ఇవాళ గోవింద 59వ బర్త్​ డే.. ఆయన నటించిన టాప్ 10 హాస్య చిత్రాలివే

ఇవాళ  గోవింద 59వ బర్త్​ డే..  ఆయన నటించిన టాప్ 10 హాస్య చిత్రాలివే

కేవలం ఒకే జోనర్ కు పరిమితం కాకుండా కామెడీ, ఫ్యామిలీ, సోషల్ డ్రామా నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో నటించి, బాక్సాఫీస్ వద్ద హిట్లు కొట్టిన బాలీవుడ్ నటుడు గోవింద. నేడు ఆయన 59వ పుట్టినరోజు. ఈ సందర్భంగా గోవింద నటించిన టాప్ 10 హాస్య చిత్రాలేంటో చూద్దాం..

1. దుల్హే రాజా

ఈ చిత్రం మంచి విజయం సాధించి గోవింద స్టార్ డమ్ ను ఎక్కడికో తీసుకెళ్లింది. హర్మేశ్ మల్హోత్రా రూపొందించిన ఈ సినిమాలో గోవిందతో పాటు ఖాదర్ ఖాన్, రవీనా టాండన్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. 1998లో రిలీజ్ అయిన ఈ మూవీ భారతీయ అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా చెప్పొచ్చు. ఈ మూవీలో ఖాదర్ ఖాన్, గోవిందాల మధ్య జరిగే గొడవ సంభాషణ చాలా సరదాగా అనిపిస్తుంది. 

2. హీరో నెం.1

డేవిడ్ ధావన్ డైరెక్షన్ లో వచ్చిన రొమాంటిక్ కామెడీ చిత్రం హీరో నెం.1. ఖాదర్ ఖాన్, పరేష్ రావల్, కరిష్మా కపూర్ కూడా ఈ సినిమాలో నటించి మెప్పించారు. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ చిత్రాల జాబితాలో ఒకటిగా నిలిచింది. జీవితంలో ప్రేమను పొందాలంటే.. ఏదైనా చేయాలనే నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో గోవింద నటనకు చాలా ప్రశంసలు వచ్చాయి.

3. బడే మియాన్ చోటే మియాన్

1998లో రిలీజైన ఈ మూవీలో గోవింద, అమితాబ్ బచ్చన్ లు దొంగలుగా ద్విపాత్రాభినయం చేశారు. వీరిద్దరి పవర్ ప్యాక్ట్ ఫర్ఫార్మెన్స్ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేలా చేసింది. ఇక డేవిడ్ ధావన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో హృదయాన్ని ఆకట్టుకునే సీన్స్ తో పాటు యాక్షన్ స్వీక్వెన్స్ కూడా అందర్నీ ఆకట్టుకుంటాయి. అమితా బ్ కామెడీ సీన్స్ ఈ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి.

4. హసీనా మాన్ జాయేగీ

డైరెక్టర్ డేవిడ్ ధావన్ దర్వకత్వంలో గోవింద నటించిన మరో బ్లాక్ బస్టర్ హిట్ హసీనా మాన్ జాయేగీ. ఈ సినిమాలో సంజయ్ దత్, కరిష్మా కపూర్, అనుపమ్ ఖేర్, ఖాదర్ ఖాన్ లతో పాటు పూజా బాత్రా కూడా పలు పాత్రల్లో నటించి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా వీక్షకులను నవ్వుల్లో ముంచెత్తడమే కాకుండా, చూసిన వారందరికీ మానసికంగా ఉల్లాసాన్ని కలిగిస్తుంది.

5. హద్ కర్ ది ఆప్నే

గోవింద నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం రొమాంటిక్ కామెడీకి చెందిన చిత్రాలే ఎక్కువ. ఈ మూవీలో నటనకు గోవిందకు మంచి పేరు రావడమే గాక, అతని కెరీర్ లోనే మరపురాని చిత్రంగా నిలిచింది. మనోజ్ అగర్వాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాణీ ముఖర్జీతో పాటు, జానీ లీవర్ కూడా నటించారు.

6. భాగమ్ భాగ్

ప్రియదర్శన్ దర్శత్వంలో వచ్చిన ఈ సినిమా భారతీయ చలనచిత్రాల్లో వచ్చిన అత్యంత హాస్యాస్పద చిత్రాలలో ఒకటిగా నిలిచింది. థ్రిల్లర్, కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, పరేష్ రావల్ కూడా నటించారు. అంతేకాదు ఈ సినిమాలోని నటులకు సైతం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

7. పార్ట్ నర్

రొమాంటిక్ అండ్ కామెడీ కథాంశంగా వచ్చిన ఈ చిత్రంలో గోవిందతో పాటు, ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ కూడా నటించారు. వీరిద్దరి నటనతో సినిమా బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలోని చమత్కారమైన డైలాగులు, నవ్వించే సన్నివేశాలు ఉండడం వల్ల మంచి విజయం సాధించింది. డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లారా దత్తా, కత్రినా కైఫ్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు.

 

8. అఖియోన్ సె గోలి మారే

2002లో ఈ సినిమా రిలీజ్​ అయింది. దుల్హే రాజా అనే పాట నుంచి ఈ చిత్రం టైటిల్ ను తీసుకున్నారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచే కాక, విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. సినిమాలోని ఖాదర్ ఖాన్, గోవిందల మధ్య సాగే ఫన్నీ యాస సన్నివేశాలు మరింత నవ్వును తెప్పిస్తాయి.

9. కూలీ నెం.1

గోవింద తన కెరీర్ లో చేసిన అనేక సినిమాల్లో కూలీ నెం.1 ఇప్పటికీ స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది. డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఖాదర్ ఖాన్, కరిష్మా కపూర్, శక్తి కపూర్ కూడా నటించారు. ఇదే మూవీని 2020లో నటులు వరుణ్ ధావన్, సారా అలీ ఖాన్ కలిసి రీమేక్ చేశారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను ప్రీమియర్ కూడా చేశారు.

10. జోడీ నెం.1

గోవింద, సంజయ్ దత్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. జై పాజీ, వీరూ పాజీగా నటించిన ఈ ఇద్దరి నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 2001లో వచ్చిన ఈ చిత్రంలో ట్వింకిల్ ఖన్నా, మోనికా బేడీతో పాటు అనుపమ్ ఖేర్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు.