HBDPrabhas: ఆరడుగుల ఎత్తు.. గంభీరమైన స్వరం.. కండలు తిరిగిన దేహం..రాజంటే ఇలా ఉండాలి అనేలా

HBDPrabhas: ఆరడుగుల ఎత్తు.. గంభీరమైన స్వరం.. కండలు తిరిగిన దేహం..రాజంటే ఇలా ఉండాలి అనేలా

ప్రభంజనమైన ప్రేక్షకుల హృదయాలను గెలిచిన నటుడు ప్రభాస్ (Prabhas). తన మంచి మనసుతో..మాట్లాడే తీరుతో ఇండస్ట్రీ ప్రముఖుల నుంచే కాకుండా..దేశ వ్యాప్తంగా అశేష అభిమాన బలాన్ని సంపాదించుకున్న నటుడిగా ఖ్యాతి పొందారు. బాహుబ‌లి ముందు బాహుబ‌లి త‌ర్వాత ప్రభాస్ స్థాయి శిఖ‌రం ఎత్తుకు అమాంతం పెరిగింది. ఇవాళ బుధవారం (అక్టోబర్‌ 23న) ప్రభాస్ 45వ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం.

ప్రస్తుతం ప్రభాస్ జ‌యాప‌జ‌యాల‌తో ఏ మాత్రం సంబంధం లేకుండా వరల్డ్ వైడ్గా స్టార్ డ‌మ్ని ఆస్వాధిస్తున్నాడు. కేవ‌లం భారత దేశంలోనే కాకుండా..ప్ర‌పంచ దేశాల్లో ప్రభాస్కు ఉన్న ఫాలోవ‌ర్స్ లిస్ట్ చాలానే ఉంటుంది. అతను దగ్గరికి వచ్చే గొప్ప పాత్రలతో ప్రతి ఒక్కరికి దగ్గరయ్యాడు. అలాగే పాన్ ఇండియా హీరో అనే టైటిల్ కు న్యాయం చేసే ఏకైక హీరో ప్రభాస్ కావడం విశేషం.

ఒకప్పటి తెలుగు సినిమా అంటే కమర్షియల్. అడపాదడపా వచ్చే ఫ్యామిలీ చిత్రాలకు మాత్రమే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండేది. నాటి తెలుగు సినిమాల కలెక్షన్లు కష్టంగా వంద కోట్ల రూపాయలు దాటేవి. ఈ లెక్కను పూర్తిగా మార్చేస్తున్నారు నేటి తెలుగు దర్శకులు, అగ్ర నటులు. ఓ అగ్ర హీరో అయితే మన తెలుగు సినీ నిర్మాతలు, దర్శకులకు అంతర్జాతీయ స్థాయిలో కలలు కనే ధైర్యం ఇచ్చాడు. ప్రభాస్ అతి ముఖ్యమైన ఐదేళ్లని బాహుబలి మూవీకి అంకితం చేశాడు. ఇటువంటి నిర్ణయాన్ని ఏ హీరో కూడా తీసుకోలేడు కూడా.

ఒకప్పుడు కృష్ణుడు, రాముడు అంటే ఎన్టీఆర్ గుర్తొచ్చేవారు. తెరపై ఆయన ఆహార్యం అలాంటిది. అలా ఆరడుగుల ఎత్తు, గంభీరమైన స్వరం, కండలు తిరిగిన దేహంతో, అమరేంద్ర బాహుబలిలా ‘ప్రభాస్’ ఠీవీగా నడిచి వస్తుంటే, రాజంటే ఇలా ఉండాలి అనిపించేలా ప్రభాస్ శైలి ఉంటుంది.ప్రపంచవ్యాప్తంగా రూ. 2000 కోట్ల కలెక్షన్, కోట్లాది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఆ కటౌట్ కి మైనపు ప్రతిమను బ్యాంకాక్‌లో మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ప్రతిష్టించారు. కల్కి సినిమా ద్వారా మరోసారి తనదైన నటన శైలిని వరల్డ్ వైడ్ ఫ్యాన్స్కి చూపించి మరింత స్థాయికి ఎదిగాడు.

ఇలా సినిమా సినిమాకి కొత్త ధనాన్ని చూపిస్తూ.. నేటి తరం హీరోల్లో అన్ని రకాల పాత్రలు చేస్తున్న హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు ప్రభాస్. పురాణ, సాంఘీక, జానపద, ఫిక్షన్.. ఇలా పాత్ర ఏదైనా, కథ ఏదైనా ఒకే ఆప్షన్ గా మారిపోయాడు ప్రభాస్. దీంతో ప్రభాస్ ఫాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మాస్ హీరో గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

20 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు..

గత 20 ఏళ్లుగా ‘ప్రభాస్’ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. వరదలు వచ్చినపుడు,కొవిడ్ సమయంలోనూ భారీ విరాళాలు ఇచ్చారు. అలాగే 1650 ఎకరాల ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూమిని దత్తత తీసుకోవడమే కాక అందులో తన తండ్రి పేరు మీద ఎకోపార్క్ అభివృద్ధికి కావాల్సిన ఎన్నో సౌకర్యాలు సమకూర్చారు.

ఇలా రెబల్ స్టార్ గా మాత్రమే కాక మంచి మనసున్న మహారాజుగా అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ‘ప్రభాస్‌’. ఆయన మరెన్నో అద్భుత విజయాలు సాధించాలని కోరుతూ అక్టోబర్‌ 23న పుట్టినరోజు సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు.

యంగ్ రెబల్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సినీ స్టార్స్ తో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల యూనిట్ సభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

  • Beta
Beta feature