలోని కర్తవ్యనిష్టకు, నిరాడంబరతకు నిదర్శనం.
వివిధ హెూదాల్లో పని చేస్తూ ఇంజనీరింగ్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. కర్ణాటకలో కృష్ణసాగర్ డ్యాం, భద్రావతి స్టీల్ ప్లాంట్, మైసూర్ సాండల్ సోప్ ఫ్యాక్టరీ ఆయన ఆధ్వర్యంలోనే నిర్మించారు. ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్‌లో అనేక పథకాలను రూపొందించారు. సుక్కూరు పట్టణానికి సింధునది నుండి నీటిని సరఫరా చేసేందుకు అసాధ్యమైన పథకాన్ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. నీటి వృధాను అరికట్టడానికి ‘బ్లాక్ సిస్టమ్’ అనే సరికొత్త పద్దతి అమలు చేయించారు.
హైదరాబాద్‌లో మూసీ నది తరచుగా నగరాన్ని వరదలతో ముంచెత్తేది. మూసీ నదిపై ఫ్లడ్ కంట్రోల్ స్కీమ్‌ని సూచించమని అప్పటి నిజాం ప్రభుత్వం విశ్వేశ్వరయ్యను ఆహ్వానించగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లకు ప్లాన్ ఇచ్చారు.ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఇంజనీరింగ్ ప్రాధాన్యతను నిరూపించిన మహా మనిషి మోక్షగుండం. అందుకే ఆయన జయంతి( సెప్టెంబర్ 15)ని ‘ఇంజనీర్స్ డే’గా జరుపుకుంటున్నాం.
-పి.మోహన్ చారి