- మంచిర్యాల పట్టణంలోని అండాలమ్మ కాలనీలో ఏర్పాటు
- ఇప్పటివరకు 350 కుక్కలకు సర్జరీలు, రేబిస్వ్యాక్సిన్లు
- ఒక్కో ఆపరేషన్‌కు రూ. 1,650 చెల్లిస్తున్న మున్సిపాలిటీ
మంచిర్యాల, వెలుగు : జిల్లాలో కుక్కల బెడద నివారణకు సర్కార్ చర్యలు ప్రారంభించింది. రోజురోజుకు పెరిగిపోతున్న వాటి సంతతని అరికట్టేందుకు బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఇందుకోసం మంచిర్యాల అండాలమ్మ కాలనీలో రూ.35 లక్షలతో యానిమల్ బర్త్కంట్రోల్సెంటర్ (ఏబీసీ)ను ఏర్పాటు చేశారు.
ఈ ఏడాది మే నుంచి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 350 కుక్కలకు సర్జరీలు చేశారు. జిల్లాలో సుమారు 10 వేల కుక్కలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. వీటిని పట్టుకొని సెంటర్‌కు తరలించి ఆపరేషన్లు చేసిన తర్వాత తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెడుతున్నారు. ఆడ, మగ కుక్కలకు ఆపరేషన్లు చేయడం వల్ల సంతానోత్పత్తి నిలిచిపోయి వాటి సంఖ్య తగ్గిపోతుందని చెబుతున్నారు.
ఒక్కో ఆపరేషన్‌కు రూ.1,650 చెల్లింపు
కుక్కలకు బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేయడానికి మంచిర్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో టెండర్లు పిలిచారు. హైదరాబాద్‌కు చెందిన యానిమల్ వెల్ఫేర్ సొసైటీ టెండర్ దక్కించుకుంది. కుక్కలను పట్టుకోవడం, ఆపరేషన్లు చేయడం, వాటిని నాలుగైదు రోజులు సంరక్షించడం కోసం ఒక్కో దానికి రూ.1,650 చొప్పున మున్సిపాలిటీ చెల్లిస్తోంది. ఏబీసీలో వెటర్నరీ డాక్టర్, అసిస్టెంట్‌తో పాటు ఇద్దరు వర్కర్లు పనిచేస్తున్నారు.
కుక్కలకు ఆపరేషన్లు చేసిన తర్వాత రేబిస్ వ్యాక్సిన్లు సైతం వేస్తున్నారు. నాలుగైదు రోజులు అక్కడే ఉంచి వైద్యం, ఆహారం అందిస్తున్నారు. ఆపరేషన్ చేసినట్లు గుర్తు కోసం ఒక చెవి కొసభాగాన్ని కట్ చేస్తున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత వాటిని వదిలిపెడుతున్నారు. కుక్కల సగటు జీవితకాలం పదేండ్లు కాగా, వచ్చే మూడు నాలుగు సంవత్సరాల్లో వీటి సంఖ్య సగానికి తగ్గుతుందని భావిస్తున్నారు.
పెరుగుతున్న కుక్క కాటు కేసులు
మంచిర్యాల జిల్లాలో కుక్క కాటు కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏడు నెలల వ్యవధిలోనే జిల్లావ్యాప్తంగా 3,800 కేసులు నమోదు అయ్యాయి. జనవరిలో 607, ఫిబ్రవరిలో 1,190, మార్చిలో 34, ఏప్రిల్‌లో 480, మేలో 396, జూన్‌లో 1,094 కేసులు నమోదు అయ్యాయి. 2019 నుంచి ఇప్పటివరకు 15 వేల మందికిపైగా కుక్క కాటుకు గురయ్యారు.
నిరుడు బెల్లంపల్లికి చెందిన ఓ యువకుడు సకాలంలో ట్రీట్ మెంట్ తీసుకోపోవడంతో రేబిస్‌తో చనిపోయాడు. కుక్క కాటుకు గురైన వారు నిర్లక్ష్యం చేయొద్దని, వెంటనే హాస్పిటల్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలని ఆఫీసర్లు సూచిస్తున్నారు.