మనోహర్​రెడ్డి నిరంకుశ వైఖరి వల్లే బీఆర్​ఎస్ ​వీడుతున్నం

సుల్తానాబాద్, వెలుగు:  పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నిరంకుశ వైఖరి వల్లే బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్టు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్. రాజయ్య ఆరోపించారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు శుక్రవారం నియోజకవర్గం నుంచి హైదరాబాద్ గాంధీభవన్ కు బయలుదేరారు. ఈ సందర్భంగా లీడర్ల కాన్వాయ్ ను రాజమల్లు కాంగ్రెస్ జెండా ఊపి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గెలుపు కోసం తాము ఎంతగానో కృషి చేసినప్పటికీ పార్టీలో సముచిత స్థానం కల్పించలేదన్నారు.  టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్​ పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేసి పార్టీ విజయం కోసం పాటుపడ్తామని చెప్పారు.  కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయరమణారావుతోపాటు మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.