వీరనారి చాకలి ఐలమ్మ

వీరనారి చాకలి ఐలమ్మ... ఓ చరిత్ర. ఈ వీరవనిత పేరు లేకుండా సాయిధ పోరాట చరిత్రను ఊహించలేం. ఎంతోమందిలో స్ఫూర్తి నింపి, చైతన్యాన్ని రగిలించిన ధీశాలి ఆమె. రైతులు, కూలీలను ఏకం చేసి ఉద్యమానికి ఊపిరూలూదింది.1940-44 మధ్య కాలంలో నిజాం నవాబు ఉస్మాన్ అలీఖాన్ అనుచరుడు విస్నూర్ దేశ్ ముఖ్ రాపాక రాంచంద్రా రెడ్డి రజాకార్ల అండదండలతో సాగించిన అకృత్యాలు, ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. చుట్టు పక్కల గ్రామాలను తన ఆధిపత్యంలో ఉంచుకొని అక్రమాలు, దౌర్జన్యాలు కొనసాగించాడు. ప్రజల ధన, మాన, ప్రాణాలతో చెలగాటమాడటం అలవాటుగా మారింది. అటువంటి పరిస్థితిల్లో దేశ్ ముఖ్ గుండాలను, రజాకార్ల మూకలను ఎదిరించి, నిలిచిన వీరవనిత చాకలి ఐలమ్మ.

భూమి కోసం..

1895లో సద్దుల బతుకమ్మ నాడు బట్టలు ఉతికే చాకలి దంపతులు ఓరుగంటి మల్లమ్మ, సాయిలు నాలుగో సంతానంగా జన్మించింది ఐలమ్మ. తల్లిదండ్రులది ఉమ్మడి వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం. 11వ ఏట పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మకు లగ్గమైంది. ఆమెకు ఐదుగురు కొడుకులు, ఒక కూతురు. దొర ఇంట ఊడిగం చేసుడు, ఊరిజనం బట్టల ఉతుకుడు ఆమె రోజు వారి పని. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కావడంతో కులవృత్తే వారికి జీవనాధారం. కుటుంబం గడవడం కష్టమైన సందర్భంలో ఎదిగి వచ్చిన కొడుకులతో కలిసి ఎవుసాయం చేయాలనుకుంది. మల్లంపల్లి భూస్వామి కొండలరావుకు 40 ఎకరాల భూమి ఉండగాఅందులో కొంత భూమిని ఐలమ్మ కౌలుకు తీసుకుంది. 

దొరకు ఎదురుతిరిగి..

పాలకుర్తి పట్వారీ వీరమనేని శేషగిరిరావుకు ఐలమ్మ కుటుంబానికి విరోధం ఏర్పడింది. ఐలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తే సంఘం పట్టు కోల్పోతుందని భావించిన దేశ్ ముఖ్ పట్వారిని పిలిపించుకొని, అయిలమ్మ కౌలుకు తీసుకున్న భూమిని తన పేరున రాయించుకున్నాడు. భూమి తనదని, పండించిన ధాన్యం తనదేనని పంటను కోసుకురమ్మని వందమందిని పంపాడు. ‘ఈ భూమినాది.. పండించిన పంట నాది.. తీసుకెళ్లడానికి దొరెవ్వడు.. నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలరు’ అంటూ ఐలమ్మ దేశ్ ముఖ్, రజాకార్ల అరాచకాలపై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టింది. దొరకు సవాలు విసిరింది. బాంచన్ దొర అన్న బహుజనులు బందూక్​ చేత బట్టి ఆ దోరలను తరిమికొట్టి గడీలను స్వాధీనం చేసుకున్నారు. దున్నే వాడిదే భూమి అని భూ పోరాటాలు చేసి, దొరలు, భూస్వాముల నుంచి భూములు గుంజుకున్నారు. అయిలమ్మ భూ పోరాటం విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడిచేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు. 90 ఎకరాల దొర భూమిని కూడా ప్రజలకు పంచారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగిన పోరాటంలో ఐలమ్మ తెగువ ఎందరికో స్ఫూర్తి. ‘బాంచెన్‌ నీ కాల్మొక్తా’ అన్న జనంతో బందూక్ చేతబట్టించింది. ‘వెట్టిచాకిరీ చేసేవారు అలగా జనం కాదు, సహస్ర వృత్తులు చేసే సకలజనం’ అని చాటి చెప్పింది. నియంతృత్వ, రాచరిక, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడమే ఐలమ్మకు మనం అర్పించే నిజమైన నివాళి!.

- డా. సంగని 
మల్లేశ్వర్