హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో అక్రమాలు ఆగడం లేదు. గతంలో 36 వేల ఫేక్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు గుర్తించిన ఉన్నతాధికారులు సంస్థ సాఫ్ట్ వేర్ లో మార్పులు, చేర్పులు చేశారు. ఇకపై ఇబ్బందులు ఉండవని, అప్ లోడ్ చేసిన డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాతనే అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో ఫేక్ సర్టిఫికెట్లకు చెక్‌పెట్టొచ్చని తెలిపారు. అయితే తాజాగా సిటీలోని చాలా చోట్ల ఫేక్సర్టిఫికెట్లు జారీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్క ఫలక్‌నుమా సర్కిల్పరిధిలోనే నాన్ అవెలబిలిటీ కింద 20 సర్టిఫికెట్లు జారీ అయినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు.
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కమిషనర్ రోనాల్డ్‌రోస్ ఫలక్‌నుమా సర్కిల్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణను సస్పెండ్ చేయాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. అలాగే చార్మినార్ జోన్ పరిధిలో ఇటీవల జారీ అయిన అన్ని సర్టిఫికెట్లను వెరిఫై చేయనున్నారు. ఇకపై నాన్ అవెలబిలిటీ కింద సర్టిఫికెట్ అప్రూవల్ ఇచ్చే ముందు వెరిఫికేషన్ పూర్తయినట్లు ఓటీపీ వచ్చేలా ప్లాన్చేస్తున్నారు. మరోవైపు బర్త్, డెత్ సర్టిఫికెట్ల స్కాంపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సీరియస్ అయ్యారు.
విచారణ జరిపి రిపోర్టు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీ బర్త్, డెత్సర్టిఫికెట్ల జారీలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహారెడ్డి, మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్, గన్ ఫౌండ్రీ కార్పొరేటర్ డాక్టర్ సురేఖ బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మితోపాటు కమిషనర్ రోనాల్డ్ రోస్ ను కలిసి కోరారు. తాజాగా ఓల్డ్ సిటీలో దాదాపు వంద ఫేక్సర్టిఫికెట్లు జారీ చేశారని ఆరోపించారు.