గద్వాల, నాగర్ కర్నూల్ , వెలుగు: అంధులు చదువుకునేందుకు అవకాశం కల్పించిన లూయిస్ బ్రెయిలీ 214వ జయంతిని దివ్యాంగులు, వెల్ఫేర్ అధికారులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం గద్వాల టౌన్ రాఘవేంద్ర కాలనీలో అంధుల ఆశ్రమ స్కూల్, నాగర్ కర్నూల్ జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసులో బ్రెయిలీ ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కేట్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో గద్వాల శిశు సంక్షేమ, దివ్యాంగుల శాఖ ఆఫీసర్ ముసాయిదా బేగం, నాగర్‌కర్నూల్ ఇన్‌చార్జి వెల్ఫేర్ ఆఫీసర్ పాల్గొన్నారు.
ఫ్యూచర్‌లో యూత్‌దే కీ రోల్
మహబూబ్‌నగర్, వెలుగు : ఫ్యూచర్‌లో యువతే కీ రోల్ పోషిస్తుందని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాలకు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడలపై దృష్టి పెట్టాలని సూచించారు. యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీయడంతో పాటు, కళలను ప్రోత్సహించేందుకు మహబూబ్‌నగర్‌లో ఈ నెల 9, 10 తేదీల్లో రాష్ట్రస్థాయి యువజన ఉత్సవాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 33 జిల్లాల నుంచి 1,500 మంది కళాకారులు పాల్గొంటారని చెప్పారు. అంతకు ముందు స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆఫీస్ వద్ద రూ. 13 లక్షలతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం షాసాబ్ గుట్ట నుంచి మర్లు, బైపాస్ రోడ్ వరకు రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. సమీపంలోనే నిర్మాణంలో ఉన్న మినీ ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్డు పనులను తనిఖీ చేశారు. వార్డులో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు వేసిన్రు.. నీళ్లు మరిచిన్రు
రాజాపూర్, వెలుగు: రాజపూర్ మండలం మల్లేపల్లిలో వారం కింద 15 ఫైనాన్స్ కమిషన్ నిధులతో గ్రామ సర్పంచ్ భర్త సీసీ రోడ్డును వేశారు. కానీ, నీళ్లు పోయడం మరిపోయారు. రోడ్డుగా గట్టిపడాలంటే రెండు వారాల వరకు కట్టలు కట్టి క్యూరింగ్ చేయాలి. అటుగా వాహనాలను వెళ్లనివ్వొద్దు. కానీ, రోడ్డు వేసి క్యూరింగ్ చేయకుండానే వదిలేయండంతో ఎన్నాళ్లు ఉంటుందోనని గ్రామస్తులు మండిపడుతున్నారు.
కల్తీమద్యం అరికట్టడంలో మంత్రి ఫెయిల్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : కల్తీ మద్యం అరికట్టడంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అధికారులు ఫెయిల్ అయ్యారని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కుమార్ ఆరోపించారు. బుధవారం నాగర్ కర్నూల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ముందు బీఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ మంత్రి ఇటీవల నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీలో నిర్వహించిన అధికారుల మీటింగులో కల్తీ కల్లు, మద్యంపై ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని చెప్పారని గుర్తుచేశారు. అందుకే శాంపిల్స్ సేకరించి హైదరాబాద్‌కు పంపుతున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
కల్తీ మద్యంతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు డిమాండ్ చేశారు. లిక్కర్ తాగి మరణించిన నల్లవెల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య, కుమ్మెర గ్రామానికి చెందిన ఉషన్న కుటుంబ సభ్యులను బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్తీ మద్యంతో ప్రాణాలు పోతున్నా.. సర్కారు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు శ్రీనివాస్, అశోక్, కాశన్న, రామయ్య, మహేశ్ పాల్గొన్నారు.
హాస్టళ్లలో క్వాలిటీ ఫుడ్ పెట్టాలి
నారాయణపేట, వెలుగు: హాస్టళ్లలో స్టూడెంట్లకు నాణ్యమైన భోజనంతో పాటు మెరుగైన విద్యను అందించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో బీసీ, ఎస్సీ శాఖల అధికారులు, హాస్టల్ వార్డెన్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పారిశుధ్య కార్మికులతో శుభ్రం చేయించాలని సూచించారు. లైటింగ్, మరుగుదొడ్లకు రిపేర్లు చేయించాలన్నారు. జిల్లాలో ఉన్న 22 బీసీ, ఎస్సీ హాస్టళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ఇదివరకే కెమెరాలు ఉంటే రిపేర్ చేయించాలని ఆదేశించారు. ఇంటర్, టెన్త్ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా స్పెషల్ క్లాసులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ కన్యాకుమారి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇందిరా, వార్డెన్లు పాల్గొన్నాను.
చెప్పకుండా నిధులెట్ల డ్రా చేస్తరు?
మండల సభను బహిష్కరించిన సర్పంచులు
అమనగల్లు, వెలుగు: తమకు సమాచారం ఇవ్వకుండా ఈఎంఐల పేరుతో నిధులు ఎలా డ్రా చేస్తారని సర్పంచులు ప్రశ్నించారు. బుధవారం కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడ్గుల రైతు వేదిక భవనంలో ఎంపీపీ పద్మా రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. నిధుల డ్రాపై అసంతృప్తితో ఉన్న సర్పంచులు సభ ప్రారంభంలోనే మీటింగ్‌ను బహిష్కరించి వేదిక ముందు ధర్నా చేపట్టారు. వీరికి ఎంపీటీసీలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాక్టర్ ఈఎంఐ, డీజిల్ , కరెంటు బిల్లులు, సిబ్బంది జీతాల పేరుతో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు నిధులు డ్రా చేశారని ఆరోపించారు. 15 వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా ఖర్చు చేసుకోవచ్చే ఆదేశాలతో సర్పంచ్, ఉప సర్పంచ్‌లతో డిజిటల్ చేయించిన అధికారులు.. కీని వారి వద్దే ఉంచుకోవడం సరికాదన్నారు. పంచాయతీలకు మంజూరైన నిధులపై సర్పంచులకు ఎస్ఎంఎస్ అలర్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు యాదిరెడ్డి, లక్ష్మయ్య, రవీందర్ రెడ్డి,పుష్పలత, జంగయ్య యాదవ్, పద్మ, స్వప్న , ఎంపీటీసీలు కొత్త పండు గౌడ్, నారమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు .
ఇండ్ల కేటాయింపులో పేదలకు అన్యాయం
మహబూబ్ నగర్(భూత్పూర్), వెలుగు:భూత్పూర్ మున్సిపాలిటీలోని సిద్దాయపల్లి గ్రామం వద్ద నిర్మించిన 288 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో పేదలకు అన్యాయం చేశారని బీజేపీ రాష్ట్ర నాయకుడు సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం అమిస్తాపూర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమిస్తాపూర్, సిద్దాయపల్లిలో వసురాం తండా, నల్లగుట్ట తండా, రాందాస్ తండాలో ఎంతో మంది నిరుపేదలు ఉన్నా ఇండ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకుల కనుసన్ననల్లో పని చేస్తున్న వారికి మాత్రమే ఇండ్లు కేటాయించారని మండిపడ్డారు. అధికారులు మళ్లీ ఎంక్వైరీ చేసి అర్హులకు ఇండ్లు ఇవ్వాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎగ్గని నర్సిములు, పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్, ప్రధాన కార్యదర్శి సదానంద్, కౌన్సిలర్ ఎండీ ఫరూఖ్, నేతలు నర్సింహారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, అమిస్తాపూర్, సిద్దాయపల్లికి చెందిన లబ్ధిదారులు పాల్గొన్నారు.